'మలై కోటై వాలిబన్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

Malaikottai Vaaliban

Movie Name: Malaikottai Vaaliban

Release Date: 2024-02-23
Cast: Mohanlal, Sonalee Kulkarni, Hareesh Peradi, Danish Sait, Manoj Moses, Katha Nandi
Director:Lijo Jose Pellissery
Producer: Shibu Baby John - Achu Baby John
Music: Prashant Pillai
Banner: John & Mary Creative
Rating: 2.25 out of 5
  • 'మలై కోటై వాలిబన్'గా మోహన్ లాల్ 
  • జనవరిలో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 23 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
  • ఆకట్టుకోని కథాకథనాలు 
  • హైలైట్ గా నిలిచే కెమెరా పనితనం 

మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన 'మలై కోటై వాలిబన్' జనవరి 25వ తేదీన అక్కడి థియేటర్స్ లో విడుదలైంది. లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శిబూ బేబీ జాన్ - అచ్చు బేబీ జాన్ నిర్మించిన ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో రూపొందింది. డిఫరెంట్ లుక్ తో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఇది ఆంగ్లేయుల కాలం నాటి కథ. మలైకోటై వాలిబన్ (మోహన్ లాల్) మహా యోధుడు ..  వీరుడు. మల్లయుద్ధంలో అతనిముందు నిలిచి గెలిచినవారు లేరు. అతను తన గురువు (హరీశ్ పేరడీ) తన సోదరుడు చిన్నప్పయ్యన్ (మనోజ్ మోసెస్)తో కలిసి గూడు ఎడ్లబండిలో అనేక ప్రాంతాలకు తిరుగుతూ, అక్కడి మల్లయోధులను సవాల్ చేసి, వారిపై విజయాన్ని సాధిస్తూ ఉంటాడు.'మాంగోట' మల్లయోధులతో వాలిబన్ తలపడతాడు. పోటీలో వారు మోసానికి పాల్పడతారని తెలుసుకున్న ఆయన, అక్కడే వాళ్లకి తగిన గుణపాఠం చెబుతాడు.      

  ఆ ఊళ్లోనే చామంతి అనే యువతిని చిన్నప్పయ్యన్ ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడుతుంది. ఆ విషయాన్ని వాలిబన్ గ్రహిస్తాడు. అతని అనుమతితోనే ఆమె కూడా  వాళ్లతో పాటే బయల్దేరుతుంది. చామంతి తమతో రావడం వాలిబన్ గురువుకి ఎంత మాత్రం నచ్చదు. తమతో ఆమె ఉండటం వలన కొత్త సమస్యలు ఎదురుకావొచ్చనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తాడు. సోదరుడి ఆనందాన్ని కాదనలేని వాలిబన్ మౌనంగా ఉండిపోతాడు. 

'మాంగోట'కి చెందిన మల్లయోధుల బృందానికి నాయకుడు, వాలిబన్ చేతిలో తనవాళ్లు ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోతాడు. సమయం చూసి వాలిబన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్లను రహస్యంగా అనుసరిస్తూ ఉంటాడు. వాలిబన్ కి ఈ ప్రయాణంలో 'రంగరాణి' అనే నర్తకితో పరిచయమవుతుంది. ఆమె అతణ్ణి ఆరాధించడం మొదలుపెడుతుంది. తాను మలైకోట వెళుతున్నట్టుగా అతనికి చెబుతుంది. 

ఆ సమయంలో మలైకోట సంస్థానం ఆంగ్లేయల అధీనంలో ఉంటుంది. వాలిబన్ కి ఆ ఊరితో అనుబంధం ఉంటుంది. అందువలన అక్కడివారిని ఆంగ్లేయులు బానిసలుగా చూడటాన్ని తట్టుకోలేకపోతాడు. ఆంగ్లేయులను ఆ సంస్థానం నుంచి తరిమికొట్టి తన వాళ్లకు బానిస బ్రతుకుల నుంచి విముక్తిని కలిగించాలని నిర్ణయించుకుంటాడు. దాంతో ఒక వైపున ఆంగ్లేయ అధికారులు అతని ప్రాణాలు తీసే పనిలో పడతారు. మరో వైపున వాలిబన్ ను అంతం చేసే వ్యూహంతో 'మాంగోట'కి చెందిన వ్యక్తి ఉంటాడు. ఇక వాలిబన్ తనకి దక్కడని తెలియడంతో రంగరాణి ఆలోచన కూడా మారుతుంది.   

