'గుంటూరు కారం' - మూవీ రివ్యూ

Gunturu Kaaram

Movie Name: Gunturu Kaaram

Release Date: 2024-01-12
Cast: Mahesh Babu, Sreeleela, Meenakshi Chaudhary, Ramya Krishnan,Prakash Raj , Jagapathi Babu, Rao Ramesh
Director:Trivikram
Producer: Radhakrishna
Music: Thaman
Banner: Harika Hasini
Rating: 2.75 out of 5
  • త్రివిక్రమ్ నుంచి వచ్చిన 'గుంటూరు కారం'
  • పొలిటికల్ టచ్ తో సాగే ఫ్యామిలీ డ్రామా 
  • మనసుకు పట్టుకోని కథాకథనాలు 
  • మహేశ్ బాబు యాక్షన్ హైలైట్ 
  • గ్లామర్ పరంగా మెప్పించిన శ్రీలీల

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. చాలా గ్యాపు తరువాత వాళ్ల నుంచి మూడో సినిమాగా 'గుంటూరు కారం' రూపొందింది. ఒక వైపున ఘాటైన టైటిల్ .. మరో వైపున  మహేశ్ బాబు మాస్ లుక్ .. దాంతో పోస్టర్స్ నుంచే ఈ సినిమాపై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. హారిక హాసిని బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఇక అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతరవరకూ అందుకోగలిగిందనేది ఇప్పుడు చూద్దాం.

గుంటూరులో రమణ (మహేశ్ బాబు) ఫేమస్ .. తమకున్న మిర్చి గోడౌన్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటాడు. సాఫ్ట్ గా కనిపిస్తూ ఉంటాడుగానీ, అతని మాటకు .. ఫైటుకు కాస్త ఘాటు ఎక్కువే. తన పదేళ్ల వయసు నుంచి అతను మేనత్త, మేనమామ (రఘు - ఈశ్వరీరావు) దగ్గర పెరుగుతాడు. తల్లిదండ్రులు లేరా .. అంటే .. ఉన్నారు. రమణ చిన్నప్పుడే అతని తల్లి వసుంధర ( రమ్యకృష్ణ) ఆ కుటుంబానికి దూరంగా వెళ్లిపోతుంది. అంతేకాదు నారాయణ (రావు రమేశ్)ను పెళ్లి చేసుకుంటుంది.

వసుంధర తనని వదిలి వెళ్లిపోవడం .. మరో పెళ్లి చేసుకోవడం ఆమె మొదటి భర్త ( జయరామ్) అవమానంగా భావిస్తాడు. అప్పటి నుంచి చెల్లెలి ఇంట్లోనే ఉంటూ .. ఒక గదికి పరిమితమవుతాడు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ గతాన్ని తలచుకుని బాధపడుతూ ఉంటాడు. తన తల్లి తమని వదిలేసి ఎందుకు వెళ్లిపోయిందనేది రమణకి అర్థం కాదు. ఈ విషయంలో తన తాతయ్య వెంకటస్వామి (ప్రకాశ్ రాజ్) తన కూతురునే సపోర్టు చేస్తూ వెళ్లడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

కాలచక్రంలో పాతికేళ్లు గడిచిపోతాయి. వెంకటస్వామి రాజకీయంగా మరింత ఎదుగుతాడు. తన వారసురాలిగా కూతురు వసుంధరను నిలబెట్టి, ఆమెను మినిస్టర్ ను చేస్తాడు. నారాయణ - వసుంధర దంపతుల సంతానం (రాహుల్ రవీంద్ర)ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో వెంకటస్వామి ఉంటాడు. అయితే ఆస్తిపాస్తుల విషయంలో గానీ .. రాజకీయల పరంగా గాని భవిష్యత్తులో రమణ అడ్డు రాకూడదని అతను భావిస్తాడు. 

వసుంధరతో తనకి ఎలాంటి సంబంధం లేదనీ .. ఆమె ఆస్తిపాస్తులతో తనకి ప్రమేయమే లేదనే డాక్యుమెంట్స్ తయారు చేయించి, రమణ సంతకం తీసుకోవడానికి వెంకటస్వామి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ బాధ్యతను లాయర్ పాణి (మురళీశర్మ)కి అప్పగిస్తాడు. తన తల్లిని కలుసుకోవాలనీ, ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలని రమణ అనుకుంటాడు. ఆ తరువాతనే సంతకం చేయాలని భావిస్తాడు. దాంతో అతనితో సంతకం చేయించే బాధ్యతను తన కూతురు (ఆముక్త మాల్యద)కి అప్పగిస్తాడు పాణి. ఆ పనిమీద ఆముక్త గుంటూరు వెళుతుంది.


