'పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

Perrilloor Premier League

Movie Name: Perrilloor Premier League

Release Date: 2024-01-05
Cast: Nikhila Vimal, Sunny Wayne, Vijay Raghavan, Aju Varghese, Asokan
Director:Praveen Chandran
Producer: Mukesh Mehtha- Sarathi
Music: Mujeeb Majeed
Banner: AN E4 Entertainment Production
Rating: 3.00 out of 5
  • హాస్య ప్రధానంగా సాగే 'పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథా కథనాలు 
  • సరదాగా సాగిపోయే సన్నివేశాలు 
  • నిఖిలా విమల్ గ్లామర్ .. నటన ఈ సిరీస్ కి హైలైట్ 
  • కుటుంబ సమేతంగా చూడదగిన సిరీస్ 

ఈ మధ్య కాలంలో అటు వెండితెరపై .. ఇటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మలయాళ సినిమాలు .. సిరీస్ లు జోరు చూపుతున్నాయి. హారర్ .. సస్పెన్స్ .. క్రైమ్ కి సంబంధించిన కథలు మాత్రమే కాదు, కామెడీ కంటెంట్ విషయంలోను తమదే పైచేయి అనే విషయాన్ని నిరూపిస్తున్నారు. నిన్నటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్' అనే వెబ్ సిరీస్ కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. 7 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్, ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ అంతా కూడా మాళవిక అనే పాత్ర చుట్టూ .. 'పెరిల్లూర్' అనే విలేజ్ చుట్టూ తిరుగుతుంది. మాళవిక ( నిఖిలా విమల్) చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మేనమామ పీతాంబరం ( విజయ్ రాఘవన్) దగ్గర ఉంటూ 8వ తరగతి వరకూ చదువుకుంటుంది. ఆ స్కూల్ లోనే చదువుతున్న శ్రీకుంటన్ (సన్నీ వెయిన్)ను ఇష్టపడుతుంది. అయితే ఆ తరువాత ఆమె తన సొంత ఊరికి వెళ్లిపోవడంతో .. ఆమె జ్ఞాపకాలలో మాత్రమే శ్రీకుంటన్ ఉండిపోతాడు. 

మాళవిక యవ్వనంలోకి అడుగుపెడుతుంది .. పీహెచ్ డీ చేయడానికి అవసరమైన ప్రయత్నాల్లో ఉంటుంది. శ్రీకుంటన్ కూడా 'గల్ఫ్' లో జాబ్ చేస్తూ, సెలవులపై తన ఊరికి తిరిగొస్తాడు. అతనితోనే తన పెళ్లిచూపులు జరుగుతాయని మాళవిక కూడా ఊహించదు. అతనిపై మాళవికకి ఉన్న ప్రేమ తగ్గదు. కానీ శ్రీకుంటన్ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అతను అనుకుంటూ ఉంటాడు. 

'పెరిల్లూర్' గ్రామానికి చాలా కాలంగా మాళవిక మేనమామ పీతాంబరం ప్రెసిడెంటుగా ఉంటాడు. ఈ సారి అతను ఉండటానికి వీల్లేదని ఊళ్లో ఒక వర్గం వారు రివర్స్ అవుతారు. దాంతో అతను మాళవికను ఒప్పించి నామినేషన్ వేయిస్తాడు. నిజానికి మాళవిక దృష్టి పీహెచ్ డీ పై ఉంటుంది. అయితే శ్రీకుంటన్ ను పెళ్లి చేసుకుని కోడలిగా ఆమె వెళ్లవలసింది ఆ ఊరికేగదా అంటూ తల్లి ఒప్పిస్తుంది. అయితే నిహారిక అనే అమ్మాయికి పెళ్లి అయిందనే విషయం తెలియక, ఆమెపై మనసు పారేసుకున్న శ్రీకుంటన్, తనకి మాళవిక నచ్చలేదని కబురు చేస్తాడు.

శ్రీకుంటన్ తో పెళ్లి అవుతుందనే ఉద్దేశంతో నామినేషన్ వేసిన మాళవిక, ఆ ఊరికి ప్రెసిడెంట్ అవుతుంది. ఆమె పేరుతో రాజకీయం చేస్తూ మేనమామ పీతాంబరం అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు. ఆధారాలతో అతని అవినీతిని నిరూపించే సమయం కోసం శోభన్ (అశోకన్) అనుచరులు వెయిట్ చేస్తుంటారు. ఇక శ్రీకుంటన్ ఒక వైపున డబ్బున్న అమ్మాయిలకు ఎర వేస్తూ ... చివర్లో కంగుతింటూ ఉంటాడు. మరో వైపున ఊళ్లో మాళవికను తన కంటే పై స్థాయిలో ఫేస్ చేయలేకపోతుంటాడు. 

ఎప్పటికప్పుడు తన పదవికి రాజీనామా చేసి, పీహెచ్ డీ వైపు వెళ్లాలని మాళవిక ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకు ఆమె మేనమామ అడ్డుపడుతూ వెళుతుంటాడు. ఒకసారి ఆయన వేరే వారి దగ్గర లంచం తీసుకుని, శ్రీకుంటన్ సైడ్ బిజినెస్ గా నడుపుతున్న షాప్ ను మూసేయిస్తాడు. దాంతో శ్రీకుంటన్ కోపంతో రగిలిపోతాడు. ప్రతీకారంతో అతను చేసిన ఒక పని వలన మాళవిక పీహెచ్ డీ చేసే అవకాశాన్ని కోల్పోతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ. 

దీపు ప్రదీప్ రాసిన కథ ఇది. ఈ కథను దర్శకుడు ప్రవీణ్ చంద్రన్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇది సింపుల్ కంటెంట్ .. చాలా తేలికగా సాగిపోయే కామెడీ కంటెంట్. ఎక్కడా ఏ పాత్ర ... ఏ సీన్ హెవీ వెయిట్ తో కనిపించవు. ఒక గ్రామం .. అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు .. పెద్దగా పనిలేని వాళ్లు రాజకీయాలపై చూపించే ఇంట్రెస్ట్ .. ఒకరి ఫ్యామిలీ విషయాల పట్ల మరొకరికి గల ఆసక్తి .. వాళ్ల జీవన విధానం .. స్వరూప స్వభావాల ఆవిష్కరణే ఈ కథలోని ప్రధానమైన అంశాలు. 

'పెరిల్లూర్' గ్రామంలో రాజకీయంగా తనదే పై చేయి ఉండాలనే పీతాంబరం .. అతనిని దెబ్బతీయాలని భావించే శోభన్ .. అనునిత్యం భర్తను అనుమానించే ఓ భార్య .. కొబ్బరి పిందెలు రాలినా అది ఏలియన్స్ పనేనని భావించే ఓ మేథావి .. ఎండకి కందిపోతాననే భయంతో నీడలోనే కూర్చునే ఓ కలర్ బాబు .. అందరి మధ్య గొడవలు పెడుతూ ఆనందించే బాలచంద్రన్ .. ఇలా చిత్రమైన స్వభావాలు కలిగిన పాత్రలను పరిచయం చేస్తూ ఈ కథ సరదాగా సాగిపోతుంది. 

కథలో ఎక్కడా అనూహ్యమైన మలుపులుగానీ .. భారీ ట్విస్టులుగాని ఉండవు. హాయిగా కాసేపు నవ్వించే ఉద్దేశంతోనే దర్శకుడు సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. ఎక్కడా కూడా సన్నివేశాలు అతికించినట్టుగా అనిపించవు. సహజత్వమే ప్రధమ ఉద్దేశంగా .. ప్రధానమైన బలంగా ఈ సిరీస్ నడుస్తుంది. కాకపోతే కాస్త రాజకీయాల పాళ్లు తగ్గిస్తే బాగుండేదనీ .. సన్నీ వెయిన్ పాత్రను ఇంకాస్త బాగా డిజైన్ చేసే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. 

నిఖిలా విమల్ చాలా అందంగా కనిపిస్తూ .. ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. చీరకట్టులో ఆమె అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె నటన కూడా చాలా సహజంగా ఉంది. మిగతా ఆర్టిస్టులంతా కూడా చాలా బాగా చేశారు. అనూప్ వి శైలజ ఫొటోగ్రఫీ .. మజీబ్ సంగీతం కథలో ప్రేక్షకులను భాగం చేస్తాయి. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే వెబ్ సిరీస్ ల జాబితాలో ఇది కూడా చేరుతుందని చెప్పచ్చు. 

Trailer

More Reviews