కన్నడ నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన మల్టీ స్టారర్ మూవీగా '45' కనిపిస్తుంది. శివరాజ్ కుమార్ .. ఉపేంద్ర .. రాజ్ బి శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అర్జున్ జన్య దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఆయనకి ఇదే మొదటి సినిమా. డిసెంబర్ 25వ తేదీన కన్నడలో విడుదలైన ఈ సినిమా, జనవరి 1వ తేదీన తెలుగులో రిలీజ్ చేశారు. అలాంటి ఈ సినిమా జనవరి 30 నుంచి, జీ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వినయ్ (రాజ్ బి శెట్టి) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. తల్లి తండ్రి .. ఇదే అతని కుటుంబం. తనకి వచ్చిన ఒక కల కారణంగా అతను, 'గరుడ పురాణం' గురించి తెలుసుకుంటాడు. యమలోకం .. ఆత్మ ప్రయాణం .. అక్కడి శిక్షలు గురించి తెలుసుకుని ఆందోళనకు లోనవుతాడు. కర్మ ఫలితం ఏ స్థాయిలో వెంటాడుతుందో తెలుసుకుని కంగారుపడిపోతూ ఉంటాడు.
ఒక రోజున అతను బైక్ పై ఆఫీసుకి బయల్దేరతాడు. హెల్మెట్ పెట్టుకోకపోగా .. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ సిగ్నల్స్ జంప్ చేస్తాడు. ఆ సమయంలోనే అతను ఒక కుక్కను గుద్దేస్తాడు. ఆ క్షణమే అది అక్కడ ప్రాణాలు వదిలేస్తుంది. కుక్కనే కదా అనుకుని అతను తాపీగా ఆఫీసుకి వెళ్లిపోతాడు. అయితే కొంతమంది రౌడీలు ఆఫీసుకుని వచ్చి మరీ, వినయ్ ను బలవంతంగా ఒక రహస్య స్థావరానికి తీసుకుని వెళతారు. తన కారణంగా చనిపోయింది 'డాన్ రాయప్ప' ( ఉపేంద్ర) పెంపుడు కుక్క అనే విషయం అప్పటికి వినయ్ కి అర్థమవుతుంది.
రాయప్ప .. ఆయన అనుచరులను చూసి వినయ్ భయపడిపోతాడు. తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన కుక్కని చంపిన వినయ్ ను 45 రోజులలో చంపుతానని రాయప్ప చెబుతాడు. మనిషి చనిపోయిన తరువాత అతని ఆత్మ చేసే పూర్తి ప్రయాణం 45 రోజులని తాను చదివిన విషయం గుర్తొచ్చి వినయ్ భయపడిపోతాడు. తాను ప్రేమిస్తున్న 'మేఘన'కి ఈ విషయాన్ని చెబుతాడు. దాంతో ఆమె అతణ్ణి 'శివప్ప' (శివరాజ్ కుమార్) దగ్గరికి తీసుకుని వెళుతుంది. శివప్ప ఎవరు? అతను రాయప్ప నుంచి వినయ్ ను కాపాడతాడా? ఈ ముగ్గురికీ .. గరుడ పురాణానికి గల సంబంధం ఏమిటి? అనేది కథ.
నిత్య జీవితంలో అనేక టెన్షన్స్ మధ్య నలిగిపోయే ఓ సాధారణ వ్యక్తి, 'నువ్వు పాపం చేశావు కనుక నిన్ను 45 రోజులలోగా చంపేస్తాను' అంటూ వెంటపడే ఒక డాన్ .. 'నేను ఉన్నాను గదా ఏమీ కాదులే' అని ధైర్యం చెప్పే ఒక పరిచయస్తుడు. ఈ మూడు పాత్రల మధ్య నడిచే కథ ఇది. నగరంలో మన మధ్యలో నడిచే ఈ కథకి గరుడ పురాణంతో సంబంధం ఉంటుంది. అందువలన ఆడియన్స్ కదులుతున్న కథ పట్ల కుతూహలంతో ఉంటారు.
