'జీ కర్దా' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Jee Karda

Movie Name: Jee Karda

Release Date: 2023-06-15
Cast: Tamannah, Suhail, Aasham Gulati, Anya Singh, HussainDalal, Samvedana, Sayan, Malhar
Director:Arunima Sharma
Producer: Dinesh Vijan
Music: Sachin- Jigar
Banner: Maddock Productions
Rating: 2.50 out of 5
  • తమన్నా ప్రధానమైన పాత్రగా 'జీ కర్దా'
  • అంత గ్లామరస్ గా అనిపించని తమన్నా 
  • ఆమె పాత్ర వైపు నుంచి కూడా అభ్యంతరకర సన్నివేశాలు
  • కథాకథనాల్లో కనిపించని బలం 
  • అవసరం లేకపోయినా ఎదురుపడే ఫ్లాష్ బ్యాక్  

తమన్నా ఒక వైపున సౌత్ లోని సీనియర్ స్టార్ హీరోల జోడీ కడుతూనే, మరో వైపున బాలీవుడ్ వెబ్ సిరీస్ లపై కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. ఆమె ప్రధానమైన పాత్రధారిగా 'జీ కర్దా' వెబ్ సిరీస్ హిందీలో రూపొందింది. దినేశ్ విజన్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కీ, అరుణిమ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ రోజునే ఈ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ తో పాటు ఇతర భాషల్లోను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ ను వదిలారు. ఇంతవరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కంటెంట్ ఎలా ఉందనేది చూద్దాం.

ఈ కథ ముంబై నేపథ్యంలో నడుస్తుంది. లావణ్య (తమన్నా) .. రిషభ్ (సుహెయిల్ నయ్యర్) .. అర్జున్ (ఆషిమ్ గులాటి) .. ప్రీతి (అన్యా సింగ్) ... షాహిద్ (హుస్సేన్ దలాల్) .. శీతల్ (సంవేదన ) ... మెల్ (సయాన్) వీళ్లంతా కూడా ఒకే స్కూల్లో చదువుకుంటారు. అందువలన అందరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరుగుతూ వెళుతుంది. అయితే వీళ్లందరిలో రాక్ స్టార్ గా అర్జున్ మంచి పాప్యులర్ అవుతాడు. 

 రాక్ స్టార్ గా అర్జున్ తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రీతి ఎప్పటికప్పుడు ప్రేమ కోసం అన్వేషిస్తూ వెళుతూ ఉంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు తప్ప, ఆమె ఆశించిన ప్రేమ మాత్రం కనిపించదు. ఇక సమీర్ తో ఇరుకింట్లో కలిసి సర్దుకుపోలేక శీతల్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆమె అసంతృప్తిని కూల్ చేయడానికి సమీర్ నానా తంటాలు పడుతుంటాడు. ఇక 'ఆయత్' ప్రేమలో పడిన షాహిద్ ఆమెతో షికార్లు చేస్తుంటాడు. 'మెల్' మాత్రం 'గే' సంబంధాలను కొనసాగిస్తూ ఉంటాడు. 

ఇక లావణ్య - రిషభ్ విషయానికి వస్తే, ఇద్దరూ 12 ఏళ్లుగా ప్రేమించుకుంటూ ఉంటారు. నాలుగేళ్లుగా సహజీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకుని .. ఒక సొంత ప్లాట్ తీసుకోవాలనేది వారి ఆలోచన. అందుకు కొంత డబ్బును పోగు చేస్తారు కూడా. అయితే రిషభ్ పేరెంట్స్ తీరు లావణ్యకు నచ్చదు. అలాగే లావణ్య తల్లి పద్ధతి కూడా రిషభ్ పేరెంట్స్ కి నచ్చదు. దాంతో ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు మొదలవుతాయి. వాళ్ల పెళ్లి జరుగుతుందా? ఆ స్నేహితుల జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? అనేది కథ.

దర్శకుడు అరుణిమ శర్మ ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. తమన్నా ప్రధానమైన ఆకర్షణ ... మిగతావారిలో కొంతమంది వెబ్ సిరీస్ స్టార్స్ ఉన్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ను ఏదో సాదా సీదాగా చుట్టే ఆలోచన కూడా చేయలేదు .. పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశారు. మంచి ఆర్టిస్టులు ఉన్నారు .. ఖర్చుకు వెనకాడని నిర్మాతలు ఉన్నారు. అలాంటి ఈ వెబ్ సిరీస్ లో లేనిది ఏమిటి? అంటే .. 'మంచి కథ' అనే చెప్పుకోవలసి ఉంటుంది.

మంచి కథమాట దేవుడెరుగు .. మామూలు కథ కూడా కనిపించదు. అసలు దీనికి స్క్రిప్ట్ అనేది ఉందా? లేదంటే ఒక లైన్ అనేసుకుని ఎవరికి వారు చేసేశారా? అనే అనుమానం వస్తుంది. దమ్ముకొట్టడం .. మందు కొట్టడం .. జంటలు జంటలుగా శృంగారంలో పాల్గొనడం. అంతకుమించి బ్రతుకు దెరువు కోసం ఏ పాత్ర కూడా ఏ పనీ చేయదు. ఈ విషయం గుర్తొచ్చి అప్పుడప్పుడు ఏదో హడావిడి మాత్రం చేస్తుంటారు. 

ఎవరూ ఏ పనీ చేయకపోయినా ఫరవాలేదు. కానీ ఏ పాత్రకి నైతిక విలువలు కనిపించవు. ఎవరూ దేనికీ కట్టుబడరు. ఇక మరో వైపున పేరెంట్స్ పాత్రలను కూడా లిఫ్ట్ లో కిందికి లాగేశారు. స్నేహం ... వైవాహిక జీవితం ... పెద్దరికం ఇలాంటి అంశాల విషయంలో దర్శకుడు ఎంతమాత్రం శ్రద్ధ పెట్టలేదు. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు .. అందువలన ఇక స్క్రీన్ ప్లే గురించి కూడా మాట్లాడుకోవలసిన పనిలేదు. పై పైన పలచగా అల్లేసిన సన్నివేశాలతోనే ఎపిసోడ్స్ నడుస్తాయి. 

తమన్నా విషయానికి వస్తే ఆమె ఇలాంటి ఒక కథను ఒప్పుకోవడమే ఆశ్చర్యంగా అనిపిస్తే, బోల్డ్ సీన్స్ లో నటించడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఆమె అంత గ్లామరస్ గా కనిపించింది కూడా లేదు.  పాత్రల్లో పట్టు లేకపోవడం వలన, మిగతావారి నటన గురించి మాట్లాడుకోవడానికి లేదు. సచిన్ - జిగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. దీపిక - నేహా మెహ్రా ఎడిటింగ్ విషయానికి వస్తే, 'గే' కాంబినేషన్ సీన్స్ ను .. ప్రధానమైన పాత్రల టీనేజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ట్రిమ్ చేయవలసింది. ఫొటోగ్రఫీ మాత్రం బాగుంది.

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. ఫొటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: పైపైన అల్లుకున్న పలచని కథ. ప్రయోజనం లేని ... ఆదర్శానికి నిలబడని పాత్రలు. శృంగార సన్నివేశాలకే అధిక ప్రాధాన్యత. ప్రస్తుత కథకు ఫ్లాష్ బ్యాక్ ను జోడిస్తూ నడిపించడం.

Trailer

More Reviews