'చీకటిలో' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

-
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెలుగు నుంచి వచ్చిన మరో సినిమానే 'చీకటిలో'. శోభిత ధూళిపాళ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత ఆమె చేసిన ఈ సినిమా, నేరుగా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

సంధ్య (శోభిత ధూళిపాళ) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు (ప్రదీప్ - ఝాన్సీ) నాయనమ్మ (శ్రీ లక్ష్మీ) ఇదే ఆమె ఫ్యామిలీ. సిటీలోని ఒక టీవీ ఛానల్ లో సంధ్య జర్నలిస్ట్ గా .. యాంకర్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే ఛానల్ లో ఆమె స్నేహితురాలు బాబీ కూడా పనిచేస్తూ ఉంటుంది. మనసు చంపుకుని తన అభిప్రాయాలకు విరుద్ధంగా పనిచేయలేకపోయిన సంధ్య, అక్కడ జాబ్ మానేస్తుంది. తానే సొంతంగా ఒక పాడ్ కాస్ట్ ను ఏర్పాటు చేసుకుంటుంది. అదే సమయంలో బాబీ .. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కూడా దారుణంగా హత్య చేయబడతారు.

రియల్ క్రైమ్ స్టోరీస్ ను తన పాడ్ కాస్ట్ ద్వారా జనంలోకి తీసుకుని వెళుతూ సంధ్య పాప్యులర్ అవుతుంది. బాబీ హత్యకి సంబంధించిన ఆధారాల సేకరణ విషయంలోను ఆమె చురుకుగా వ్యవహరిస్తుంది. అయితే ఈ కేసును పరిష్కరించడం కోసం స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన రాజమణి (సురేశ్) ఆమె ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే సంధ్య కారణంగా అతను పక్కకి తప్పుకోవలసి వస్తుంది. ఆ స్థానంలో ఆనందిని (ఇషా చావ్లా) రంగంలోకి దిగుతుంది. 

సంధ్య - అమర్ (విశ్వదేవ్ రాచకొండ) ప్రేమించుకుంటారు. ఆమెతో పెళ్లికి అమర్ తల్లిదండ్రులు పద్మ - రామ్ (ఆమని - వడ్లమాని శ్రీనివాస్) ఒప్పుకుంటారు. అయితే సంధ్య తన పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి సీరియల్ కిల్లర్ ను పట్టుకునే పనిలో పడుతుంది. హంతకుడు హత్య చేసిన ప్రదేశంలో మల్లెపూలు - మువ్వలు వదిలేయడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో గోదావరి జిల్లాల్లో ఆ తరహా హత్యలు జరిగాయని తెలుసుకుని అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? తెలిసే నిజాలేమిటి? అనేది కథ.
  
'చీకటిలో .. ' అనే టైటిల్ తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే చీకటికి అవతల ఏం జరుగుతుందో తెలుకోవాలనే ఒక క్యూరియాసిటీ చాలామందిలో ఉంటుంది. అందువలన తెరపై వరుస హత్యలు ఎలా జరిగాయి? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం కథ వెంట ప్రేక్షకులు పరిగెత్తడం మొదలుపెడతారు. 'పాడ్ కాస్ట్' ద్వారా రియల్ క్రైమ్ స్టోరీస్ చెప్పే ఒక యువతీ, సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి తానే రంగంలోకి దిగడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సంధ్య ఎలా ఆధారాలు సేకరించనుంది? పోలీస్ ఆఫీసర్లు ఏం చేయనున్నారు? హంతకుడు జనం మధ్యలోనే ఉన్నాడా? అనే అంశాలు అందరిలో కుతూహలాన్ని పెంచుతూ వెళతాయి. అయితే కథలో హడావుడి తప్ప .. అసలు విషయం మాత్రం కనిపించదు. ఒక వైపు నుంచి సంధ్య .. మరో వైపు నుంచి పోలీస్ ఆఫీసర్లు .. ఇంకోవైపు నుంచి మీడియా వాళ్లు చేసే హడావిడి ఆడియన్స్  కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి కథల్లో హంతకుడు చివరివరకూ దొరకడు .. ఈ కథలో దొరికినా మనం పెద్దగా ఆశ్చర్యపోము. 

ఈ కథలో సీనియర్ హీరో సురేశ్ ను పోలీస్ ఆఫీసర్ గా రంగంలోకి దింపారు .. ఆ తరువాత అతణ్ణి కాదని మరో పోలీస్ ఆఫీసర్ గా ఇషా చావ్లాను తీసుకొచ్చారు. హీరో తల్లిగా ఆమనినీ .. హీరోయిన్ తండ్రిగా ప్రదీప్ ను చూపించారు. ఇక రవీంద్ర విజయ్ పాత్రను ఒక రేంజ్ లో పరిచయం చేశారు. నాయనమ్మగా శ్రీలక్ష్మిని తీసుకొచ్చారు. వీళ్లంతా మంచి ఆర్టిస్టులు ..  బాధపడవలసిన విషయమేమిటంటే, ఈ పాత్రలలో ఏ మాత్రం బలం లేకపోవడం.

కథాకథనాలలో కొత్తదనం కనిపించదు. ఎక్కడో ఏదో ట్విస్ట్ అనుకున్నప్పటికీ, అక్కడివరకూ ప్రేక్షకులను ఆసక్తికరంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ కథ అక్కడక్కడే తిరుగుతూ విసుగు తెప్పిస్తుంది. పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి పాత్ర ఆ వెంటనే చల్లబడిపోతూ ఉంటుంది. దాంతో ప్రేక్షకుడు కూడా డీలాపడిపోతాడు.

మల్లికార్జున్ ఫొటోగ్రఫీ బాగుంది .. నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. సందర్భానికి తగినట్టుగా అనిపిస్తుంది. కేఎస్ ఎన్ ఎడిటింగ్ ఓకే.  

సంధ్య అనే పాత్ర ఒక బలమైన నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగుతుంది. ఏది ఏమైనా ఆమె ఆ పనిని సాధించి తీరాలి. అంత డేరింగ్ గా .. డైనమిక్ గా ఆ పాత్ర ఉండాలి. కానీ ఆ స్పీడ్ తో ఆ పాత్ర ముందుకు వెళ్లకపోవడం .. ఎప్పటికప్పుడు డీలాపడిపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. 'చీకటిలో' అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ, ఇది ఓ మాదిరి కంటెంట్ అనే చెప్పుకోవలసి ఉంటుంది. 

Movie Details

Movie Name: Cheekatilo

Release Date:

Cast: Sobhitha Dhulipala, Vishwadev Rachakonda, Chaitanya Vishalakshmi, Suresh, Ravindra Vijay, Amani, Esha Chawla, Vadlamani Srinivas

Director: Sharan Koppisetty

Producer: Suresh Babu

Music: Sricharan Pakala

Banner: Suresh Productions

Cheekatilo Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews