'మై నేమ్ ఈజ్ శ్రుతి' - (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

My Name is Sruthi

Movie Name: My Name is Sruthi

Release Date: 2023-12-29
Cast: Hansika Motwani, Prema, Murali Sharma, Adukalam Naren, Sai Tej
Director:Srinivas Omkhar
Producer: Ramya Prabhakar
Music: Mark. K. Robin
Banner: Vaishnavi Arts
Rating: 3.00 out of 5
  • హన్సిక ప్రధాన పాత్రగా 'మై నేమ్ ఈజ్ శృతి'
  • థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా  
  • ఆసక్తికరంగా నడిచే కథాకథనాలు
  • బలమైన స్క్రీన్ ప్లే ప్రధానమైన ఆకర్షణ

తెలుగు .. తమిళ భాషల్లో హన్సిక చాలావరకూ గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చింది. కొంతకాలంగా హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేస్తూ వెళుతోంది. ఇటీవల తెలుగులోనూ ఆమె ఒక థ్రిల్లర్ సినిమా చేసింది .. ఆ సినిమా పేరే 'మై నేమ్ ఈజ్ శ్రుతి'. నవంబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, డిసెంబర్ 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ స్టోరీలోని విశేషాలేమిటనేది ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ లో ఎమ్మెల్యే గురుమూర్తి (ఆడుకాలం నరేన్) తన రౌడీ ఇజాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన దారికి ఎదురొచ్చిన వారిని హత్య చేస్తూ వెళుతుంటాడు. అతని వెనుక హోమ్ మినిష్టర్ ప్రతాప్ రెడ్డి (రాజా రవీంద్ర) డీజీపీ (జయప్రకాశ్) ఉంటారు. అమ్మాయిల 'స్కిన్' తో ఎమ్మెల్యే గురుమూర్తి బిజినెస్ చేస్తుంటాడు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి .. వాళ్ల స్కిన్ ఒలిచేసి .. అంతం చేస్తుంటారు. స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడంలో వాళ్లకి కాస్మొటిక్ సర్జన్ కిరణ్మయి (ప్రేమ) సహకరిస్తూ ఉంటుంది.

చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నవారు .. ప్రమాదాల కారణంగా స్కిన్ డ్యామేజ్ అయినవారు డాక్టర్ కిరణ్మయిని సంప్రదిస్తుంటారు. ఎవరికి ఎలాంటి స్కిన్ టోన్ అవసరమనేది ఆమె ఎమ్మెల్యే గురుమూర్తికి చెబుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన యువతులను అతను కిడ్నాప్ చేయిస్తుంటాడు. పెద్ద మనుషులనుతా ఈ రాకెట్ ను సీక్రెట్ గా నిర్వహిస్తుంటారు. ఎవరికి వాటా వాళ్లకి ముడుతూ ఉంటుంది.   

గురుమూర్తి మనిషిగా ఉన్న చరణ్ (సాయితేజ్)  ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి, తమ స్థావరానికి తరలిస్తుంటాడు. ఈ నేపథ్యంలో జాబ్ నిమిత్తం భీమవరం నుంచి శ్రుతి ( హన్సిక) హైదరాబాద్ వస్తుంది. అక్కాబావల దగ్గర ఉంటే వాళ్ల ప్రైవసీకి ఇబ్బంది అవుతుందని భావించిన ఆమె, తన స్నేహితురాలితో కలిసి ఒక ఫ్లాట్ లో ఉంటూ ఉంటుంది. చాలా తేలికగానే ఆమె చరణ్ ట్రాప్ లో పడిపోతుంది. 

ఒక రోజున శ్రుతి అనుకోకుండా ఆఫీసు నుంచి మధ్యలోనే తన ఫ్లాట్ కి వస్తుంది. ఆ సమయంలో తన స్నేహితురాలితో చరణ్ సాన్నిహిత్యంగా ఉండటం చూస్తుంది. ఆ తరువాత ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. చరణ్ ఆంతర్యం ఏమిటనేది తెలుసుకున్న శ్రుతి ఆశ్చర్యపోతుంది. అతని వెనుక మాఫియా ఉందని గ్రహించి నివ్వెరపోతుంది. ఆ సమయంలో శ్రుతి చేతిలో గాయపడిన చరణ్ కుప్పకూలిపోతాడు. అతణ్ణి వాష్ రూమ్ లో బంధించి ఆమె తన ఊరుకు వెళుతుంది. 

ఆ తరువాత అక్కడి నుంచి తిరిగొచ్చిన శ్రుతికి వాష్ రూమ్ లో చరణ్ కనిపించడు. ఆ స్థానంలో ఒక యువతి శవం ఉంటుంది. దాంతో శ్రుతి బిత్తరపోతుంది. చరణ్ ఏమయ్యాడు? వాష్ రూమ్ లో శవంగా పడి ఉన్న యువతి ఎవరు? తమ బిజినెస్ గురించి శ్రుతికి తెలిసిపోయిందని గ్రహించిన గురుమూర్తి ఏం చేస్తాడు? ఫలితంగా ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటి బారి నుంచి ఆమె ఎలా బయటపడుతుంది? అనేది మిగతా కథ.

దర్శకుడు శ్రీనివాస ఓంకార్ ఈ కథను తయారు చేసుకున్న తీరు .. కథనాన్ని నడిపించిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న కథాంశంలో కొత్త పాయింట్ ఉంది. అలాగే కథ  క్లైమాక్స్ కి దగ్గర పడుతుండగా అనూహ్యమైన మలుపులు .. ట్విస్టులు షాక్ ఇస్తూ ఉంటాయి. దాంతో మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులు ఫాలో అవుతూ ఉంటారు.

ఈ కథలో ప్రధానమైన పాత్రలను పోషించిన హన్సిక .. మురళీ శర్మ .. ఆడుకాలం నరేశ్ .. జయప్రకాశ్ .. ప్రేమ మినహా, మిగతా వాళ్లంతా పెద్దగా తెలియని ఆర్టిస్టులు. ఆ తరువాత వరుసలో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపిస్తాయి. కథ ఎక్కువగా హన్సిక - ఆడుకాలం నరేశ్ మధ్య నడుస్తూ ఉంటుంది. మిగతా పాత్రలు నామ మాత్రంగా కనిపిస్తుంటాయి అంతే. ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లడానికి తారాగణం పెద్దగా హెల్ప్ కాలేకపోయిందనే భావన మాత్రం కలుగుతుంది. సరైన ఆర్టిస్టులు పడుంటే తప్ప కుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదే.  


ఇక ఇంతవరకూ హన్సిక నాజూకైన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. పైగా కథాభారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించగలిగే సామర్థ్యం ఆమెకి ఉందని నిరూపించే సినిమాలు రాలేదు. అందువలన ఈ తరహా పాత్రలలో ఆమె కనెక్ట్ కావడం కూడా కష్టమే. అయినా ఆమె తనవంతు ప్రయత్నం చేసింది. ట్రీట్మెంట్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ కూడా కథకి తగినట్టుగానే కనిపిస్తాయి. నిర్మాణ విలువలు ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు చూడొచ్చు. 


Trailer

More Reviews