'బిచ్చగాడు 2' - రివ్యూ

Bichagadu 2

Movie Name: Bichagadu 2

Release Date: 2023-05-19
Cast: Vijay Antony, Kavya Thapar, Radha Ravi, YG Mahendran, Mansoor Alikhan, Harish Peradi, Dev Gill, John Vijay, Yogi Babu
Director:Vijay Antony
Producer: Vijay Antony
Music: Vijay Antony
Banner: Vijay Antony Film
Rating: 3.25 out of 5
  • భారీ అంచనాల మధ్య విడుదలైన 'బిచ్చగాడు 2'
  • ఈ సారి చెల్లెలి సెంటిమెంట్ పై నడిపించిన విజయ్ ఆంటోని 
  • యాక్షన్ కీ .. ఎమోషన్ కి మాత్రమే ప్రాధాన్యత 
  • టేకింగ్ .. ఫొటోగ్రఫీ .. బీజీఎమ్ హైలైట్
  •  ఆకట్టుకునే ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ 

విజయ్ ఆంటోని హీరోగా 2016లో 'బిచ్చగాడు' సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో మాదిరిగానే తెలుగులోను ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది.  అనువాద చిత్రాల వసూళ్ల విషయంలోను కొత్త రికార్డులను నెలకొల్పింది. అలాంటి సినిమాకి రెండో భాగంగా రూపొందిన  'బిచ్చగాడు 2' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటిభాగం స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందా లేదా అనేది చూద్దాం. 

 విజయ్ (విజయ్ ఆంటోని) లక్షకోట్ల ఆస్తులున్న శ్రీమంతుడు. తన సంస్థలోనే పనిచేస్తున్న హేమ (కావ్య థాపర్) ప్రేమలో ఉంటాడు. అతని సంస్థలో పని చేస్తున్న అరవింద్ (దేవ్ గిల్) చైతన్య ( జాన్ విజయ్) శివ (హరీశ్ పేరడీ) లక్షకోట్ల ఆస్తిపై కన్నేస్తారు. అరవింద్ తనకి తెలిసిన బ్రెయిన్ సర్జన్ మెహతాను రంగంలోకి దింపుతాడు. విజయ్ చాలా బ్రిలియంట్ కావడం వలన, అతనికి ఓ అనామకుడి బ్రెయిన్ పెట్టేసి, తాము చెప్పింది వినేలా చేయాలనుకుంటారు.

అదే సమయంలో విజయ్ ను పోలిన సత్య (మరో విజయ్ ఆంటోని) వారి కంటపడతాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను ఓ రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న సత్య - రాణి అనాథలవుతారు. సత్య బిచ్చమెత్తుకుని తన చెల్లెలిని పోషిస్తుంటాడు. సత్యను ఒక వ్యక్తి మోసం చేసి, అతని చెల్లెలిని ఎవరికో అమ్మేస్తాడు. ఆ వ్యక్తిని హత్య చేసిన సత్య, 20 ఏళ్ల పాటు జైలుశిక్షను అనుభవిస్తాడు. బయటికి వచ్చిన దగ్గర నుంచి అతను తన చెల్లెలి కోసం వెదుకుతుంటాడు. 

అలాంటి పరిస్థితుల్లోనే అతను శివ .. చైతన్య .. అరవింద్ కంటపడతాడు. అతను ఒక సాధారణ బిచ్చగాడు అని మాత్రమే వాళ్లు అనుకుంటారు. పథకం ప్రకారం విజయ్ కి సత్య బ్రెయిన్ ను అమర్చి, సత్య బాడీని అవతల పారేస్తారు. ఇక ఇప్పుడు బయట జనానికి కనిపించేది విజయ్ .. కానీ అతని బ్రెయిన్ లో మాత్రం సత్యకి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. సత్య తాము అనుకున్నంత అమాయకుడు కాదనీ, తమ పని కాగానే అతణ్ణి అంతం చేయాలని ఆ ముగ్గురు ప్లాన్ చేస్తారు. అప్పుడు సత్య ఏం చేస్తాడు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు?  చివరికి అతను తన చెల్లెలిని కలుసుకున్నాడా లేదా? అనేదే కథ.

