'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

Rebels Of Thupakula Gudem

Movie Name: Rebels Of Thupakula Gudem

Release Date: 2024-02-08
Cast: Srikanth Rathod, Praveen, Sharath Barigela, Rajesh Janagam, jayethri, Shivaram Reddy
Director:Jaideep Vishnu
Producer: Vaaradhi Creations
Music: Manisharma
Banner: Vaaradhi Creations
Rating: 3.00 out of 5
  • కథకి తగిన టైటిల్
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • ఫారెస్టులో పరిగెత్తే కథనం   
  • మెప్పించిన కొత్త ఆర్టిస్టులు
  • యాక్షన్ కంటెంట్ కి కామెడీ టచ్ 

నక్సలిజం నేపథ్యంలో గతంలో తెలుగు తెరపైకి చాలానే సినిమాలు వచ్చాయి. 'ఎర్రసైన్యం' .. 'దండోరా' వంటి సినిమాలు అనూహ్యమైన విజయాన్ని సాధించాయి. అలా నక్సలిజం చుట్టూ తిరిగే ఒక కథతో ప్రేక్షకులను పలకరించిన సినిమానే 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం'. క్రితం ఏడాది విడుదలైన ఈ సినిమా, చాలా ఆలస్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ కథ 2009లో ... తుపాకుల గూడెం అనే ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అడవిని ఆనుకునే ఉన్న ఆ ఊళ్లో కుమార్ (శ్రీకాంత్ రాథోడ్) తో పాటు చాలామంది యువకులు నిరుద్యోగులుగా ఉంటారు. కుమార్ అదే గ్రామానికి చెందిన మమత ( జయేత్రి)ని ప్రేమిస్తాడు. ఉద్యోగం సంపాదించుకుంటేనే తన కూతురునిచ్చి పెళ్లిచేస్తానని మమత తల్లి తేల్చి చెబుతుంది. దాంతో మంచి ఉద్యోగాన్ని ఎలా సంపాదించాలా అని అతను ఆలోచన చేస్తూ ఉంటాడు. 

ఆ గ్రామానికి సమీపంలోని అడవిని రాజన్న (ప్రవీణ్ కండెల) శాసిస్తూ ఉంటాడు. అక్రమ కలపరవాణా చేస్తూ, ఆ పనిని నమ్ముకున్న కూలీలకు అక్కడే భూమి చూపించి వ్యవసాయదారులుగా మారుస్తూ ఉంటాడు. ఇక శివన్న ( శివరామ్) దళం నక్సలిజాన్ని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉంటుంది. ఆ దళాన్ని నీరు గార్చడం కోసం, లొంగిపోయిన వారికి 3 లక్షలు .. సొంత ఇల్లు .. పోలీస్ జాబ్ ఇస్తామని హోమ్ మినిస్టర్ ప్రకటిస్తాడు. నకిలీ నక్సలైట్లను రంగంలోకి తీసుకొచ్చి .. వాళ్లు లొంగిపోతున్నట్టుగా మీడియాలో చూపించాలనేది పోలీస్ డిపార్టుమెంట్ ప్లాన్. 

లోకేశ్ అనే బ్రోకర్ రాజన్నకి కాల్ చేసి, 100 మంది యువకులను చూడమనీ, వాళ్లు నక్సలైట్లుగా లొంగిపోయినట్టుగా నటిస్తే, పోలీస్ జాబ్ ఇస్తారని చెబుతాడు. 'తుపాకుల గూడెం'లోని యువకులకు ఉద్యోగం దొరుకుతుందని భావించిన రాజన్న, అదే గ్రామానికి చెందిన కుమార్ కి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. ఆ బ్రోకర్ తాను నొక్కేయడం కోసం మనిషికి లక్ష లంచంగా ఇవ్వాలనే కండిషన్ పెడతాడు. 

