కోలీవుడ్ దర్శకులలో కార్తీక్ సుబ్బరాజుకి మంచి ఇమేజ్ ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, వాటిని తనదైన శైలిలో తెరకెక్కించడం కార్తీక్ సుబ్బరాజు ప్రత్యేకత. అలాంటి కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన మరో సినిమానే 'డోరతీ'. కీర్తి సురేశ్ .. సనంత్ .. రిషికాంత్ .. ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా,సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అది తమిళనాడు ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం. ఆ ఊళ్లో విజిల్ వీరయ్య (ముత్తుకుమార్) పెత్తనమే కొనసాగుతూ ఉంటుంది. చాలాకాలం క్రితమే ఆయన భార్య .. పెళ్లీడుకొచ్చిన కూతురు ఇద్దరూ కూడా పొలం బావిలో శవాలై తేలతారు. అప్పటి నుంచి అది ఆడదిక్కులేని ఇల్లు. అందువలన విజిల్ వీరయ్య మానవత్వమనేది లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన పెద్ద కొడుకు 'కలై' (సౌందర రాజా) తండ్రికి కుడిభుజంలా ఉంటాడు. చిన్న కొడుకు సుబ్బు (సనంత్) మాత్రం, తన స్నేహితుడైన 'కార్తీ' ( రిషికాంత్)తో కలిసి తిరుగుతూ ఉంటాడు.
కార్తీని చేరదీసింది కూడా విజిల్ వీరయ్యనే. అతను అప్పగించిన పనులనే కార్తీ నమ్మకంగా పూర్తిచేస్తూ ఉంటాడు. కార్తీకి తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెను కనిపెట్టుకుంటూనే అతను తన పనులను చక్కబెడుతూ ఉంటాడు. ఒక రోజున సుబ్బు అన్నయ్య కలై, 'డోరతీ' అనే యువతిని పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు. ఆమె రాక సుబ్బుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవదు. 'డోరతీ' అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఆమె వంటిపై గాయాలు సుబ్బులో అనేక సందేహాలు రేకెత్తిస్తాయి.
డోరతీ ఆత్మహత్య చేసుకోలేదనీ, తన తండ్రి .. అన్నయ్య ఇద్దరూ కలిసి ఆమెను చంపేశారని సుబ్బు భావిస్తాడు. అయితే అప్పటికే అతను తాను ప్రేమించిన 'ధనలక్ష్మీ' అన్నయ్య మర్డర్ కేసులో ఉంటాడు. ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే కార్తీ లారీ డ్రైవర్ గా వేరే ప్రాంతాలలో తిరుగుతుంటాడు. 'డోరతీ' మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన సుబ్బు 'హిజ్రా'గా మారిపోయి ఆ ఇంట్లో నుంచి పారిపోతాడు.
ఈ విషయం ఊళ్లో తెలిస్తే పరువుపోతుందని భావించిన విజిల్ వీరయ్య, సుబ్బును చంపేసి .. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించమని కార్తీని పురమాయిస్తాడు. 'డోరతీ' ఎందుకు చనిపోతుంది? ఆమె మరణం తరువాత సుబ్బు ఎందుకు హిజ్రాగా మారిపోతాడు? విజిల్ వీరయ్య ఆదేశించినట్టుగానే సుబ్బును కార్తీ చంపేస్తాడా? అనేది ఈ కథలో కనిపించే ఆసక్తికరమైన అంశాలు.
'డోరతీ' అంటే దేవుడిచ్చిన వరం అనే అర్థం వస్తుంది. ఈ కథలో ఇది కీర్తి సురేశ్ పాత్ర పేరు. ట్రాన్స్ జెండర్స్ కి ఆ జీవితం ఒక శాపం కాదు .. వరం అనే అర్థం కూడా ఈ కథలో మనకి అంతర్లీనంగా కనిపిస్తుంది. ఈ కథ ఒకరికోసం ఒకరు బ్రతికే ఇద్దరు స్నేహితుల కథగా మొదలవుతుంది. వాళ్ల చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకూ అందుకు సంబంధించిన సన్నివేశాలను కలుపుకుంటూనే వెళుతుంది.
ఎప్పుడైతే కీర్తి సురేశ్ ఎంట్రీ ఇచ్చిందో, అక్కడి నుంచి కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని భావిస్తారు. కానీ ఆ వెంటనే ఆ పాత్రను చంపేసి షాక్ ఇస్తాడు దర్శకుడు. ఆమె ఎందుకు చనిపోతుంది? వదిన చనిపోతే మరిది ఎందుకు అంతగా బాధపడుతున్నాడు? అనే రెండు సందేహాలను దర్శకుడు ఇక్కడ రేకెత్తిస్తాడు. ఈ విషయంలో ఆడియన్స్ లో అనుమానాలు బలపడుతూ ఉండగా, అప్పుడు దర్శకుడు అసలు విషయాన్ని రివీల్ చేస్తాడు. సుబ్బు పాత్రలోని హిజ్రాను బయటికి తీసుకొస్తాడు.
ఇక సుబ్బును చంపేయమని కార్తీని విజిల్ వీరయ్య పురమాయించడంతో కథ మరింత పుంజుకుంటుందని అనుకోవడం సహజం. కానీ ఇక్కడి నుంచి కథ మరింత స్లో అవుతుంది. ఇక్కడి నుంచి సుబ్బు - కార్తీ మధ్య వేసుకున్న సన్నివేశాలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా చప్పగా సాగుతూ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సమయానికి బలపడుతూ వెళ్లవలసిన కథ, బలహీనపడుతూ వెళుతుంది. క్లైమాక్స్ కూడా అందరికీ నచ్చేలా ఉందని చెప్పలేం.
ఇక చివరివరకూ ప్రేక్షకులు ఎదురుచూసే అంశం మరొకటి ఉంది. 'డోరతీ' పాత్ర ఎందుకు చనిపోతుంది? అందుకు కారణం ఏమిటి? కారకులు ఎవరు? అనేది. కానీ ఈ విషయాన్ని అక్కడే వదిలేయడం ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగిస్తుంది. ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపును చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం మంచిదే అయినా, ఆ విషయాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయాడని చెప్పాలి.
నటీనటులు ఎవరి పాత్ర పరిధిలో వాళ్లు చేశారు. తిరు ఫొటోగ్రఫీ .. ఇళయరాజా నేపథ్య సంగీతం .. గణేశ్ శివ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి. 'డోరతీ' అనే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ చూసినవాళ్లు .. ఈ సినిమా చూసేవాళ్లు ఇది కీర్తి సురేశ్ సినిమా అనే అనుకుంటారు. కానీ ఇది ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ. తెరపై కీర్తి సురేశ్ కనిపించేది కొంతసేపు మాత్రమే కావడం .. ఆ పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం .. సెకండాఫ్ మరింత నిదానంగా సాగడం .. ఈ కథలోని ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది.
'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Dorothy Review
Movie Details
Movie Name: Dorothy
Genre: Crime, Drama
Release Date: 2026-10-23
Cast: Sananth, Rishikanth, Keerthy Suresh
Director: Karthik Subbaraj
PRO: -
Music: Ilaiyaraaja
Banner: Sikhya Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer