ఓం భీమ్ బుష్'- మూవీ రివ్యూ!

Om Bheem Bush

Movie Name: Om Bheem Bush

Release Date: 2024-03-22
Cast: Sri Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Preethi Mukund, Ayesha Khan, Adithya Menon
Director:Sri Harsha Konuganti
Producer: Sunil Balusu
Music: Sunny
Banner: VR Global Media
Rating: 2.75 out of 5
  • శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'ఓం భీమ్ బుష్'
  • కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ 
  • కథాకథనాల్లో పెద్దగా కనిపించని వైవిధ్యం 
  • కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసే కంటెంట్ 
  • ఫ్యామిలీ ఆడియన్స్ సైతం సరదాగా చూసే సినిమా

శ్రీవిష్ణు మొదటి నుంచి కూడా కామెడీ టచ్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన నుంచి వచ్చిన 'సామజవరగమన' ప్రేక్షకులను హాయిగా నవ్వించింది. ఆ సినిమాలో ఆయన లవ్ కి కామెడీ టచ్ ఇస్తే, తాజా చిత్రమైన 'ఓం భీమ్ బుష్'లో, హారర్ కి కామెడీ టచ్ ఇచ్చాడు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
 
కృష్ణకాంత్ (శ్రీవిష్ణు)  వినయ్ (ప్రియదర్శి) మాధవ్ (రాహుల్ రామకృష్ణ) ముగ్గురూ స్నేహితులు. పీహెచ్ డీ పేరుతో ఈ ముగ్గురూ చేసే ఆకతాయి పనులను భరించలేక, డాక్టరేట్ ఇచ్చి మరీ యూనివర్సిటీ నుంచి తరిమేస్తారు. దాంతో చేసేదేమీ లేక, వినయ్ వాళ్ల ఊరికి వెళ్లాలని అంతా నిర్ణయించుకుంటారు. మార్గమధ్యంలో వాళ్లు 'భైరవపురం' అనే ఊళ్లో ఆగుతారు. ఆ ఊళ్లో వాళ్లకి మంత్రశక్తుల పట్ల నమ్మకం ఎక్కువనే విషయాన్ని గ్రహిస్తారు. 

ఓ తాంత్రికుడు అక్కడి ప్రజలను అమాయకులను చేసి, వాళ్ల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఉంటాడు. అది చూసిన కృష్ణకాంత్ టీమ్, తాము దర్జాగా బ్రతకడానికి ఇంతకుమించిన మార్గం లేదని ఫిక్స్ అవుతుంది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిపోతారు. ఆ ఊరు మధ్యలోనే దుకాణం పెట్టేస్తారు. అక్కడి ప్రజలలో నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం రకరకాల గిమ్మిక్కులు చేస్తుంటారు. దాంతో ఊళ్లో వాళ్లంతా కూడా కృష్ణకాంత్ టీమ్ దగ్గరకి రావడం మొదలవుతుంది. 
కృష్ణకాంత్  తెలివిగా ప్లాన్ చేసి, సర్పంచ్ కూతురును లైన్లో పెట్టడమే కాకుండా, సర్పంచ్ నమ్మకాన్ని కూడా సంపాదిస్తాడు.

ఇక ప్రతి పౌర్ణమికి .. అమావాస్యకి .. గ్రహణ సమయాల్లో ఆ ఊళ్లోని వాళ్లంతా భయపడిపోతుంటారు. 'సంపెంగ మహల్'లో ఉండే దెయ్యం ఆ సమయాల్లో బయటికి వస్తుందనీ, తనని ఆటంకపరచడానికి ఎవరు ప్రయత్నించినా చంపేస్తుందనేది ప్రచారంలో ఉంటుంది. ఆయా రోజుల్లో సర్పంచ్ వేయించే చాటింపు కారణంగా, అందరూ ఇళ్లకే పరిమితమవుతూ ఉంటారు.  కృష్ణకాంత్ కారణంగా, మాంత్రికుడి దగ్గరికి వచ్చే జనాల సంఖ్య తగ్గిపోతుంది .. అతని వ్యాపారం దెబ్బతింటుంది.

 దాంతో అతను పెద్ద మనుషుల పంచాయతీ పెడతాడు. కృష్ణకాంత్ టీమ్ అందరినీ మోసం చేసి డబ్బులు సంపాదిస్తుందని ఆరోపిస్తాడు. నిజంగా వాళ్ల దగ్గర దుష్టశక్తులను తరిమేసే శక్తి ఉంటే, 'సంపెంగ మహల్' నుంచి దెయ్యాన్ని తరిమేయాలనీ, అందులోని నిధిని బయటికి తీయాలని సవాల్ విసురుతాడు. 'సంపెంగ మహల్' లో నిధి ఉందనే విషయం కృష్ణకాంత్ టీమ్ కి అప్పుడే తెలుస్తుంది. దాంతో ఆ నిధిని బయటికి తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ సవాల్ ను స్వీకరిస్తారు.

