సాగర్ హీరోగా 'ది 100' సినిమా రూపొందింది. వినోదం .. సందేశం కలిసిన కథలను అందించడంలో ఆసక్తిని చూపుతూ వస్తున్న క్రియా ఫిల్మ్ కార్ప్ - ధమ్మా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. గతంలో ఆర్కే నాయుడుగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో బుల్లితెరపై చెలరేగిపోయిన సాగర్, తనకి అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 

కథ: ఈ కథ హైదరాబాదులో మొదలవుతుంది. సిటీలో వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో సాఫ్ట్ వేర్ జాబ్ లో కొనసాగుతున్న మధుప్రియ (విష్ణుప్రియ) అనే యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో ఈ కేసులను పరిష్కరించడానికి ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ (సాగర్) రంగంలోకి దిగుతాడు. ప్రతి నెలా అమావాస్య రోజున మాత్రమే దొంగతనాలు జరుగుతూ ఉండటాన్ని అతను గమనిస్తాడు. 

అలాగే మధుప్రియ మర్డర్ మిస్టరీ కూడా విక్రాంత్ ను ఆలోచనలో పడేస్తుంది. జరుగుతున్న దొంగతనాలకు .. మధుప్రియ మరణానికి ఏదైనా సంబంధం ఉందా అనే సందేహం మొదలవుతుంది. సాధ్యమైనంత త్వరగా ఆ ముఠాను పట్టుకుని, నగరంలోని భయాందోళనలకు తెరదించాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఆర్తి (మిషా నారంగ్) కూడా ఆ ముఠా బాధితురాలే అనే విషయం ఆయనకి  తెలుస్తుంది. 

ఆ ముఠా ఎవరిది? వాళ్ల బారిన  మధుప్రియ .. ఆర్తి ఎలా పడ్డారు? ఆ ముఠాను పట్టుకోవడానికి విక్రాంత్ అనుసరించే వ్యూహం ఏమిటి? ఈ విషయంలో ఆయనకి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? తన అంచనాలను తారుమారు చేస్తూ అయోమయంలో పడేసే భయంకరమైన నిజాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ: సాధారణంగా పోలీస్ కథలు తమిళంలో ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. మలయాళంలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. కన్నడవారి పోలీస్ కథల్లో డ్రామా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మూడు కోణాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ రాసుకున్న కథగా 'ది 100' కనిపిస్తుంది. అందువల్లనే ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ ఫ్యామిలీ డ్రామాను .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ యాక్షన్ కొనసాగుతూ ఉంటుంది. 

నేరస్థులు తెలివిగా చేసే క్రైమ్ .. బాధితులు వారి బారిన పాడటానికి దారితీసిన పరిస్థితులు .. వాళ్లను పట్టుకోవడానికి పథక రచన చేసే పోలీస్ ఆఫీసర్ .. ఈ మూడు వైపుల నుంచి ఈ తరహా కథలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తరహా కథలు ఒక ఫ్లోలో కొనసాగుతూ ఉండాలి. మధ్యలో మరే అంశాలు జొరబడకూడదు. ఒకటి రెండు చోట్ల మినహా, అలాంటి విషయాల్లో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ మనకి కనిపిస్తుంది. 

  కథా పరిథి .. అవసరమైన పాత్రలు .. వాటిని డిజైన్ చేసిన విధానమే ఏ సినిమానైనా ప్రేక్షకుల దగ్గరికి తీసుకుని వెళుతుంది. దాదాపుగా అలాంటి లక్షణాలతోనే ఈ కథ నడుస్తుంది. ప్రధానమైన పాత్రలను మలచిన తీరు .. వాటిని సమార్థవంతగా నడిపించిన విధానం కట్టుకుంటాయి. అక్కడక్కడా కాస్త రొటీన్ గా అనిపించినప్పటికీ, మళ్లీ కథను గాడిలో పెడుతూ ముందుకు తీసుకుని వెళ్లారు. అయితే నేరాలు .. వాటిని ఛేదించే వ్యూహాలు విషయంలో ఇంకాస్త కసరత్తు అవసరమేమో అని మాత్రం అనిపిస్తుంది. 

పనితీరు: 'ది 100' అంటే ఒక 'వెపన్' అంటూ దర్శకుడు మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అన్నట్టుగానే 'సెక్షన్ 100' అనేది అమ్మాయిల చేతిలో ఎలా ఆయుధమై నిలుస్తుందనే విషయాన్ని చెప్పిన విధానం బాగుంది. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ప్రస్తుతమున్న నేర ప్రపంచంలో అమ్మాయిలంతా అన్ని వైపుల నుంచి అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. 

హీరోగా తనకి అలవాటైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాగర్ యాక్షన్ ఆకట్టుకుంటుంది. మంచి ఫిట్ నెస్ తో .. తెరపై డైనమిక్ గా కనిపించాడు. ఎక్కడా ఎలాంటి అతి లేకుండా సహజత్వానికి దగ్గరగా ఆ పాత్రను తీసుకుని వెళ్లాడు. మున్ముందు మరిన్ని పోలీస్ పాత్రలు చేసే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. 'పుష్ప' ఫేమ్ తారక్ పొన్నప్ప విలనిజంతో పాటు, మిషా నారంగ్ .. మధుప్రియ .. ధన్యా బాలకృష్ణ నటన ఆకట్టుకుంటుంది.

శ్యామ్ కె నాయుడు ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలను ఆయన తెరపై విష్కరించిన విధానం మెప్పిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమయిన ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. అమర్ రెడ్డి ఎడిటింగ్ విషయానికి వస్తే, ఒకటి రెండు సీన్స్ ట్రిమ్ చేయవచ్చని అనిపిస్తుంది. 

ముగింపు: ఏదైతే మెయిన్ లైన్ ఉందో దానిపైనే దర్శకుడు పూర్తి ఫోకస్ చేసిన సినిమా ఇది. రెగ్యులర్ కథల్లో కనిపించే మసాలలను దగ్గరికి రానీయలేదు. వినోదంతో పాటు సందేశాన్ని కూడా కలిపి అందించిన ఈ కంటెంట్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.