'శ్రీ చిదంబరం గారు' మూవీ రివ్యూ

  
''మనందరి జీవితంలో కూడా ఏదో ఒక మూల ఒక చిదంబరం ఉండే ఉంటాడు. తన లోపాలని కప్పుకుంటూ, భయాల వెనక బ్రతుకుతూ ఏ సమస్య లేని చోట కూడా అన్ని సమస్యలు వెతుక్కుంటూ ఉంటాడు. మా చిదంబరం గారు వాడి లోపాలని భయాలని జయించినట్టు మీరు కూడా మీ భయాలని లోపాలని పక్కన పెట్టి ఓసారి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూడండి మీకంటే అందంగా ఎవరూ కనపడరు. ఏ మనిషి చిదంబరంలా ఉండకూడదని కోరుకుంటూ''  ఇట్లు మీ వినయ్‌రత్నం.

 అంటూ  కొత్త దర్శకుడు వినయ్‌ రత్నం తెరకెక్కించిన 'శ్రీ చిదంబరం గారు' సినిమా ముగింపులో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఓ ఎండ్‌ కార్డ్‌ వేశాడు. ఇక ఈ ముగింపు ముక్తాయింపుకు ముందు ఉన్న కథ ఏమిటి? అసలు 'శ్రీ చిదంబరం కథ' ప్రేక్షకులను అలరించిందా? ఆడియన్స్‌కు ఈ సినిమా ఎలాంటి అనుభూతినిచ్చింది? అనేది  'శ్రీ చిదంబరం గారు' సమీక్షలో తెలుసుకుందాం.. 

చిదంబరం అలియాస్‌ సాల్మన్‌ ( వంశీ తుమ్మల) పుట్టుకతో తనకున్న మెల్లకన్ను లోపం వల్ల చిన్నప్పటి నుంచే ఎదురైన అవమానాల కారణంగా ఆత్మన్యూనతతో నలుగురిలో తిరగాలన్నా.. వాళ్లతో మాట్లాడాలన్న ఇబ్బంది పడుతుంటాడు. సోలమన్‌ అనే అసలు పేరును పక్కన పెట్టి అందరూ చిదంబరం అని పిలుస్తుంటారు. మెల్లకన్నును దాచిపెట్టుకోవడానికి పగలు, రాత్రి నల్లద్దాలు ధరించే ఉంటాడు. ఇక చిన్నప్పుడు తండ్రి తూర్పు పాల్‌ (కిట్టయ్య) ఆత్మహత్య చేసుకోవడంతో ఇంటి బాధ్యతలన్నీ ఆయనపైనే పడతాయి. తండ్రి చెసిన అప్పులు తీర్చడానికి చదువు మానేసి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుంటాడు. 

ఆ ఊరిలోనే ఉండే లీల (సంధ్య వశిష్ట) అంటే చిదంబరం అలియాస్‌ సాల్మన్‌ను ఎంతో ఇష్టం. ఆమెను ప్రేమిస్తున్న ఆ విషయాన్ని చెప్పాలంటే ధైర్యం ఉండదు. ఒకరోజు తన ప్రేమను  తెలియజేస్తాడు. అయితే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, కళ్లద్దాల చాటున భయపడుతూ ఉండకుండా అద్దాలు తీసి బయటికి కనిపించు' అంటుంది లీల. ఈ మాటలకు నొచ్చుకున్న సాల్మన్‌ అలియాస్‌ చిదంబరం, లీలకు దూరమవుతాడు. ఎలాగైనా మెల్లకన్ను లోపం నుండి బయటపడాలని అనుకున్న సాల్మన్‌ ఏం చేశాడు? ఏం జరిగింది? లీల, చిదంబరం అలియాస్‌ సాల్మన్‌, లీలల ప్రేమ గెలిచిందా?  చిదంబరం అద్దాలు తీసేసి సాల్మన్‌ ఎలా అయ్యాడు?  వంటి తదితర విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. 
 
అవిటితనం అనేది  శరీరానికి.. మనసుకు కాదు.. ప్రతి మనిషిలో లోపం ఉంటుంది. ఆలోపానే విజయంగా మలుచుకోవాలి అనే ఇన్‌స్పిరేషన్‌ కాన్సెప్ట్‌ చుట్టూ  ఓ అందమైన ప్రేమకథను అల్లుకుని.. అంతకు మించిన బ్యూటిఫుల్‌ లోకేషన్స్‌ను ఎంచుకుని సహజమైన పాత్రలతో రూపొందిన ఓ నిజాయితీ ప్రేమకథ ఇది. సాధారణంగా మనం ఇలాంటి వైవిధ్యమైన సింపుల్‌ ఎమోషన్స్‌ స్టోరీస్‌, కేరళలోని బ్యూటిఫుల్‌ లోకేషన్స్‌ యాడ్‌ అవుతూ మలయాళంలో రూపొందుతుంటాయి.  మన వాళ్లు ఇలాంటి సినిమాలు తెరకెక్కించరు? ఎందుకని? అని ప్రశ్నించే వాళ్లందరికి 'శ్రీ చిదంబరం గారు' ఒక పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌. 

ఈ సినిమాలో ఉండే నిజాయితీ, స్వచ్ఛత, సందేశం, సహజత్వం ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. చాలా సింపుల్‌ కథ చుట్టు ఎలాంటి హడావుడి లేకుండా హృదయానికి హత్తుకునే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బాల్యంలో హీరోకు ఎదురయ్యే సంఘటనలు, ఆ తరువాత చిదంబరం అలియాస్‌ తండ్రి మరణం హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ సన్నివేశాలు, హీరోయిన్‌ కోసం వికాస్‌ గ్యాంగ్‌ చేసే అల్లరి తదితర సీన్స్‌తో ప్రథమార్థం ఇట్టే అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. 

