'బబుల్ గమ్'(ఆహా) మూవీ రివ్యూ!

Bubblegum

Movie Name: Bubblegum

Release Date: 2024-02-09
Cast: Roshan Kanakala,Maanasa Choudhary, Harsha Chemudu,Harsha Vardhan,Anu Hasan
Director:Ravikanth Perepu
Producer: Vimala
Music: Sricharan Pakala
Banner: Maheshwari Movies
Rating: 2.25 out of 5
  • రోషన్ కనకాల హీరోగా చేసిన 'బబుల్ గమ్'
  • క్రితం ఏడాది డిసెంబర్ 29న విడుదలైన సినిమా
  • ఈనెల 9వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ 
  • రొటీన్ గా అనిపించే లవ్ స్టోరీ ఇది 

రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా 'బబుల్ గమ్'. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ల నుంచి ఈ సినిమా ఆశించినస్థాయి రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 9వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లవ్ స్టోరీని దర్శకుడు ఎలా ఆవిష్కరించాడనేది ఇప్పుడు చూద్దాం. 

ఆది (రోషన్) హైదరాబాద్ కి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడు. అతని తండ్రి ఓ చికెన్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. డీజే కావడమనేది ఆది కల. ఆ కలను నిజం చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా కాకుండా షాప్ చూసుకోమని తండ్రి గోల చేస్తూ ఉంటాడు. తల్లి మాత్రం ఆదిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆది స్వభావం తెలిసిన అతని ఫ్రెండ్స్ అతనితోనే ఉంటూ ఉంటారు. అలాంటి  పరిస్థితుల్లోనే జాహ్నవి (మానస చౌదరి) ఆదికి తారసపడుతుంది.

జాహ్నవిని చూడగానే మనసు పారేసుకున్న ఆది, ఆమెను గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. చెన్నైలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన జాహ్నవి, రిలేషన్స్ ను .. ఎమోషన్స్ ను పెద్దగా పట్టించుకోదు. ఆల్రెడీ జోయల్ కి బ్రేకప్ చెప్పిన ఆమె, ఆ తరువాత చదువుల కోసం విదేశాలకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఈ లోగా కాలక్షేపం కోసం ఆదిని ఆకర్షిస్తుంది. అతనితో గడపడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది.

జాహ్నవి తల్లిదండ్రులు శ్రీమంతులు .. అయితే గతంలో సహజీవనం కొనసాగించిన ఆ ఇద్దరూ, ఇప్పుడు కేవలం స్నేహితులుగానే ఉంటూ ఉంటారు. వాళ్ల ఆధునిక భావాల ప్రభావం జాహ్నవిపై ఉంటుంది. తన పేరెంట్స్ విషయాన్ని ముందుగానే ఆదితో జాహ్నవి చెబుతుంది. ఆమె విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని అతని స్నేహితులు కూడా హెచ్చరిస్తారు. జాహ్నవితో లవ్ మేటర్ ను సీరియస్ గా తీసుకోవద్దని ఆమె స్నేహితులు కూడా అతనితో చెబుతారు. 

అయినా జాహ్నవి ప్రేమను ఆది లైట్ గా తీసుకోలేకపోతాడు. తనని ప్రేమిస్తూ ఆమె జోయల్ తో చనువుగా ఉండటాన్ని అతను జీర్ణించుకోలేకపోతాడు. అదే సమయంలో ఆదినే ఆమె అపార్థం చేసుకుంటుంది. ఓ ఫంక్షన్ లో నలుగురిలో అతణ్ణి జాహ్నవి అవమాన పరుస్తుంది. ఆ అవమానాన్ని ఆది తట్టుకోలేకపోతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? వాళ్ల ప్రేమ ప్రయాణానానికి ముగింపు ఏమిటి? ఆది తన లక్ష్యాన్ని చేరుకుంటాడా? అనేది మిగతా కథ. 

దర్శకుడు రవికాంత్ పేరెపు తయారు చేసుకున్న కథ ఇది. ఫస్టు పార్టు అంతా కూడా ప్రేమ .. సెకండ్ ఆఫ్ అంతా దాని ఫలితం తెరపై కనిపిస్తాయి. తెలుగు తెరకి ప్రేమకథలు కొత్త ఏమీ కాదు. ప్రేమ అనే కథావస్తువు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రేమకి కాస్త కథాబలం .. మరికాస్త ఫీల్ తోడైతే ప్రేక్షకులు ఆదరించే తీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి కొత్తదనం .. ఫీల్ ఈ కథలో ఉన్నాయా? అంటే ... లేవనే చెప్పాలి. 

ప్రేమకథను ఫాలో అవుతున్నప్పుడు, హీరో కాబట్టి .. హీరోయిన్ లవ్ చేసిందనట్టుగా ఉండకూడదు. ప్రేమ బలపడటానికి ఎంత బలమైన కారణం ఉంటుందో .. విడిపోవడానికి అంతకంటే బలమైన కారణం కావాలి. అప్పుడే ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. లవర్స్ అన్నాక అలకలు ... బుజ్జగింపులు మామూలే. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు కూల్ చేయడం సహజమే. అలాంటి అంశాలనే చివరివరకూ చూపించడం ప్రేక్షకులకు అసహనాన్ని కలిస్తుంది. ఈ కథ విషయంలోను అదే జరిగింది. 

 అవమానం జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తించడం సహజం. కానీ ఈ సినిమాలో హీరోకి అవమానం జరిగినప్పుడు అతను స్పందించే తీరు చూస్తే, అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. బుల్లెట్ నడుపుతూనే పెద్దగా అరవడాలు .. తండ్రి తాగుతున్న సీసాను తాను తీసుకుని నడుస్తూనే తాగేయడం .. ఇలాంటి సీన్స్ 'అర్జున్ రెడ్డి'ని గుర్తుచేస్తాయి. అందుకు హీరో తెలంగాణ యాస మాట్లాడటం కూడా మరో కారణంగా కనిపిస్తుంది. 

 ప్రేమకథా చిత్రాలను నిలబెట్టడంలో పాటలు ప్రధానమైన పాత్రను పోషిస్తాయనేది గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. ఆ పాటల విషయంలో శ్రద్ధపెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక హీరో .. అతని ఫ్రెండ్స్ మధ్య మంచి కామెడీ ట్రాక్ వేసుకుంటూ వెళ్లే అవకాశం ఉంది .. కానీ అలా జరగలేదు. ఒక మంచి ప్రేమకథ చూద్దామని అనుకున్న ప్రేక్షకులకు రొటీన్ ప్రేమకథను చూసినట్టుగానే అనిపిస్తుంది. 

ఇది ఫస్టు మూవీనే అయినా రోషన్ తడబడకుండా బాగానే చేశాడు. ఇక మానస చౌదరి గ్లామర్ పరంగా .. నటన పరంగా కూడా ఆకట్టుకుంటుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం .. సురేశ్ రగుతు ఫొటోగ్రఫీ ఫరవాలేదు. టైటిల్ .. ఎంచుకున్న కథాంశం ఈ ట్రెండ్ కి తగినదే అయినా, ఇంట్రెస్టింగ్ గా కాకుండా రొటీన్ గా చెప్పడమే లోపంగా కనిపిస్తుంది. మరికాస్త కసరత్తు చేసుంటే .. మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో. 

Trailer

More Reviews