పోలీస్ జాబ్ వస్తుందని కుమార్ గట్టిగా చెప్పడంతో, అందరూ తమ దగ్గరున్నవి తాకట్టు పెట్టి మరీ లక్ష చొప్పున కడతారు. ఫలానా రోజున ఫలానా ప్రాంతానికి వెళ్లి, అక్కడున్న ఆయుధాలు .. నక్సల్స్ ధరించే డ్రెస్ లు తీసుకుని అక్కడే ఉండమనీ, పోలీసులే అక్కడికి వస్తారని చెప్పి ఆ బ్రోకర్ ఆ డబ్బు తీసుకుని అవతల పడతాడు. అదే సమయంలో అక్కడికి సమీపంలోనే కూంబింగ్ ఫోర్స్ ను నక్సలైట్స్ హతమార్చడంతో, హోమ్ మినిష్టర్ తన స్కీమ్ ను రద్దు చేస్తాడు. నక్సలైట్స్ ను ఉపేక్షించవద్దని ఆదేశాలు జారీచేస్తాడు. 

ఈ విషయం తెలియని 'తుపాకుల గూడెం' యువకులు, ఆ బ్రోకర్ చెప్పిన ప్రదేశానికి చేరుకుని నక్సల్స్ డ్రెస్ లు ధరిస్తారు. ఆయుధాలు చేత బడతారు. అదే సమయంలో నిజమైన నక్సల్స్ తప్పించుకుని ఆ ప్రదేశానికి చేరుకుంటారు. వాళ్లని ఫాలో అవుతూ పోలీస్ ఫోర్స్ అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? పోలీసులకు .. నిజమైన నక్సల్ కు మధ్య జరిగే పోరాటంలో చిక్కుకున్న అమాయక యువకులు ఏం చేస్తారు? అనేదే కథ. 

 రాష్ట్రంలో నక్సల్స్ దారుణాలు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్లను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు నానా తిప్పలు పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో తమకి తెలియకుండా ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్లిన 'తుపాకుల గూడెం' యువకులు అక్కడ ఎలా చిక్కుబడతారు? అక్కడి నుంచి ఎలా బయటపడతారు? అనేది దర్శకుడు జైదీప్ విష్ణు డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. లైట్ గా లవ్ ను .. మరికాస్త కామెడీని టచ్ చేస్తూ, దర్శకుడు ఈ క్రైమ్ డ్రామాను నడిపించిన విధానం కనెక్ట్ అవుతుంది. 

ఒకే సమయంలో పోలీస్ ఫోర్స్ నుంచి ఒకరు .. నకిలీ నక్సలైట్ల నుంచి ఒకరు తప్పిపోవడం, తమకి జాబ్స్ ఇవ్వడం కోసమే పోలీసులు వస్తున్నారని భావించిన యువకులు అమాయకంగా స్పెషల్ ఫోర్స్ కి ఎదురెళ్లడం వంటి సీన్స్ నవ్విస్తాయి. అలాగే రాజన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. తాను తయారు చేసుకున్న కంటెంట్ ను అనుకున్న విధంగా ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మణిశర్మ సంగీతం .. శ్రీకాంత్ అరుపుల ఫొటోగ్రఫీ కథకి బలమైన సపోర్టుగా నిలిచాయి. 

గ్రామీణ ప్రజల్లో సర్కారీ కొలువుల పట్ల ఉన్న మోజు, అలాగే పెద్దగా చదువుకోకపోవడం వలన నిజానిజాలు గ్రహించలేని అమాయకత్వం .. ఎవరు ఏది చెప్పినా నమ్మేయడం వంటి అంశాలను దర్శకుడు సహజంగా ఆవిష్కరించాడు. చాలామంది ఆర్టిస్టులు కొత్తవాళ్లే అయినా బాగా చేశారు. నక్సల్స్ సినిమాకి కామెడీ టచ్ ఇచ్చి మెప్పించడం ఈ సినిమా ప్రత్యేకతగానే చెప్పుకోవాలి.

Trailer

More Reviews