కొత్త కథలతో అలరించే స్క్రీన్‌ప్లేతో సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా  మర్డర్‌ మిస్టరీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఎక్కువగా  ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ జాబితాలోనే ఈ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న చిత్రమే 'మయూఖ'  పాయల్‌ చెంగప్ప టైటిల్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మర్డర్‌ మిస్టరీ, సైకలాజికల్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? 'మయూఖ' ప్రేక్షకులను థ్రిల్ల్‌ని పంచిందా? లేదా సమీక్షలో తెలుసుకుందాం. 

మయూఖ (పాయల్ చెంగప్ప) ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగిని. రాత్రి వేళల్లో తన అపార్ట్‌మెంట్‌లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తనను వెంబడిస్తున్నట్లు, భయపెడుతున్నట్లు అనిపించడంతో.. పోలీసులను ఆశ్రయిస్తుంది. పోలీసులు ఆమెది భయంతో కూడిన భ్రమ అని కొట్టిపారేయడంతో చేసేది లేక ఆమె ప్రాణభయంతో మరో అపార్ట్‌మెంట్‌కు మారుతుంది. ఈ సమయంలోనే నగరంలో ఒక సైకో కిల్లర్ మహిళలను లక్ష్యంగా చేసుకుని  చేసి కిడ్నాప్ చేయడంతో పాటు  వారి శరీర భాగాలను అతి కిరాతకంగా నరికి చంపి ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో బయట పారేస్తుంటాడు. అనుకోకుండా మయూఖ ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది?  మరి నగరంలో జరుగుతున్న ఈ వరుస హత్యలకు, మయూఖకు ఉన్న సంబంధం ఏమిటి? తనను వెంటాడుతున్న వ్యక్తి, ఈ సైకో కిల్లర్ ఒక్కరేనా? ఈ క్రైమ్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

దర్శకుడు ఓ విభిన్నమైక కాన్సెప్ట్‌ చుట్టు ఈ మర్డర్‌ మిస్టరీ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో స్క్రీన్‌ప్లేను అల్లుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో సైకో కిల్లర్‌ నేపథ్య కథలు వచ్చినప్పటికి ఎందులో రాని ఓ కొత్త పాయింట్‌ను దర్శకుడు శ్రీతేజ్‌ ఈ చిత్రంలో డీల్‌ చేశాడు.  సినిమా కథ ప్రారంభం కూడా సినిమా విడుదల రోజే జరుగుతున్నట్లు చూపించడం కొత్తగా అనిపించింది. సినిమాలోని ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను రేకెత్తించే విధంగా సన్నివేశాలను అల్లుకున్నాడు. ఇంట్రెస్టింగ్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ట్విస్టులతో సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ ను లాక్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

ఫస్ట్ హాఫ్ కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించినా సెకండాఫ్‌లో వచ్చే స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయనే ఫీల్‌ కలిగినా...అసలు స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉండటంతో అప్పటివరకు ఓపిక పట్టాలి. సినిమాలోని కీలక మలుపుల తర్వాత అసలు ఆ సైకో కిల్లర్ ఎవరనేది క్లైమాక్స్ లో రివీల్ అయినప్పుడు మాత్రం ఆడియన్స్ కు ఒక సాలిడ్ థ్రిల్.. దొరుకుతుంది. ఆ ఎండ్ షాకింగ్‌ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే మాత్రం కచ్చితంగా స్క్రీన్ మీద చూడాల్సిందే. దర్శకుడు పతాక సన్నివేశాల్లో పార్ట్‌-2కు కూడా లీడ్‌ ఇవ్వడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. 

ఓ మహిళా బ్యాంక్‌ ఉద్యోగి చుట్టు తిరిగే ఈ కథలో దర్శకుడు క్రియేట్‌ చేసిన ప్రతి పాత్రను స్క్రీన్‌ప్లే అనుగుణంగా ప్రవేశపెట్టాడు. ప్రతి పాత్ర మీద ఆ పాత్రే క్రైమ్‌ చేశారేమో అనే సందేహం కలిగేలా దర్శకుడు స్క్రీన్‌ప్లే  అల్లుకున్నాడు. అసలు సైకో కిల్లర్‌ మర్డర్‌ చేశాడా? లేక దెయ్యం ఉందా? లేదా హీరోయిన్‌ మానసిక పరిస్థితి వల్ల ఇదంతా జరుగుతుందా? అనే కన్‌ఫ్యూజన్‌తో కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. 


పరిమిత బడ్జెట్‌తో.. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన 'మయూఖ' మర్డర్‌ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే వారికి పూర్తి సంతృప్తి నిస్తుంది. అయితే దర్శకుడు సైకో కిల్లర్‌ మనుషులను చంపే విధానాన్ని అతి కిరాతకంగా చూపించడం సున్నిత మనస్కులకు నచ్చదు. అలాంటి వారు ఈ సినిమాకు దూరంగా ఉండటమే బెటర్‌. 

ప్రధాన పాత్రలో మయూఖగా నటించిన పాయల్‌ చెంగప్ప తన పాత్రకు న్యాయం చేసింది. అయితే కొన్ని సన్నివేశాల్లో తడబడింది. సన్నివేశాల్లో ఉన్న బలం ఆ లోపాన్ని తెలియనివ్వలేదు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా నటన కనబరిచారు.
సిబీ మాథ్యూ అలెక్స్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశంలో థ్రిల్లర్‌ మూడ్‌ను క్రియేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యేలా చేసింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి. 

కొన్ని లాజిక్ లేని సన్నివేశాలను, తొలి భాగంలో ఉండే చిన్నపాటి ల్యాగ్‌ను పక్కన పెడితే, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు 'మయూఖ' డీసెంట్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ..