'పులిమడ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

Pulimada

Movie Name: Pulimada

Release Date: 2023-11-23
Cast: Joju George, Aishwarya Rajesh, Chemban Vinod Jose, Lijomol Jose, Johny Antony
Director:A.K. Saajan
Producer: Rajesh Damodaran
Music: Anil Johnson
Banner: Appu Pathu Pappu Production House
Rating: 2.50 out of 5
  • జోజు జార్జ్ హీరోగా రూపొందిన 'పులిమడ'
  • అక్టోబర్ లో థియేటర్స్ కి వచ్చిన సినిమా 
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • ఆసక్తికరంగా లేని కథాకథనాలు 
  • ఆకట్టుకునే లొకేషన్స్  

మలయాళంలో జోజు జార్జ్ కి మంచి క్రేజ్ ఉంది. ఓటీటీలో వచ్చిన ఆయన సినిమాలు 'జోసఫ్' .. 'ఇరాట్ట' .. 'నాయట్టు' వంటి సినిమాల కారణంగా ఆయన ఇతర భాషా ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఆయన హీరోగా చేసిన సినిమానే 'పులిమడ'. ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐశ్వర్యరాజేశ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
 
ఈ కథ కేరళ ప్రాంతంలోని ఫారెస్టు ఏరియాలో జరుగుతుంది. విన్సెంట్ (జోజు జార్జ్) ఫారెస్టు ప్రాంతానికి దగ్గరగా ఉన్న తన పొలంలో ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అతను కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే తనకున్న పొలంలో కాఫీ గింజలు పండిస్తూ ఉంటాడు.  ఊరికి దూరంగా ఫారెస్టు ఏరియాలో అతను ఒంటరిగా నివసించడానికి ఒక కారణం ఉంటుంది. 

విన్సెంట్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. అతని తల్లికి మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఆమెను గొలుసులతో బంధించి ఉంచడం మాత్రం అతనికి చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. ఆ తరువాత కాలంలో ఆమె కూడా కాలం చేస్తుంది. తన తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన ఆ పొలం .. ఆ ఇల్లు అంటే అతనికి చాలా ఇష్టం. అందువలన పులులు తిరిగే ఆ ప్రదేశంలో ఒంటరిగా ఉండటానికి కూడా అతను సిద్ధపడతాడు.

విన్సెంట్ తనకి మంచి తోడు కావాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే చివరి వరకూ వచ్చిన సంబంధాలు చెడిపోతూ ఉండటంతో ఆయన విసిగిపోతాడు. తనతో పెళ్లికి కొద్ది సేపటి ముందు 'జెస్సీ' అనే యువతి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడం, విన్సెంట్ కి అవమానకరంగా అనిపిస్తుంది. ఆ బాధలో అతను తాగేసి తిరిగి వస్తుండగా .. ఆ రాత్రి వేళలో 'ఎమిలీ జార్జ్' అనే యువతి ( ఐశ్వర్య రాజేశ్) తారసపడుతుంది. 

తన కారు ట్రబుల్ ఇచ్చిందనీ .. తెల్లవారేవరకూ తనకి ఆశ్రయం ఇవ్వమని ఆమె విన్సెంట్ ను కోరుతుంది. పులి తిరుగుతూ ఉందనీ .. ఎవరూ ఆ రోడ్డుపైకి రావొద్దని ఫారెస్టు డిపార్టుమెంట్ వారు ఎనౌన్స్ చేస్తుంటారు. దాంతో విన్సెంట్ ఆమెను వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకుని వస్తాడు. అతని ఇల్లంతా అలంకరించి ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అతని పెళ్లి ఆగిపోయిందనే విషయం తెలుసుకుంటుంది. 

 ఎమిలీ అందం చూసి అతను మనసు పారేసుకుంటాడు. ఆమెను అనుభవించడానికి ట్రై చేస్తాడు. ఒకరాత్రివేళ అతని మత్తు దిగిపోతుంది. మంచం పక్కనే ఎమిలీ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భయపడిపోతాడు. ఆ భయంలో అతను ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం వలన ఏం జరుగుతుంది? ఎమిలీ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

దర్శకుడు సాజన్ తయారు చేసుకున్న కథనే ఇది. చాలా తక్కువ ప్రధానమైన పాత్రలతో ఆయన ఈ కథను రాసుకున్నాడు. ఈ కథను ఆయన ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడా అంటే .. లేదనే చెప్పాలి. కథను ఆసక్తికరంగా ఆవిష్కరించగలిగాడా? కథనం పరంగా మెప్పించగలిగాడా? అంటే అందుకు కూడా లేదనే చెప్పవలసి ఉంటుంది. చివర్లో ఒకటి రెండు ట్విస్టులు ఉంటాయి. వాటి కోసం అప్పటివరకూ ఓపిక చేసుకుని చూడటం కష్టమే.

తనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వేరొకరితో వెళ్లిపోవడం, ఆ బాధతో హీరో మందుకొడుతూ ఉండటంతోనే చాలా సమయం గడిచిపోతుంది. కథ చాలాసేపు నడిచిన తరువాత ఐశ్వర్య రాజేశ్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి కథ ఏమైనా పుంజుకుంటుందా? అంటే అదీ లేదు. ఒంటరిగా ఉన్న అతని జీవితంలోకి ఆమె అడుగుపెట్టకుండా ఒక ముఖ్యమైన పాత్రగానే మిగిలిపోతుంది. 

కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు .. కథనం నడిపించిన తీరు కూడా ఆసక్తికరంగా ఏమీ ఉండదు. అయినా ఈ సినిమా ముందు కూర్చునేలా చేసేవి లొకేషన్స్ అని చెప్పచ్చు. లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే అనాలి. వేణు కెమెరా పనితనం మెప్పిస్తుంది. అలాగే అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం కూడా సందర్భానికి తగినట్టుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. దర్శకుడే ఎడిటర్ గా వ్యవహరించాడు. 

చాలా తక్కువ ప్రధానమైన పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా, నిడివి పరంగా కూడా తక్కువగానే ఉంది. టైటిల్ కోసం అన్నట్టుగా 'పులి'ని ఒకసారి చూపిస్తారు. పెద్దగా నిర్మాణ విలువలు అవసరం లేని కథ ఇది. లవ్ .. యాక్షన్ కి ఏ మాత్రం అవకాశం లేని ఈ కథలో, ఉన్న కాస్త ఎమోషన్ ని కూడా కనెక్ట్ చేయలేకపోయారు.  జోజు జార్జ్ అంటే ఒక రేంజ్ హీరోనే గనుక, ఈ సినిమాలో ఇంకా ఏదో ఉంటుంది .. ఏదో జరగబోతుంది అంటూ ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.

Trailer

More Reviews