ఇక గుంటూరులో రమణ వాళ్ల బిజినెస్ పై దెబ్బకొట్టడానికి తరచూ మార్స్ (జగపతిబాబు) ట్రై చేస్తూ ఉంటాడు. తన అన్నయ్య లెనిన్ ( సునీల్) చావుకి కారణమైన ఆ ఫ్యామిలీపై పగ తీర్చుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక హైదరాబాదులో వెంకటస్వామి ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాటం మధు (రవిశంకర్) ప్రయత్నిస్తుంటాడు. రమణను వదిలేసి అతని చిన్నప్పుడే తల్లి ఎందుకు వెళ్లిపోతుంది?  అందుకు కారణం ఏమిటి? కారకులు ఎవరు? ఆ విషయం తెలుసుకున్న రమణ ఏం చేస్తాడు? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది. 

త్రివిక్రమ్ కథల్లో అన్ని వర్గాలవారికి అవసరమైన అంశాలు సర్దుబాటు చేయడం జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే అతని కథల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఒక వైపున యాక్షన్ .. మరో వైపున ఎమోషన్ .. ఈ రెండింటి మధ్య ఎంటర్టైన్ మెంట్ ను బ్యాలెన్స్ చేయడం ఆయన ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సారి అలా బ్యాలెన్స్ చేయడం కుదరలేదనే అనిపిస్తుంది. 

ఈ కథలో ప్రధానమైన ఎమోషన్ తల్లీ కొడుకులకు సంబంధించినది. ఒక కూతురు తన తండ్రి మాట విని, పదేళ్ల కొడుకుని వదిలేసి వెళ్లిపోవడం .. తండ్రి మాటను కాదనలేక వేరొకరిని పెళ్లి చేసుకోవడం .. పాతికేళ్ల పాటు ఆ కొడుకు వైపే చూడకపోవడమనే విషయాలు సహజత్వానికి చాలా దూరంగా కనిపిస్తాయి. ఇక ప్రకాశ్ రాజ్ పాత్ర విషయానికి వస్తే .. తన కూతురు ఏమైపోయినా ... ఆమె ఫ్యామిలీ ఏమైపోయినా ఫరవాలేదు, రాజకీయ వారసత్వం కొనసాగాలనే ఆయన నిర్ణయం కూడా అసంబద్ధంగా అనిపిస్తుంది. 

ఈ రోజుల్లో ఎవరూ ఏ విషయాన్ని కూడా మనసులోనే దాచుకుని కుమిలిపోయే పరిస్థితి లేదు. అలాంటిది రావు రమేశ్ పాత్ర వైపు నుంచే చూసుకుంటే, పాతికేళ్లపాటు ఒక రహస్యాన్ని తన మనసులోనే దాచుకుంటూ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంత అవసరం ఏముంది? అనిపిస్తుంది. ఇక తనని వదిలి వెళ్లిపోయిన భార్య కోసం కిటికీలో నుంచి చూస్తూ కూర్చునే జయరామ్ పాత్ర కూడా మింగుడు పడదు. 

ఇక అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు పట్టుకునే పాత్రల్లో రవిశంకర్ - అజయ్ ఘోష్ కనిపిస్తారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపించింది. కానీ హీరోకు మంచినీళ్లు .. కాఫీలు అందించడం వరకు మాత్రమే ఆమెను వాడుకున్నారు. ఇక జగపతిబాబు పాత్ర కూడా ఒక దశ తరువాత బలహీనపడుతుంది. అజయ్ ఎపిసోడ్ కూడా అంత అవసరమైనది కాదనే అనిపిస్తుంది.  సీరియస్ సీన్స్ చివర్లో కామెడీ టచ్ ఇవ్వడం కూడా ఆశ్చర్యపరుస్తుంది.

మహేశ్ బాబు పాత్రను .. స్టయిల్ గా ఆయన బీడీ వెలిగించే మేనరిజంను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆయన సింపుల్ డైలాగ్స్ కూడా పట్టుకుంటాయి.  శ్రీలీల చాలా గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్ ను బాగానే వాడుకున్నారు. మనోజ్ పరమహంస కెమెరా పనితనం .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పాటల్లో మాత్రం 'కుర్చీ మడతపెట్టి' ఆకట్టుకుంటుంది .. అదీ కూడా బీట్ పరంగా మాత్రమే. ఈ పాటకి కష్టమైన స్టెప్స్ ను కూడా మహేశ్ చాలా ఎనర్జీతో చేశాడు. అసలు విషయం తక్కువగా .. హడావిడి ఎక్కువగా అనిపించే సినిమాల జాబితాలోనే ఇది కనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్: మహేశ్ పాత్రను డిజైన్ చేసిన తీరు .. శ్రీలీల గ్లామర్ .. సింపుల్ గా అనిపించే డైలాగ్స్ .. యాక్షన్ సీన్స్ .. ఫొటోగ్రఫీ .. కొరియో గ్రఫీ .. నేపథ్య సంగీతం. 

మైనస్ పాయింట్స్ :
సహజత్వానికి దూరంగా కనిపించే కథాకథనాలు .. బలహీనమైన పాత్రలు .. కనెక్ట్ అవ్వని ఎమోషన్స్. 

Trailer

More Reviews