తాను అనుకున్నది సాధించడం కోసం వాలిబన్ ఏం చేస్తాడు? ఆంగ్లేయులను తరిమేయాలనే ఆయన కోరిక నెరవేరుతుందా? ఆయనపై పగను తీర్చుకోవడం 'కోసం మాంగోట' మనిషి ఏం చేస్తాడు? రంగరాణి చేసిన ఆలోచన ఎలాంటి పరిణామాలపై దారితీస్తుంది? వాలిబన్ కి ఆయన గురువు ఈ విద్యను నేర్పడానికి గల కారణం ఏంటి?  అసలు వాలిబన్ గతం ఎలాంటిది? అనే అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు లిజో జోస్ ఈ కథను తయారు చేసుకున్నాడు. ఆంగ్లేయుల కాలం నేపథ్యంలో ఒక మల్లయోధుడి చుట్టూ తిరిగే కథ ఇది. మల్లయోధుడిగా మోహన్ లాల్ లుక్ ను ఆయన బాగా డిజైన్ చేసుకున్నాడు. అయితే అందుకు తగిన కథను ఆసక్తికరంగా రాసుకోలేకపోయాడు. మల్లయోధుడిగా కథానాయకుడు తిరిగే ప్రాంతాలు ఎడారి భూములను తలపిస్తాయి. జనాలు ఎక్కువగా లేని చిన్న చిన్న గూడెంలకు ఎడ్ల బండిపై వెళ్లి సవాళ్లు చేయడం ఆడియన్స్ కి కొరుకుడు పడని విషయంగా అనిపిస్తుంది. 

ఒక సంస్థానంపై కథానాయకుడు విజయాన్ని సాధించిన తరువాత, ఇక అక్కడ తన జెండాను ఎగరేస్తాడనే అంతా అనుకుంటారు. కానీ 'కట్' చేస్తే మళ్లీ ఎడ్ల బండిపై ప్రయాణం మొదలు. క్లైమాక్స్ అనుకునే స్థాయిలో ఒక యాక్షన్ ఎపిసోడ్ జరుగుతూ ఉంటే, ఇక దానితో శుభం కార్డు పడుతుందని అనుకుంటారు. కానీ ఆ తరువాత కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని సీన్స్ తో కథ ముందుకు వెళుతుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది .. కాకపోతే దానిని కావాలని పనిగట్టుకుని రివీల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో జరిగే జాతర కూడా చాలా గందరగోళంగా అనిపిస్తుంది.

కథానాయకుడు మల్లయోధుడు అయినప్పుడు, అందుకు తగినవాడే ప్రతినాయకుడిగా రంగంపై కనిపించాలి. కానీ ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ప్రశ్న వేసుకుంటే ఎవరూ కనిపించరు. పోనీ ప్రధానమైన పాత్రను పట్టుకుని ఫాలో అయ్యే ముఖ్యమైన పాత్రలను సరిగ్గా డిజైన్ చేశారా అంటే అదీ లేదు. మల్లయోధుడుగా మోహన్ లాల్ కి ఆయన వయసుకు మించిన ఫైట్స్ ను డిజైన్ చేయడం కూడా కరెక్టుగా అనిపించదు. 

ఈ సినిమా మొత్తానికి హైలైట్ అనేది ఏదైనా ఉందంటే అది ఫొటోగ్రఫీ. ఎంచుకున్న లొకేషన్స్ ను ఆయన తెరపై ఆవిష్కరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఆయన లైటింగ్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సందర్భాలలో సన్నివేశాలతో సంబంధం లేకుండా పరిగెడుతుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే .. ప్రతి సన్నివేశంలోను సాగదీయడం కనిపిస్తూనే ఉంటుంది. సీక్వెల్ ఉందని చివర్లో చెప్పినప్పుడుగాని మనకి అసలు విషయం అర్థం కాదు.

Trailer

More Reviews