ఆశ .. భయం .. చేసిన పాపం .. ఈ మూడు మనిషిని వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి. అందువలన ఎవడు ఎన్ని విధాలుగా ధైర్యం చెప్పడానికి ట్రై చేసినా, మనిషి భయంలో నుంచి భయంలోకే పారిపోతూ వుంటాడు. 'విధి రాతను విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేడు' అన్నట్టు, కర్మ నుంచి ఎవరూ ఎక్కడి పారిపోలేరు అనే ఒక ప్రధానమైన కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది.
తెరపై ట్రయాంగిల్ షేప్ లో ఈ మూడు పాత్రలు కనిపిస్తాయి. ఈ పాత్రల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే కర్మ నుంచి తప్పించుకోవడానికి వినయ్ చేసే ప్రయత్నాలు అంత ఆసక్తికరంగా అనిపించవు. అలాగే శివప్ప పాత్రను మలిచిన విధానంలో కూడా క్లారిటీ లోపిస్తుంది. ఇక రాయప్ప పాత్ర పవర్ఫుల్ గా కనిపించినప్పటికీ, ఆ సెటప్ అంతా కూడా అంత సహజంగా అనిపించదు.
శివప్ప ఎవరు? రాయప్ప ఎవరు? అనే సందేహాలకు క్లైమాక్స్ లో తెరదించే ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు ఆ పాత్రలను ముందు నుంచే ఆ రేంజ్ లో చూపించకుండా ఉండవలసింది అనే భావన కలుగుతుంది. ఒక సాధారణ వ్యక్తిని చంపడానికి రాయప్ప చేసే హడావిడి చూస్తే, సమస్త సైన్యంతో ఒక దేశంపైకి దండెత్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక శివప్ప అనేక శివరూపాలుగా విరుచుకుపడటం .. యమధర్మరాజుగా రాయప్ప నిజరూపాన్ని చూపించడం .. అందుకు సంబంధించిన గ్రాఫిక్స్ ఊదరగొట్టేస్తాయి.
చేసిన పాపం వెంటాడుతుంది. తప్పు తెలుసుకుని శివుడిని ఆశ్రయిస్తే, కొంతవరకూ ఆయన బయటపడేయగలుగుతాడు. లేదంటే యమధర్మరాజు చేతిలో శిక్ష తప్పదు అనే విషయాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలచుకున్నాడు. అయితే ఎంచుకున్న కథను స్పష్టంగా .. వినోదభరితంగా తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. అందువలన తెరపై ముగ్గురు స్టార్స్ ఉన్నప్పటికీ మనకి ఏమీ అనిపించదు. ఉన్న కాస్త కథను అతి గ్రాఫిక్స్ తో చెడగొట్టారేమో అని కూడా అనిపించకమానదు.
ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురూ స్టార్స్. అందువలన వాళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సత్య హెగ్డే ఫొటోగ్రఫీ .. అర్జున్ జన్య నేపథ్య సంగీతం .. ప్రకాశ్ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి. గ్రాఫిక్స్ కూడా గట్టిగానే ఉపయోగించారు. అయితే అవి అనవసరమైన హడావిడిలో ఒక భాగంగా మాత్రమే ఉండటం వలన మనకి కనెక్ట్ కావు.
దర్శకుడు ఎంచుకున్న లైన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించేదే. అయితే ఈ కథకి కామెడీని .. ఎమోషన్స్ ను జోడించి, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించలేకపోయారు. అందువల్లనే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ప్రభావితం చేయలేకపోవడం కనిపిస్తుంది.
ఫాంటసీ టచ్ తో సాగే '45'(జీ 5 మూవీరివ్యూ)
45 Review
-
Movie Details
Movie Name: 45
Release Date: 2026-01-30
Cast: Shiva Rajkumar,Upendra ,Raj B Shetty ,Rajendran,Kaustubha Mani
Director: Arjun Janya
Music: Arjun Janya
Banner: Suraj Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer