'జైలర్' - మూవీ రివ్యూ

Jailer

Movie Name: Jailer

Release Date: 2023-08-10
Cast: Rajanikanth, Ramya Krishna, Vinayakan, Shivaraj Kumar, Mohanlal, Jackie Shroff, Tamannah, Sunil, Yogibabu, VTV Shankar
Director:Nelson Dileep Kumar
Producer: Kalanithi Maran
Music: Anirudh
Banner: Sun Pictures
Rating: 3.25 out of 5
  • 'జైలర్' గా మెప్పించిన రజనీకాంత్ 
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే ట్విస్టులు .. ఎమోషన్స్ 
  • ప్రధానమైన ఆకర్షణగా నిలిచే ఫైట్స్
  • కథ పట్టును తగ్గించిన సునీల్ - తమన్నా ట్రాక్ 
  • రజనీ ఖాతాలో మరో హిట్ పడినట్టే

రజనీకాంత్ హీరోగా రూపొందిన 'జైలర్' తమిళ .. తెలుగు భాషల్లో ఈ రోజునే విడుదలైంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. టైటిల్ తోనే ఆసక్తిని పెంచిన ఈ సినిమా, పోస్టర్స్ దగ్గర నుంచి అభిమానుల్లో ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్లింది. ఒక వైపున రజనీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్ కి గల క్రేజ్, మరో వైపున జాకీష్రాఫ్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ వంటి సీనియర్ స్టార్స్ ప్రత్యేక పాత్రలను పోషించడం మరింతగా అంచనాలు పెరగడానికి కారణమైంది. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుందనేది చూద్దాం.  

ముత్తు (రజనీకాంత్) ఆయన భార్య విజయ (రమ్యకృష్ణ) ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ దంపతులు తమ కొడుకు అర్జున్ - కోడలు శ్వేత .. మనవడితో కలిసే ఉంటారు. అర్జున్ ఏసీపీగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన చాలా సిన్సియర్ .. తప్పు చేసింది ఎంత పెద్దవాళ్లైనా ధైర్యంగా ముందుకు వెళ్లడమే అతనికి తెలుసు. గతంలో పోలీస్ డిపార్టుమెంటులో పనిచేసిన ముత్తు, తన కొడుకు సిన్సియారిటీ చూసి గర్వపడుతూ ఉంటాడు. రిటైర్ అయిన ఆయన, మనవడితో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. 

అలాంటి పరిస్థితుల్లోనే పురాతనమైన దేవాలయాలలోని విగ్రహాలను దొంగిలించే ముఠా ఒకటి రంగంలోకి దిగుతుంది. ప్రాచీన విగ్రహాలను కాజేసి అలాంటి మరో విగ్రహాన్ని అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అయితే మతపరమైన సమస్య కావడం వలన, పోలీస్ డిపార్టుమెంటు ఈ విషయం బయటికి రాకుండా చూస్తూ ఉంటుంది. దేవాలయాల నుంచి దొంగిలించిన విగ్రహాలు ఇతర ప్రాంతాలకు రహస్యంగా తరలించబడుతూ ఉంటాయి. ఈ రాకెట్ వెనుక ప్రధానమైన సూత్రధారి వర్మన్( వినాయకన్). 

ఈ కేసును ఛేదించడానికి ఏసీపీ అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఆ కేసు పరిశోధన గురించి వెళ్లిన అతను, వెనక్కి తిరిగిరాడు. ఈ కేసుకు సంబంధించిన వారే తన కొడుకును చంపేశారనే విషయం ముత్తుకు తెలుస్తుంది. చిన్నప్పుడు కొడుకు 'పన్ను' ఊడిపోతే ఆ పన్నును పారేయడానికి మనసొప్పక, దానిని ఒక లాకెట్ లో ఉంచి ధరిస్తూ వచ్చిన ముత్తు, ఆ నిజాన్ని తట్టుకోలేకపోతాడు. చిన్నప్పటి నుంచి నీతి - నిజాయతి అంటూ అర్జున్ ను ఆ మార్గంలో నడిపించడం వల్లనే, అతను చనిపోయాడని విజయ తన భర్తను నిందిస్తుంది.  

అర్జున్ డెడ్ బాడీ కూడా దొరక్కపోవడంతో, ఆ కేసును పక్కదారి పట్టించడానికి డిపార్టుమెంటులో పెద్ద తలకాయలు ప్రయత్నాలు చేస్తుంటాయి. మరో వైపున ముత్తు మనవడిని చంపుతాననీ, అందులో ఎలాంటి సందేహం లేదని అతనికి వర్మన్ సవాలు విసురుతాడు. ఆ క్షణం నుంచే తన ప్రయత్నాలు మొదలెడతాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ముత్తు రంగంలోకి దిగుతాడు. ముత్తు ఓ పోలీస్ ఆఫీసర్ కి తండ్రి మాత్రమే కాదనీ, 15 ఏళ్ల క్రితం కరడుగట్టిన నేరస్థులకు చుక్కలు చూపించిన తీహార్ జైలు జైలర్ అనీ, పూర్తి పేరు 'టైగర్ ముత్తువేల్ పాండియన్' అని వర్మన్ కి తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది కథ.

నెల్సన్ దిలీప్ కుమార్ కి దర్శకుడిగా కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన కథను రెడీ చేసుకునే తీరు .. దానిని పెర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించే విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అదే పద్ధతిలో ఆయన 'జైలర్' కాన్సెప్ట్ ను నడిపించాడు. ముందుగా ఆయన విలన్ ను పరిచయం చేసి, ఆ తరువాత హీరో ఇంట్రడక్షన్ ఇప్పించడం కొత్తగా అనిపిస్తుంది. రజనీ లుక్ ను సెట్ చేసిన తీరుతోనే ఆయన సగం మార్కులు కొట్టేశాడు. రజనీ స్టైల్ ను .. విలన్ మేనరిజంను ఆయన డిజైన్ చేసుకున్న విధానం, ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. 

ఫస్టాఫ్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు తల తిప్పనివ్వడు. తెరపై ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉంటుంది. తన మనవడిని చంపడానికి ట్రై చేసినవారిపై ముత్తు ఎటాక్ చేసే సీన్, విగ్రహాలను తీసుకుని వెళుతున్న వ్యాన్ ను బోల్తా కొట్టించే సీన్ .. ఒక రాత్రివేళ ముత్తు ఇంటిపై రౌడీలు దాడి చేసే సీన్ ఫస్టాఫ్ కి హైలైట్ గా నిలుస్తాయి. అలాగే క్యాబ్ డ్రైవర్ గా యోగిబాబు .. మానసిక వైద్య నిపుణిడిగా వీటీవీ శంకర్ హాయిగా నవ్విస్తారు. 

ఫస్టాఫ్ లో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇస్తే, సెకండాఫ్ లో జాకీ ష్రాఫ్ .. మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తారు. అయితే వీరి పాత్రలు కావాలని అంటించినట్టుగా కాకుండా, సందర్భానికి తగినట్టుగా అనిపిస్తాయి. వాళ్ల స్థాయికి తగిన పవర్ఫుల్ రోల్స్ లోనే కనిపిస్తారు. సెకండాఫ్ లో సునీల్ - తమన్నా లవ్ ట్రాక్, మెయిన్ థ్రెడ్ తో ముడిపడి ఉంటుంది. కాస్త కామెడీగా నడిచే ఈ ట్రాక్ వలన అప్పటివరకూ కథకున్న బరువు తగ్గినట్టుగా ..  పలచబడినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ లోనే జైలర్ గా రజనీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది .. రజనీ యంగ్ లుక్ తో ఆ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. 

హీరో .. విలన్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రీ క్లైమాక్స్ లో పడే ట్విస్ట్ తో ప్రేక్షకుడు ఉలిక్కిపడతాడు .. ముత్తు పాత్ర విషయంలో ఆందోళన చెందుతాడు.  ఈ సందర్భంలో రజనీకాంత్ లోతైన నవ్వు,  ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. ఒక్క సునీల్ - తమన్నా ఎపిసోడ్ విషయంలో కాస్త ఓపిక పడితే, అక్కడక్కడా ఎదురయ్యే హింస - రక్తపాతం భరించగలిగితే, ఇది రజనీ మార్క్ సినిమా .. రజనీ మేజిక్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. 

కథ .. కథనంతో పాటు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.  'జైలర్' థీమ్ మ్యూజిక్ .. 'రా .. నువ్వు కావాలయ్యా' సాంగ్ ప్రేక్షకులను హుషారెత్తిస్తాయి. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి.  విజయ్ కార్తీక్ కన్నన్ ఫొటోగ్రఫీ బాగుంది. రజనీని మరింత స్టైలీష్ గా చూపించాడు.  యాక్షన్ .. ఛేజింగ్ సీన్స్ మీ గొప్పగా చిత్రీకరించాడు. నిర్మల్ ఎడిటింగ్ కూడా ఓకే. స్టన్ శివ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. 

ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. హీరో - విలన్ పాత్రలను డిజైన్ చేసిన తీరు ..  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. కామెడీ .. ఫైట్స్ .. ఎమోషన్స్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ .. క్లైమాక్స్ ట్విస్ట్. 

మైనస్ పాయింట్స్: సునీల్ - తమన్నాకి సంబంధించిన ఎపిసోడ్ .. హింస .. రక్తపాతం.

Trailer

More Reviews