విజయ్ ఆంటోని ఈ సినిమాకి నిర్మాత .. దర్శకుడు .. సంగీత దర్శకుడు .. ఎడిటర్ కూడా. గతంలో ఆయన నుంచి వచ్చిన 'బిచ్చగాడు' సృష్టించిన సంచలనం వలన, సహజంగానే 'బిచ్చగాడు 2'పై అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను విజయ్ ఆంటోని అందుకున్నాడా? అంటే, చాలా వరకూ  అందుకున్నాడనే చెప్పాలి. ఫస్టు పార్టు కంటెంట్ వేరు .. అది పూర్తిగా మదర్ సెంటిమెంట్ తో నడుస్తుంది. 'బిచ్చగాడు 2' సిస్టర్ సెంటిమెంట్ తో నడుస్తుంది. 

ఫస్టు పార్టులో హీరో తన తల్లి కోసం కోట్ల ఆస్తులను వదులుకుని 'బిచ్చగాడు'గా మారతాడు. సెకండు పార్టులో హీరో కోట్ల ఆస్తి కలిసొస్తున్నా తన చెల్లెలి కంటే అవి ఎక్కువ కాదనుకుంటాడు. అసలు బిచ్చగాళ్లు అనేవారు లేకుండా చేయాలని చూస్తాడు. రెండు సినిమాలు కూడా ఎమోషన్స్ పరంగా కాస్త అటు ఇటుగా అనిపించినా, సెకండ్ పార్ట్ కంటెంట్ కూడా నిరాశపరిచదు. ఫస్టాఫ్ లో చైల్డ్ ఆర్టిస్టులు ఎపిసోడ్ .. ఇంటర్వెల్ బాంగ్ సీన్ హైలైట్. ఇంటర్వెల్ సీన్ చూస్తుంటే, క్లైమాక్స్ ను చూసినట్టుగా ఉంటుంది.

ఇక సెకండాఫ్ లో మీటింగ్ హాల్లో ఫైట్ సీన్ .. క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి. విజయ్ ఆంటోనీ ఈ కథలో ఫస్టు పాటలో మినహా రొమాన్స్ జోలికి పోలేదు. కామెడీని టచ్ చేసే ప్రయత్నం అసలే చేయలేదు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగానే కథ అంతా నడుస్తుంది. బలమైన కథ .. స్క్రీన్ ప్లేతో విజయ్ ఆంటోని ముందుకు వెళ్లాడు. ఇక సంగీత దర్శకుడిగా .. ఎడిటర్ గా కూడా ఆయన ఫుల్  మార్కులు కొట్టేశాడు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాను ఆయన నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. 
 
నిర్మాతగా నిర్మాణ విలువల విషయంలో ఎంతమాత్రం తగ్గలేదనే విషయం మనకి అర్థమవుతూనే ఉంటుంది. ఓం నారాయణ్ ఫొటోగ్రఫీ గొప్పగా అనిపిస్తుంది. ఖరీదైన లొకేషన్స్ ను కలర్ ఫుల్ గా .. బ్యూటిఫుల్ గా ఆయన ప్రేక్షకుల ముందుంచాడు. హీరో పాత్ర నేపథ్యంలోని సీన్స్ కి రిచ్ నెస్ ను తీసుకొచ్చాడు. రాజశేఖర్ - మహేశ్ మాథ్యు ఫైట్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి. డైలాగ్స్ కూడా సన్నివేశాలకు .. సందర్భానికి తగినట్టుగా ఉంటాయి. 

 విజయ్ ఆంటోని నటన ఈ సినిమాకి హైలైట్. కావ్య థాఫర్ నిండుగా కనిపిస్తుంది .. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి.  మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకు జీవం పోశారు. కథ మొదలైన దగ్గర నుంచి విజయ్ ఆంటోని ఎక్కడా అనవసరమైన సీన్స్ లేకుండా చూసుకున్నాడు. క్రమక్రమంగా సన్నివేశాల స్థాయిని పెంచుకుంటూ వెళ్లాడు. చెల్లెలు పాత్ర వైపు నుంచి వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల కళ్లను తడి చేస్తుంది. 

ప్లస్ పాయింట్స్: కథాకథనాలు ... నిర్మాణ విలువలు ... యాక్షన్ .. ఎమోషన్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫైట్స్. 

మైనస్ పాయింట్స్: సెకండాఫ్ ఆరంభంలోను .. కోర్టు సీన్ లోను కథనంలో వేగం తగ్గడం. యోగిబాబు పాత్రను ఉపయోగించుకోకపోవడం. 

*నటుడిగా .. దర్శకనిర్మాతగా .. సంగీత దర్శకుడిగా .. ఎడిటర్ గా విజయ్ ఆంటోని మెప్పించిన సినిమా ఇది. అక్కడక్కడా కథ కాస్త స్పీడ్ తగ్గినా ఆడియన్స్ ను నిరాశపరచని సినిమా ఇది.

Trailer

More Reviews