'ఎ రంజిత్ సినిమా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

A Ranjith Cinema

Movie Name: A Ranjith Cinema

Release Date: 2023-12-29
Cast: Asif Ali, Saiju Kurup, Namitha Pramod, Renji Panicker, Jayaprakash, Jewel Mary
Director:Nishanth Sattu
Producer: Nishad Peechi
Music: Midhun Asokan
Banner: Luminous Film Factory
Rating: 3.00 out of 5
  • మలయాళంలో రూపొందిన 'ఎ రంజిత్ సినిమా'
  • డిసెంబర్ 8వ తేదీన విడుదలైన సినిమా 
  • రీసెంటుగా అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్ 
  • సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  •  ప్రధానమైన బలంగా నిలిచిన స్క్రీన్ ప్లే  

మలయాళ సినిమాలను ఫాలో అయ్యేవారికి అసిఫ్ అలీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తరువాత ఆయన ఇతర భాషా ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. ఈ  మధ్య ఓటీటీలో వచ్చిన 'కాసర్ గోల్డ్' తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా చేసిన ' ఎ రంజిత్ సినిమా' డిసెంబర్ 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. అదేనెల 29వ తేదీ నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

ఈ కథ 'తిరువనంతపురం'లో జరుగుతూ ఉంటుంది. రంజిత్ (అసిఫ్ అలీ) ఒక టీవీ ఛానల్లో ప్రాంక్ వీడియోస్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన ప్రాంక్ వీడియో చేయడం కోసం పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకుంటాడు. ఆ సమయంలో ఒక రౌడీ మూక బారి నుంచి 'పౌర్ణమి' (నమితా ప్రమోద్) అనే యువతిని కాపాడతాడు. అప్పటి నుంచి వాళ్ల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె తండ్రి ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే విషయం రంజిత్ కి తెలియదు. 

ఇక అదే ఊళ్లో సన్నీ (సైజు కురుప్) తన భార్య టీనా (జువెల్ మేరీ) కలిసి నివసిస్తూ ఉంటాడు. టీనా తండ్రి ( జయప్రకాశ్) పెద్ద బిజినెస్ మేన్. తన కూతురు సన్నీని పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం ఉండదు. సన్నీ పెద్దగా తెలివైనవాడు కాదనీ, తన కాళ్లపై తాను నిలబడే సత్తా అతనికి లేదనేది టీనా తండ్రి అభిప్రాయం. తన మామగారి దగ్గర తానేమిటనేది నిరూపించుకునే అవకాశం కోసమే అతను ఎదురుచూస్తూ ఉంటాడు. అలాంటి అవకాశం ఒకసారి అతనికి వస్తుంది. 

పెద్ద పెద్ద బిజినెస్ మేన్లతో కలిసి ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ కి .. ప్రెజెంటేషన్ కోసం సన్నీని రమ్మని మామగారు కాల్ చేస్తాడు. అతను కారులో వస్తుండగా ఒక బస్ స్టాప్ దగ్గర కారు ట్రబుల్ ఇస్తుంది. ఆ సమయంలో అతనిపై ప్రాంక్ వీడియో చేసి కంగారు పెట్టేస్తాడు రంజిత్. ఆ కారణంగా ఆలస్యమై మామగారి దగ్గర సన్నీ అవమానం పాలవుతాడు. అప్పటి నుంచి రంజిత్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. 

ఈ క్రమంలోనే రంజిత్ ఒకసారి పౌర్ణమిని కెమెరాతో షూట్ చేస్తూ ఉంటే, ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ పై ఒక లాయర్ మర్డర్ జరుగుతూ ఉండటం ఆ కెమెరాలో రికార్డు అవుతుంది. అయితే రంజిత్ ఆ విషయాన్ని గమనించడు. ఆ లాయర్ డెడ్ బాడీని రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి రహస్యంగా తరలించే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో అక్కడ సన్నీ కారు కనిపించడంతో, ఆ కారు డిక్కీలో పడేస్తారు. అదే రోజున ప్రాంక్ వీడియో అనుకుని నిజమైన పోలీసులపై సన్నీ చేయి చేసుకుని, స్టేషన్ కి వెళతాడు. ఆ సమయంలోనే అతని కారు డిక్కీలో శవం బయటపడుతుంది. 

తనకి ఎదురైన అనుభవాలనే సినిమాగా చేయాలనే ఆలోచనలో రంజిత్ ఉంటాడు. ఆ తరువాత కథగా అతను ఏదైతే ఊహించుకుంటూ ఉంటాడో .. అదే జరుగుతూ ఉంటుంది. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సన్నీ .. రంజిత్ కోసం గాలిస్తుంటాడు. బస్ స్టాప్ లో రంజిత్ తో తన్నులు తిన్న గ్యాంగ్ కూడా అతని కోసమే వెదుకుతుంటారు. అలాంటి సమయంలోనే తన కెమెరాలో రికార్డు అయిన మర్డర్ సీన్ ను రంజిత్ చూస్తాడు. దానిని తీసుకుని ఏసీపీ దగ్గరికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేదే కథ. 

సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి నిశాంత్ సత్తు దర్శకత్వం వహించాడు. ఆయనే ఈ కథను తయారు చేసుకున్నాడు. రంజిత్ చేసిన ప్రాంక్ వీడియో కాల్ వలన, సన్నీ ఇబ్బందుల్లో పడతాడు. రంజిత్ ను అంతం చేయాలనే కోపంతో ఆయన ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే అతను ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. ఆ మర్డర్ కేసుకు సంబంధించిన ఆధారాలు రంజిత్ కెమెరాలో ఉంటాయి. అతని అంతు చూసే ఆలోచనలో సన్నీ ఉంటాడు. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

ఒక జంట ప్రేమ .. అది ఇష్టం లేని అమ్మాయి తండ్రి. మరో జంట పెళ్లి .. అది నచ్చని అమ్మాయి తండ్రి. ఈ మధ్యలో జరిగే ఓ మర్డర్ కేసు .. అనేవి ప్రధానమైన కథను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాయి. ఇక లాయర్ ను హత్య చేసినదెవరు? ఏసీపీ దగ్గరకి ఆ వీడియోతో వెళ్లిన రంజిత్ కి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? జరగబోయే సంఘటనలు రంజిత్ కి ఎలా తెలుస్తున్నాయి? అనే అంశాలు ఈ కథలో కీలకంగా కనిపిస్తాయి.

 ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. కథలోని మలుపులు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ .. అలా కూర్చోబెట్టేస్తాయి. ఓ పది పాత్రల చుట్టూనే కథ అంతా నడుస్తుంది. ప్రతి పాత్ర ఒక కీలకమైన మలుపుకి కారణమవుతూ ఉంటుంది. నటీనటులంతా కూడా చాలా సహజంగా చేశారు. మిథున్ అశోకన్ సంగీతం .. సునోజ్ వేలాయుధన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. మనోజ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. 

మలయాళంలో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అక్కడి థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. ఓటీటీలో తెలుగు వెర్షన్ రీసెంటుగా వచ్చింది. థ్రిల్లర్ జోనర్ లోని కథలను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడొచ్చు. ఎక్కడా అశ్లీలతకి చోటు ఇవ్వని సినిమా ఇది. ఒక్కోసారి అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయి? ఎలా ప్రమాదంలోకి నెడతాయి? అనే విషయాన్ని ఆవిష్కరించే ఈ సినిమాను ఫ్యామిలీతోను చూడొచ్చు.

Trailer

More Reviews