'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' - (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

Sultan of Delhi

Movie Name: Sultan of Delhi

Release Date: 2023-10-13
Cast: Tahir Raj Bhasin, Anjum Sharma, Vinay Pathak, Nishant Dahiya, Mehreen Pirzada, Mouni Roy, Anupriya Goenka
Director:Milan Luthria - Suparn Verma
Producer: Namit Sharma
Music: Sangeet-Siddharth
Banner: Reliance Entertainment
Rating: 2.50 out of 5
  • భారీ సిరీస్ గా రూపొందిన 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ'
  • గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో నడిచే సిరీస్ ఇది 
  • స్క్రీన్ ప్లే పరంగా కనిపించని మేజిక్ 
  • కనెక్ట్ కాని ఫ్యామిలీ ఎమోషన్స్
  • యాక్షన్ సీన్స్ వరకూ ఓకే  
  • క్లైమాక్స్ తో పాటు ఇబ్బంది పెట్టే బోల్డ్ సీన్స్ 

బాలీవుడ్ నుంచి గతంలో మాఫియా నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే ఈ మధ్య కాలంలో మాఫియా నేపథ్యంతో కూడిన వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అలా వచ్చిన కొన్ని భారీ వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'హాట్ స్టార్' ఫ్లాట్ ఫామ్ పైకి 'సుల్తాన్ ఆఫ్ ఢీల్లి' వెబ్ సిరీస్ వచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 9 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ విశేషాలేమిటనేది చూద్దాం.


  ఇది ఒక గ్యాంగ్ స్టర్ డ్రామా .. ఈ కథ 1947 - 65కి మధ్య కాలంలో జరుగుతుంది. 'లాహోర్'లో సంపన్న కుటుంబానికి చెందిన అశోక్ భాటియా, తన భార్యాబిడ్డలతో ఆనందంగా ఉంటూ ఉంటాడు. అయితే దేశ విభజన సమయంలో అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారతాయి. ఆ కుటుంబం నుంచి అశోక్ భాటియా .. 10 - 12 ఏళ్ల వయసున్న అతని కొడుకు అర్జున్ భాటియా (తాహిర్ రాజ్ భాసిన్) మాత్రమే ప్రాణాలతో బయటపడగలుగుతారు. 

ఆ తండ్రీ కొడుకులు అతి కష్టం మీద ఢిల్లీ చేరుకుని, అక్కడి శరణార్ధుల శిబిరంలో తలదాచుకుంటారు. భార్యాబిడ్డల మరణాన్ని తట్టుకోలేకపోయిన అశోక్ భాటియా, మతిస్థిమితాన్ని కోల్పోతాడు. ఢిల్లీలోని సంపన్న కుటుంబానికి చెందిన శ్యామ్ ప్రతాప్ సింగ్, శరణార్ధులను ఇబ్బందిపెడుతూ తన సంపదను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని ఒక్కగానొక్క కొడుకు రాజేందర్ సింగ్ (నిశాంత్) కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తుంటాడు. 

అటు అర్జున్  భాటియా .. ఇటు రాజేందర్ సింగ్ ఇద్దరూ కూడా యవ్వనంలోకి అడుగుపెడతారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ పెరగడం వలన అర్జున్ కి, ఎవరికీ భయపడటమనేది తెలియకుండా పోతుంది. ఆ క్రమంలో ఆయుధాల రవాణా చేసే జగన్ సేఠ్ (వినయ్ పాఠక్) దగ్గర పనిలో చేరతాడు. అక్కడ పరిచయమైన బంగాళీ (అంజుమ్ శర్మ)తో మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇక శ్యామ్ ప్రతాప్ సింగ్ చనిపోవడంతో అప్పటివరకూ ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్న శాంకరి (అనుప్రియ గొయెంకా), రాజేందర్ సింగ్ ను వశపరచుకుంటుంది. ఆమె మాయలో పడిన ఆయన, తల్లినీ .. తమ్ముడిని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. 

ఢిల్లీలో జగన్ సేఠ్ ముఠాగా చెప్పుకునే అర్జున్ భాటియా - బంగాళి ధాటికి ఎదురులేకుండా పోతుంది. అర్జున్ భాటియా .. శ్రీమంతుల కుటుంబానికి చెందిన సంజన (మెహ్రీన్) ప్రేమలో పడతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక బంగాళి కూడా నయనతార (మౌనీ రాయ్) లవ్ లో పడతాడు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర సింగ్ .. జగన్ సేఠ్ తో వ్యాపార భాగస్వామిగా చేతులు కలుపుతాడు. అయితే అర్జున్ భాటియాపై జగన్ సేఠ్ కి ఉన్న నమ్మకం, రాజేందర్ సింగ్ కి అసూయ కలిగిస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా అర్జున్ భాటియా .. బంగాళి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

'అర్నాబ్ రే' రచించిన 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. మిలన్ లుత్రియా - సుపర్న్ వర్మ కలిసి ఈ కథకి దృశ్య రూపాన్ని ఇచ్చారు. ఈ కథ 1947 - 65కి మధ్యలో జరుగుతుంది గనుక, ఆ కాలం నాటి వాతావరణాన్ని తెరపై చూపించడం చాలా కష్టమైన విషయం. ఆ కాలం నాటి కార్లు .. బైకులు .. ట్రైన్ .. వస్త్రధారణను సహజంగా చూపించడంలో దర్శకులు చాలావరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఇది చాలా విస్తారమైన కథ .. కథ మొదలైన చాలా సేపటి వరకూ కొత్త పాత్రలు వచ్చి చేరుతూనే ఉంటాయి. అయితే ప్రధానమైన పాత్రలను మాత్రం బాగానే రిజిస్టర్ చేయగలిగారు. అర్జున్ భాటియా .. బంగాళి .. జగన్ సేఠ్ .. రాజేందర్ .. శాంకరి పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. భారీతనం విషయంలో ఎక్కడా రాజీపడినట్టుగా కనిపించదు. మొదటి నుంచి చివరివరకూ పుస్తకం  చదువుతున్నట్టుగానే ఉంటుంది తప్ప, స్క్రీన్ ప్లే పరమైన మేజిక్ లు గానీ .. ట్విస్టులుగాని కనిపించవు.

ఒక వైపున మాఫియా నేపథ్యంలో కథ నడుస్తూనే ఉంటుంది. ఆ వైపు నుంచి పగ - ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటూనే ఉంటాయి.  అలాంటి సమయంలో రాజకీయాల ప్రస్తావన .. జగన్ సేఠ్ పోటీ చేయడం .. అరవింద్ త్రిపాఠిని బ్రతిమాలుకోవడం .. ఇదంతా అసలు కథకి అడ్డు తగిలినట్టుగా అనిపిస్తుంది. పైగా ప్రధానమైన శాంకరి పాత్ర అసలు ఉద్దేశం ఏమిటనేది చాలా సేపటివరకూ ప్రేక్షకులను అయోమయంలోనే ఉంచుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఓకే కానీ .. క్లైమాక్స్ మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.      

యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే కొంతవరకూ ఓకేగానీ, ఎమోషన్స్ పరంగా మాత్రం ఎక్కడా కనెక్ట్ కాలేకపోయింది. ఈ  సిరీస్ లో అసభ్యకరమైన డైలాగులు లేవు .. కానీ అలాంటి సన్నివేశాలు మాత్రం చాలానే ఉన్నాయి. అందువలన ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ చూసే సాహసం చేయకపోవడమే మంచిది. విష్ణురావు ఫొటోగ్రఫీ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆ కాలం నాటి కథకి తగినట్టుగానే సాగింది. 

ఎడిటింగ్ విషయానికి వస్తే, చివరి ఎపిసోడ్ లో అర్జున్ తో తన్నులు తిని  బంగాళి తన ఇంటికి వచ్చే సీన్ ఆర్డర్ మారినట్టు తెలుస్తుంది. పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, పుస్తకాన్ని చదువుతూ దృశ్యాలను ఊహించుకున్నట్టుగానే అనిపిస్తుంది. దానిని ఇంట్రెస్టింగ్ సిరీస్ గా ఆశించిన స్థాయిలో అందించలేకపోయారనే అనిపిస్తుంది.

Trailer

More Reviews