'సంపెంగ మహల్'లోని నిధిలో తమకి 50 శాతం వాటా ఇవ్వాలనీ, సర్పంచ్ కూతురు 'జలజాక్షి'ని తనకిచ్చి వివాహం చేయాలని కృష్ణకాంత్ షరతులు పెడతాడు. అతను బ్రతికొస్తే అప్పుడు చూడొచ్చులే అనే ఉద్దేశంతో సర్పంచ్ ఒప్పుకుంటాడు. దాంతో కృష్ణకాంత్ బ్యాచ్ ఒక రాత్రివేళ ఆ ఊరు పొలిమేరల్లో ఉన్న 'సంపెంగ మహల్' లోకి అడుగుపెడతారు. అక్కడ ఏం జరుగుతుంది? సంపెంగి ఎవరు? ఎందుకు ఆమె దెయ్యమవుతుంది? దెయ్యంతో కృష్ణకాంత్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తయారు చేసుకున్న కథ ఇది. కథా పరంగా చెప్పాలంటే ఇదేం కొత్త కథ కాదు. దెయ్యాలను వదిలించే శక్తిసామర్థ్యాలు తమకి ఉన్నాయని నాటకమాడే హీరో, నిజమైన దెయ్యాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అనే కథాంశంతో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే తరహా కథను తన మార్క్ కామెడీతో ఈ కంటెంట్ ను పరిగెత్తించడంలో .. ఆడియన్స్ ను నవ్వించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఒక వైపున దెయ్యాన్ని తరిమికొట్టడం .. మరో వైపున నిధిని సాధించడం .. ఇంకో వైపున తాను ఇష్టపడిన యువతిని ఆమె తండ్రి అనుమతితో పెళ్లి చేసుకోవడం .. ఈ బాధ్యతలను నెరవేర్చుకోవడానికి హీరో రంగంలోకి దిగడమే ఇంటర్వెల్ బ్యాంగ్. ఇక దెయ్యం తాలూకు ఫ్లాష్ బ్యాక్ తో ముడిపడిన ఎపిసోడ్ తో సెకండాఫ్ కొనసాగుతుంది. దెయ్యాలను వదిలించేవాళ్లు అంతరిక్ష వ్యోమగాములు డ్రెస్ ను ధరించడం, హీరోయిన్ కి బర్త్ డే విషెష్ తెలియజేయడానికి ఓ రాత్రివేళ ఆమె ఇంటికి హీరో బ్యాచ్ వెళ్లే ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. 

శ్రీవిష్ణు .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ .. ఈ ముగ్గురికీ కామెడీపై మంచి పట్టుఉంది. లైఫ్ ను లైట్ గా తీసుకునే గాలి బ్యాచ్ గా ఈ మూడు పాత్రలలో ముగ్గురూ మంచి మార్కులు కొట్టేస్తారు. హీరోయిన్స్ కి ఎంతమాత్రం ప్రాధాన్యత లేదు. కానీ శ్రీవిష్ణు సరసన చేసిన హీరోయిన్ కంటే, ప్రియదర్శి జోడీకట్టిన అయేషా ఖాన్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంటుంది. చక్కని కనుముక్కుతీరుతో ఈ బ్యూటీ మనసును పట్టుకుంటుంది. ఇది చిన్న సినిమానే అయినా, రాజ్ తోట ఫొటోగ్రఫీ .. దెయ్యం నేపథ్యంలో సీన్స్ కి చేసిన లైటింగ్ ఆకట్టుకుంటుంది. అలాగే పాటలకు కూడా కామెడీ ముద్రవేసి నడిపించడంలో సంగీత దర్శకుడు సన్నీ సక్సెస్ అయ్యాడు. విష్ణువర్ధన్ ఎడిటింగ్ కూడా ఓకే.

  అలాగే ఆర్ట్ డిపార్ట్ మెంట్ పని తీరు కూడా మెప్పిస్తుంది. ఈ కథ మొదటి నుంచి చివరివరకూ కూడా ఒక ఫ్లోలో సాగిపోతుంది. బరువైన .. భారమైన సీన్స్ ఎక్కడా కనిపించవు .. అలాంటి డైలాగులు వినిపించవు. లాజిక్కులు వెతకొద్దని ముందే వేశారుగనుక, ఆ వైపు వెళ్లవలసిన అవసరం లేదు. అలాగే దెయ్యం ఎపిసోడ్ ను కూడా సీరియస్ గా తీసుకోవలసిన పనిలేదు. కథాకథనాల్లో కొత్తదనం లేకపోయినా, సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకునేవారికి ఈ సినిమా ఓకే.

Trailer

More Reviews