'బంబై మేరీ జాన్' - (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ

Bambai Meri Jaan

Movie Name: Bambai Meri Jaan

Release Date: 2023-09-14
Cast: Kay Kay Menon, Avinash Tiwary, Kritika Kamra, Nivedita Bhattacharya, Amyra Dastur
Director:Shujaat Saudagar
Producer: Ritesh Sidhwani - Farhan Akhtar
Music: Salvage Audio
Banner: Excel Entertainment
Rating: 3.00 out of 5
  • భారీ వెబ్ సిరీస్ గా రూపొందిన 'బంబై మేరీ జాన్'
  • ఫస్టు సీజన్ లో భాగంగా వదిలిన 10 ఎపిసోడ్స్
  • 1986కి ముందు ముంబైలో నడిచే కథ  
  • అందుకు తగినట్టుగా నిదానంగా నడిచే కథనం
  • ఆ కాలానికి తగిన వాతావరణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు
  •  విలన్ పాత్రలలో తగ్గిన పవర్   

ఒకప్పుడు బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్స్ కీ .. పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఎక్కువ సినిమాలు వచ్చాయి .. ఇప్పటికీ వస్తున్నాయి. అయితే అదే జోరు ఇప్పుడు వెబ్ సిరీస్ ల లోను కనిపిస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అన్నీ కూడా ఈ తరహా కాన్సెప్ట్ లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాయి. అలా ఇటీవల వచ్చిన 'గన్స్ అండ్ గులాబ్స్'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే తరహాలో రూపొందిన 'బంబై మేరీ జాన్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 1964లో మొదలై .. 1986 వరకూ నడుస్తుంది. ఈ మధ్యలో బొంబైలో నెలకొన్న మాఫియా పరిస్థితులను ఈ కథ కలుపుకుంటూ వెళుతుంది. బొంబై మహానగరం అంతా కూడా మాఫియా చేతుల్లో ఉంటుంది. అక్కడి అక్రమ కార్యకలాపాలన్నీ కూడా మాఫియా కనుసన్నల్లో నడుస్తూ ఉంటాయి. హాజీ మస్తాన్ (సౌరభ్ సచ్ దేవా) డాన్ గా అక్కడ చక్రం తిప్పుతూ ఉంటాడు. ఆ సమయంలో బొంబై పోలీస్ డిపార్టుమెంటులో ఇస్మాయిల్ (కేకే మీనన్) పనిచేస్తూ ఉంటాడు. 

ఇస్మాయిల్ కి ముగ్గురు మగపిల్లలు .. ఒక ఆడపిల్ల. ఆయన భార్య (సఖిన) భర్త మనసెరిగి నడచుకుంటూ ఉంటుంది. ఇస్మాయిల్ చాలా నిజాయితీ పరుడు. ప్రమాదకరమైన హాజీ మస్తాన్ తో తలపడటానికి కూడా ఆయన వెనుకాడడు. అయితే తన బావమరిది రహీమ్ చేసిన ఒక హత్య కారణంగా తాను ఉద్యోగం కోల్పోవలసి వస్తుంది. హాజీ మస్తాన్ కారణంగా ఎక్కడా ఏ పనీ సంపాదించలేకపోయిన ఇస్మాయిల్, చివరికి హాజీ మస్తాన్ దగ్గరే పనికి చేరతాడు. 

ఇస్మాయిల్ కొడుకులైన ధారా .. సాధిక్ .. అజ్జుకీ .. కూతురైన హబీబాకి కూడా ఆయన నిజాయితీ నచ్చదు. ఎందుకంటే ఆయన నిజాయితీ తమ అవసరాలను తీర్చలేకపోయిందనేదే వారి ఆవేదన. మాఫియా డాన్ దగ్గర తన తండ్రి బానిసలా పనిచేయడం చూడలేకపోయిన 'ధారా' .. కాలక్రమంలో తాను డాన్ గా ఎదుగుతాడు. హాజీ మస్తాన్ కి సైతం భయం పుట్టించే స్థాయికి చేరుకుంటాడు. అయితే తన పిల్లలు నేర సామ్రాజ్యంలోను ప్రవేశించడం నచ్చకపోయినా, ఇస్మాయిల్ ఏమీ చేయలేకపోతాడు. 

'ధారా' ధాటిని తట్టుకోలేకపోయిన హాజీ మస్తాన్, పఠాన్ .. అన్నా రాజన్ సాయం తీసుకుంటాడు. ముగ్గురూ కలిసి ఏకమవుతారు. ధారాను అంతం చేసి .. బొంబైపై పూర్తి పట్టు సాధించడానికిగాను వారు అన్ని వైపుల నుంచి పావులు కదుపుతూ ఉంటారు. ఒక వైపున వారి కదలికలను పసిగడుతూనే .. మరో వైపున తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ధారా ముందుకు వెళుతూ ఉంటాడు. అలాగే తన మనసైన 'పారి' (అమైరా దస్తూర్)ని సొంతం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు.

హాజీ మస్తాన్ .. పఠాన్ .. అన్నారాజన్ కలిసి, 'ధారా' కుటుంబాన్ని మట్టుపెట్టడానికి ప్లాన్ చేస్తారు. అందుకోసం 'గనియా' అనే కిరాయి హంతకుడికి సుపారీ ఇచ్చి రంగంలోకి దింపుతారు. అతను పన్నిన వ్యూహంలో 'ధారా' అన్నయ్య సాధిక్ బలవుతాడు. తన లావాదేవీల్లో తనకి కుడిభుజంలా ఉన్న సోదరుడి మరణం ధారాకి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆయన నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? చివరికి ఈ నలుగురు డాన్ లలో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో నిలుస్తారు? అనేది కథ.

రితేశ్ సిధ్వాని - ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కీ, షుజాత్ సౌగార్ దర్శకత్వం వహించాడు. దర్శకుడు తయారు చేసుకున్న ఈ కథా పరిధి పెద్దది. అందువలన లెక్కకి మించిన పాత్రలు తెరపైకి వచ్చివెళుతూ ఉంటాయి. అయితే ప్రధానమైన పాత్రలు ప్రతి ఎపిసోడ్ ల్లో తెరపైకి వచ్చేలా స్క్రీన్ ప్లే చేసుకున్న తీరు ఆకట్టుకుంటుంది. లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ .. రొమాన్స్ .. అధికారం కోసం డాన్స్ వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు, తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేయాలనే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆలోచనను దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. 

ధారా బాల్యం .. బొంబైను అతను అర్థం చేసుకున్న తీరు .. తండ్రి లైఫ్ నుంచి అతను నేర్చుకున్న పాఠం .. అతను డాన్ గా ఎదిగిన తీరు .. తన తండ్రిని భయపెట్టినవారు .. తనని చూసి భయపడేలా చేయడం .. డాన్ గా ఎదగడానికి అతను అనుసరించిన వ్యూహాలు వీటన్నిటినీ దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ధారాపై పఠాన్ మనుషులు ఎటాక్ చేయడం .. గినియా రంగంలోకి దిగడం ... పోలీస్ ఆఫీసర్ మాలిక్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.  అదే సమయంలో పఠాన్ .. అన్నా రాజన్ పాత్రలను ఆశించితిన్ స్థాయిలో పవర్ఫుల్ గా డిజైన్ చేయకపోవడం కూడా అసంతృప్తిని కలిగిస్తుంది.   

ఈ కథ 1986 కాలం కంటే ముందు నడుస్తుంది. అందువలన ఆ కాలం కథల్లాగే నిదానంగా నడిపించారు. అంత స్లో నేరేషన్ ను ఇప్పుడు ఓపికగా చూడటం కష్టంగా అనిపిస్తుంది. ఇక ఆ కాలం నాటి వాతావరణాన్ని .. కట్టడాలను .. వాహనాలను .. కాస్ట్యూమ్స్ ను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇప్పటి పోలీస్ కథల్లో .. గ్యాంగ్ స్టర్స్ కథల్లో ఉండవలసిన స్పీడ్ లేకపోవడం మాత్రం కాస్త అసహనంగా అనిపిస్తుంది. ఇక ఎక్కువ చోట్ల బూతులు .. అక్కడక్కడ కాస్త శృంగారం మామూలే. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా చాలా సహజంగా  చేశారు. ఎవరూ కూడా తమ పాత్రలలో నుంచి బయటికి రాలేదు. ఈ వెబ్ సిరీస్ కి జాన్ కెమెరాల పనితనం హైలైట్ గా నిలిచింది. లైటింగును ఆయన సెట్ చేసిన తీరు బాగుంది. ఇక సన్నివేశాలకి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కథతో పాటు మనలను ట్రావెల్ చేయిస్తుంది. తుషార్ పరేఖ్ ఎడిటింగ్ ఓకే. పిల్లల ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ .. హాబీబా పెళ్లి చూపులకు సంబంధించిన కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయవలసింది. 10 ఎపిసోడ్స్ కి సంబంధించిన కంటెంట్ ను ఇంకాస్త టైట్ చేస్తే బాగుండేది.


ప్లస్ పాయింట్స్ :
కథ ... కథనం .. భారీతారాగణం .. ఫొటోగ్రఫీ .. లైటింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కాస్ట్యూమ్స్. 

మైనస్ పాయింట్స్: కథనంలో వేగం లేకపోవడం .. ఎపిసోడ్స్ నిడివి ఎక్కువగా ఉండటం .. ముగ్గురు విలన్స్ కి సంబంధించిన ట్రాక్ పవర్ఫుల్ గా లేకపోవడం. 

More Reviews