ఇక సెకండాఫ్‌లో హీరో మెల్లకన్ను లోపంను అధిగమించడానికి చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత రియలైజేషన్‌, రాజమండ్రిలో కలిసిన స్నేహితుడి ఇంట్లో జరిగే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతో క్యూట్‌గా అనిపిస్తాయి. సురేష్‌ (గోపీనాథ్‌) వాళ్ల అమ్మ నాన్నలతో లీల ఇంటికి పూలు పండ్ల కోసం వచ్చే సన్నివేశం వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. 

మనిషి మనిషికి ఒక లోపం ఉందిరా, నీకు అన్నీ ఉన్న ఈ ప్రపంచం ఎప్పుడూ  ఏదో లేదు అంటోంది,  ప్రేమ ఉన్న చోట జాలి ఉండదు. జాలి ఉన్న చోట ప్రేమ ఉండదు..  ఈ రెండు ఒకే చోట ఉండవు, ఎప్పుడూ భుజం కాసే మా నాన్న బాధ్యతలు అన్ని నా భుజాన వదిలేసి వెళ్లాడు అని సినిమాలో ఉన్న ఇలాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఫైనల్‌గా 'శ్రీ చిదంబరం గారు' నిజాయితీతో కూడిన ఓ ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. సినిమా చూస్తున్నంత సేపు ఓ అందమైన పల్లెటూరిలో.. బ్యూటిఫుల్‌ ప్రకృతితో, ఆ సహజమైన పాత్రలతో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. 

చిదంబరం అలియాస్‌ సాల్మన్‌ పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. మెల్లకన్ను ఉన్న పాత్రలో నటించడం ఎంతో కష్టం. ఇలాంటి పాత్రలో తనదైన అభినయంతో మెప్పించాడు. లీల పాత్రలో సంధ్య వశిష్ట ఎంతో సహజంగా పల్లెటూరి అమ్మాయిగా తనదైన అభినయంతో అలరించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమె గడసరితనానికి, డైలాగ్‌ డెలివరిలో ఉన్న క్యూట్‌నెస్‌తో ఆ పాత్ర ప్రేమలో పడిపోతారు. హీరోయిన్‌ తల్లిగా తులసి, హీరో తల్లిగా కల్పలతలు తమ అనుభవాన్ని నటనలో చూపించారు. సురేష్‌గా యూట్యూబర్‌ గోపీ వినోదాన్నిపండించాడు.

 సినిమాలోని ప్రతి పాత్ర తమ పరిధి మేరకు నటించి సినిమాకు సహజత్వం తీసుకొచ్చారు చందు రవి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. సాహిత్య విలువలు ఉన్న పాటలు సినిమా స్థాయిని పెంచాయి. కీరవాణి పాడిన పాట కథలో సారాంశాన్ని తెలిపే ఇన్‌స్పిరేషన్‌గా గీతంగా అందరిలో ఉత్తేజాన్ని నింపింది. అక్షయ్ రామ్ పొడిశెట్టి ఫోటోగ్రఫీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలిసింది. ముఖ్యంగా మారేడుమిల్లిలో చిత్రీకరించిన సన్నివేశాలు ఎంతో బ్యూటిఫుల్‌గా అనిపించాయి. దర్శకుడు వినయ్‌ రత్నంకు ఇదే తొలిసినిమా అయినా ఎంతో వినయంతో రత్నం లాంటి సినిమాతో తన కెరీర్‌ను ఆరంభించాడు. దర్శకుడిగా ఈయనకు మంచి భవిష్యత్‌ ఉంది. ఇక ఇలాంటి కొత్తటీమ్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత అభినందనీయుడు. 


మనిషి తనలోని లోపానికి భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలనే విషయాన్ని దర్శకుడు ఎంతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. ఈ సినిమాలో చెప్పినట్లుగా అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లటి  రాజమండ్రి రోజ్‌ మిల్క్‌ తాగితే ఎలా ఉంటుందో.. మంచి ఎండాకాలం సాయంత్రం ఆరుబయట నవరా మంచం మీద, ఆ చల్లటి గాలికి తనివితీరా నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందో 'శ్రీ చిదంబరం గారు' సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అదే అనుభూతిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అనుభవిస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

మలయాళంలో ఇలాంటి సినిమాలు వస్తాయి.. మన తెలుగులో ఇలాంటి సెన్సిటివ్‌ ఎమోషన్స్‌ సినిమాలు రావు అనే వాళ్లు ఈ చిదంబరంను చూసి ఖచ్చితంగా ఛిల్ల్‌ అవుతారు.. చిదంబరం ప్రేమలో పడతారు..  అందుకే చిదంబరం అని రివ్యూలో రాస్తే అందరికి ఈజీగా అర్థమవుతుందని తెలిసినా, ఈ సినిమా చూసిన తరువాత చిదంబరం అలియాస్‌ సాల్మన్‌ పాత్రపై పెరిగిన గౌరవంతో ప్రతి చోటా సినిమాలో అసలు పేరు అయినా సాల్మన్‌ను కూడా రాయడం జరిగింది.

Movie Details

Movie Name: Sri Chidambaram Garu

Release Date:

Cast: Vamsi Tummala, Sandhya Vasishta,Gopinath, Sivakumar Matta, Kalpalatha Garllapati, Arun Kumar, Tulasi, Naidu Moram, Shankar Rao

Director: Vinay Ratnam

Producer: Chinta Vineesh Reddy , Chinta Gopala Krishna Reddy

Music: Chandu, Ravi

Banner: Sri Chakras Entertainment

Sri Chidambaram Garu Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews