'బకాసుర రెస్టారెంట్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • ఆగస్టులో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • అమెజాన్ ప్రైమ్ లో మొదలైన స్ట్రీమింగ్ 
  • సిల్లీ కామెడీతో నడిచే కంటెంట్ 
  • బలహీనమైన ఫ్లాష్ బ్యాక్

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి దిగిపోయే సినిమాలలో హారర్ కామెడీ జోనర్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ జోనర్ లో రూపొందిన మరో తెలుగు సినిమానే 'బకాసుర రెస్టారెంట్'. ప్రవీణ్ .. వైవా హర్ష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో 'గరుడ' రామ్ కీలకమైన పాత్రను పోషించాడు. ఆగస్టు 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్. జె. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: పరమేశ్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహతులతో కలిసి అతను ఓ రూమ్ లో ఉంటూ ఉంటాడు. ప్రతి రోజూ బాస్ తో చీవాట్లు తినడం కన్నా, సొంతంగా రెస్టారెంట్ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వస్తాడు. అందుకు అవసరమైన డబ్బును యూ ట్యూబ్ ద్వారా సంపాదించాలనే అతని అభిప్రాయానికి స్నేహితులు మద్దతునిస్తారు. అయితే దెయ్యలకి సంబంధించిన కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తారు. 
 
నల్లమల అటవీ ప్రాంతంలో .. 'రుద్రారం' అనే విలేజ్ కి దగ్గరలో ఉన్న ఓ పాడుబడిన బంగళాను షూట్ చేయాలనుకుంటారు. చాలా కాలం క్రితం 'ఖాసీమ్ వలి' ఆమె ఒక క్షుద్ర మాంత్రికుడు ఆ బంగళాలో క్షుద్ర పూజలు చేస్తూ ఉండేవాడు. అయితే క్షుద్రపూజలు వికటించడం వలన, అతను అక్కడే చనిపోతాడు. అప్పటి నుంచి ఆ బంగళాలో అతను దెయ్యమై తిరుగుతున్నాడనే ప్రచారం బలంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ బంగళాకి ఈ మిత్ర బృందం చేరుకుంటుంది. 

ఆ బంగళాలో అడుగుపెట్టిన వారికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాంత్రిక విద్యలకు సంబంధించిన ఒక గ్రంథం అక్కడ వారికి దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని తీసుకుని అక్కడి నుంచి బయటపడతారు. ఆ గ్రంథాన్ని వెంట తీసుకుని వచ్చిన దగ్గర నుంచి వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? బకాసుర ఎవరు? అతని గతం ఎలాంటిది? పరమేశ్ కోరిక నెరవేరుతుందా? అనేది కథ. 

విశ్లేషణ: బ్రతుకుదెరువు కోసం విలేజ్ నుంచి పట్నం వచ్చిన ఐదుగురు యువకుల కథ ఇది. రెస్టరెంట్ పెట్టుకుని హ్యాపీగా బ్రతకాలనుకున్న వారికి, తాంత్రిక విద్యలకు సంబంధించిన ఒక గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని వాళ్లు ఎలా ఉపయోగించుకుంటారు? దాని వలన తమ 'కల'ను నిజం చేసుకోగలిగారా లేదా? అనే ఒక లైన్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కాకపోతే మొత్తం కథను అంతటి కుతూహలంతో తెరపై ఆవిష్కరించలేకపోయారు. 

ఐదుగురు స్నేహితులు కలిసి యూ ట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకోవడం .. వ్యూస్ ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో పాడుబడిన బంగళాకి వెళ్లడం .. అక్కడ తాంత్రిక విద్యలకు సంబంధించిన గ్రంథం దొరకడం .. అందులోని విద్యలు పనిచేస్తాయా లేదా? అని టెస్ట్ చేయడం వంటి అంశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపించేవే. కాకపోతే ఆ వైపుగా ఉత్కంఠభరితమైన సన్నివేశాలను డిజైన్ చేయలేకపోయారు. 

హారర్ కామెడీ జోనర్ భయపెడుతూనే నవ్విస్తూ ఉంటుంది గనుక, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, అటు హారర్ .. ఇటు కామెడీ ట్రాకు చాలా బలహీనంగా అనిపిస్తాయి. ఒకే అంశానికి సంబంధించిన సన్నివేశాలను పదే పదే చూపిస్తూ, సిల్లీ కామెడీతో ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతారు. ఈ కథలో హారర్ అంశాల కంటే, హాస్యం పేరుతో వేసిన ఆకతాయి వేషాలే ఎక్కువగా భయపెడతాయి. 

పనితీరు: దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగానే ఉంది. అయితే 'బకాసుర' అనే టైటిల్ కి న్యాయం చేయాలనే విషయంపైనే పూర్తి ఫోకస్ చేశాడు. అందువల్లనే భోజనాలకి సంబంధించిన సన్నివేశాలే తెరపై రిపీట్ అవుతూ విసుగు తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో నైనా దర్శకుడు సీరియస్ కంటెంట్ పై దృష్టి పెట్టకుండా సిల్లీ కామెడీనే నమ్ముకోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.
ఆర్టిస్టుల నటన గురించి చెప్పుకునేంత స్థాయిలో పాత్రలను డిజైన్ చేయడం జరగలేదు. బాలసరస్వతి ఫొటోగ్రఫీ .. వికాస్ బడిస నేపథ్య సంగీతం .. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే కనిపిస్తాయి. 

ముగింపు: ఈ కథలో ప్రధానమైన అంశాలు రెండు. ఒకటి హారర్ అయితే, మరొకటి కామెడీ. అయితే ఈ రెండు ట్రాకులు బలహీనంగా కనిపిస్తాయి. కథలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ కూడా తేలిపోతుంది. వినోదపరమైన సన్నివేశాలను ఏరుకుందామని కూర్చున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. 

Movie Details

Movie Name: Bakasura Restaurant

Release Date: 2025-09-10

Cast: Praveen, Viva Harsha, Garuda Ram, Krishna Bhagavan, Srikanth Iyengar, Jai Krishna

Director: SJ Shiva

Producer: lakshmaiah Achari

Music: Vikas Badisa

Banner: SJ Arts

Review By: Peddinti

Bakasura Restaurant Rating: 1.75 out of 5

Trailer

More Movie Reviews