కొంకణా సేన్ శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'అక్యూజ్డ్'. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమాగా ఇది రూపొందింది. హిందీతో పాటు వివిధ భాషలలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కరణ్ జొహార్ ఒక నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
గీతిక సేన్ (కొంకణా సేన్ శర్మ) 'లండన్' లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తుంటుంది. మీరా (ప్రతిభ రాంటా) కూడా ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంటుంది. స్వలింగం సంపర్కంతో కూడిన బంధం ఇద్దరి మధ్య ఉంటుంది. ఇద్దరూ కలిసి సహజీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఒక బిడ్డను దత్తత చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఇల్లు కూడా తీసుకుంటారు.
గీతికకి గల అర్హత కారణంగా ఆమెను 'డీన్'గా ప్రమోట్ చేయాలని హాస్పిటల్ యాజమాన్యం నిర్ణయించుకుంటుంది. అయితే అదే సమయంలో ఒక వార్త బయటికి వస్తుంది. గతంలో గీతిక తన దగ్గర పనిచేసే జూనియర్ లేడీ డాక్టర్లను లైంగికంగా వేధించిందనేది ఆ వార్త సారాంశం. దాంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేవరకూ 'గీతిక'ను పక్కన పెట్టేయాలనే నిర్ణయం జరుగుతుంది. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు 'భార్గవ్' అనే జర్నలిస్టును నియమిస్తారు.
తానంటే పడని వాళ్లు ఇలా ప్రచారం చేస్తున్నారని గీతిక భావిస్తుంది. అయితే ఆమె మాటలను 'మీరా' పూర్తిగా నమ్మలేకపోతుంది. తన స్నేహితుడు 'అంగద్' ద్వారా, ప్రైవేట్ డిటెక్టివ్ 'మన్సూర్' ను కలుసుకుంటుంది. గీతిక వ్యవహారంలో తనకి స్పష్టత కావాలని చెబుతుంది. దాంతో అతను గీతికను రహస్యంగా ఫాలో కావడం మొదలుపెడతాడు. అప్పుడు మీరాకి తెలిసే నిజాలేమిటి? అదే సమయంలో భార్గవ్ ను రహస్యంగా కలిసే వ్యక్తి ఎవరు? గీతికపై ఈ ప్రచారానికి పాల్పడింది ఎవరు? అనేది మిగతా కథ.
ఈ కథ 'లండన్' నేపథ్యంలో నడుస్తుంది. గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉన్న గీతిక - మీరా ఒకరినొకరు ఇష్టపడతారు .. కలిసి బ్రతుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితులలోనే గీతికకి మరింత ఎదిగే అవకాశం వస్తుంది. అయితే గతంలో ఆమె జూనియర్ డాక్టర్లుగా ఉన్న అనేక మంది యువతులను లైంగికంగా వేధించిందనే ఆరోపణలు ఆమె ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి. అలాంటి ఒక సమస్యను గీతిక ఎలా అధిగమించిందనే అంశం చుట్టూ దర్శకురాలు ఈ కథను అల్లుకున్నారు.
'లెస్బియన్స్'కి సంబంధించిన ఒక కథను ఎంచుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. అందుకు చాలానే ధైర్యం కావాలి. ఇక ఒక గౌరవ ప్రదమైన వృత్తికి సంబంధించిన నేపథ్యం నుంచి లెస్బియన్ పాత్రలు తీసుకోవడం .. లెస్బియన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం వంటి కథను డిజైన్ చేసుకోవడం కాస్త కష్టమైన విషయమే. కంటెంట్ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టకుండా చూసుకోవలసి ఉంటుంది.
అనుభూతి కశ్యప్ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించారనే చెప్పాలి. ఇది లెస్బియన్స్ నేపథ్యంలో సాగే కథనే అయినప్పటికీ, ప్రధానమైన పాత్ర ఎదుర్కొనేది లైంగిక ఆరోపణలే అయినప్పటికీ ఎక్కడా అందుకు సంబంధించిన అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. సంభాషణల పరమైన ఎమోషన్స్ ను ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది.
ఒక వైపున హాస్పిటల్లో ఆరోపణలు .. మరో వైపున ఇంట్లో తన జోడీ వైపు నుంచి అనుమానాలు .. ఇంకొక వైపున సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారాలతో గీతిక ఎలాంటి మానసిక సంఘర్షణను అనుభవంచిందనే విషయంపైనే దర్శకురాలు పూర్తి దృష్టి పెట్టారు. హాస్పిటల్ .. ఇల్లు .. రెస్టారెంట్ .. ఇలా ఎక్కడైనా కథ సాధ్యమైనంత వరకూ నాలుగు గోడల మధ్యనే నడుస్తుంది.
కథ ఒక సున్నితమైన సమస్యతో మొదలై .. ఆ సమస్యకి పరిష్కారం లభించడంతో పూర్తవుతుంది. ఈ మధ్యలో అనూహ్యమైన మలుపులుగానీ .. ఉత్కంఠను రేకెత్తించే ట్విస్టులుగాని కనిపించవు. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ లొకేషన్స్ లో నడిచే ఈ కథ, అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఏ పాత్ర కూడా ఏ వైపు నుంచి ప్రభావితం చేయదు. చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది.
సాధారణంగా ప్రీ క్లైమాక్స్ రాగానే కథ మరింత వేగాన్ని పుంజుకుంటుంది. క్లైమాక్స్ రాగానే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏదో బ్లాస్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో అలాంటి హడావిడి ఏదీ కనిపించదు. చాలా సాదాసీదాగానే ఈ కథ ముగుస్తుంది. ఈ కథతో కొత్తగా ఏం చెబుదామని ట్రై చేశారబ్బా అనే ఆలోచన కలగకుండా మాత్రం ఉండదు.
'అక్యూజ్డ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Accused Review
Movie Details
Movie Name: Accused
Release Date: 2026-02-27
Cast: Konkana Sen Sharma, Prathibha Ranta, Mashhoor Amrohi, Sukant Goel
Director: Anubhuti Kashyap
Music: Neel Adhikari
Banner: Dharmatic Entertinment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer