ఎలాంటి స్టార్స్ లేకుండా .. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు .. సాంగ్స్ లేకుండా ఒక సినిమా వందల కోట్లను రాబట్టడం అంత తేలికైన విషయమేమీ కాదు. 200 కోట్లు ఖర్చు చేస్తే 400 కోట్లు రాబట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఒక సినిమా కేవలం 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తే అది 425 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషంగానే చెప్పుకోవాలి. అలాంటి ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినిమానే 'హనుమాన్ అంశ్'. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా' జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా, ఆగస్టు 7వ తేదీన విడుదలైంది. ఈ రోజున తెలుగులోను థియేటర్లకు వచ్చింది.
లక్ష్మీ నారాయణ శర్మ (శోభినవ్ సత్య) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి మరో వివాహం చేసుకోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోతాడు. తన వయసు పిల్లలతో ఆడుకోకుండా ధ్యానంలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆయనకి గల ఆసక్తి, ఆ ఊరును .. ఆ ఇంటిని వదిలి వెళ్లేలా చేస్తుంది. తన ఇష్టదైవమైన శ్రీరాముడిని దర్శించాలంటే ముందుగా హనుమను ఆరాధించాలనే మాట ఆయనలో నాటుకుపోతుంది. అప్పటి నుంచి ఆయన హనుమను ఆరాధిస్తూ ఉంటాడు.
అనేక క్షేత్రాలలో పర్యటిస్తూ .. ఆధ్యాత్మిక పరంగా ఎంతోమందిని ప్రభావితం చేస్తూ లక్ష్మీనారాయణ శర్మ ముందుకు వెళుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచే పశువులు .. పక్షుల భాషలు అర్థం చేసుకుంటూ ఆయన మహిమలు చేస్తూ వెళ్లిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పక్షులు పట్టే ఒక వేటగాడు ముందుగా ఆయనలోని దైవత్వాన్ని గుర్తిస్తాడు. అప్పటి నుంచి ప్రధానమైన శిష్యుడిగా .. అనుచరుడిగా అతను పక్కనే ఉంటూ ఉంటాడు. గుహలో అనేక సర్పాల మధ్య ధ్యానం చేసుకుంటున్న బాబాను అతను చూడటం వల్లనే తొలిసారిగా బాబాను గురించి ఎక్కువమందికి తెలుస్తుంది.
ఒకసారి ఆంగ్లేయులు ప్రయాణిస్తున్న ట్రైన్ లో .. ఫస్టు క్లాస్ బోగీలోకి బాబా ఎక్కుతాడు. అందులోని అధికారులు బాబాను దింపేయమని టీసీని ఒత్తిడి చేస్తారు. దాంతో అతను ట్రైన్ చైన్ లాగేసి మరీ బాబాను దింపేస్తాడు. అంతే ఇక అక్కడి నుంచి ట్రైన్ కదలదు. ఎంతమంది ఇంజనీర్లు వచ్చినా .. మరో ఇంజన్ ను తెప్పించినా ట్రైన్ మాత్రం కదలదు. క్షమించమని ఆ బ్రిటీష్ అధికారి కోరిన తరువాతనే ట్రైన్ కదులుతుంది. ఈ సంఘటన జరిగింది 'నీమ్ కరోలి' విలేజ్ దగ్గర కావడంతో, ఆ మహిమను గుర్తు చేసుకుంటూ ఆయనను 'నీమ్ కరోలీ బాబా'గా పిలవడం మొదలైంది. ఇలా ఆయన ప్రయాణంలో కనిపించే మహిమలతో ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
భారతదేశ ఆధ్యాత్మిక వైభవంలో ఎంతోమంది సిద్ధపురుషులు .. యోగులు .. అవధూతలు .. సద్గురువులు ప్రధానమైన పాత్రను పోషించారు. అలాంటి ఆధ్యాత్మిక గురువుల గురించిన సినిమాలు కొన్ని తెరకెక్కాయి. అలా రూపొందిన సినిమానే 'హనుమాన్ అంశ్'. బాబా బాల్యం .. ఆయన కొనసాగించిన ఆధ్యాత్మిక ప్రయాణం .. ఆయన మహిమలు బహిర్గతం కావడం వరకూ ఫస్టాఫ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాబా వైవాహిక జీవితం .. ఆయన చేసిన మరికొన్ని మహిమలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
సాధారణంగా ఈ తరహా కథలను తెరకెక్కించేటప్పుడు, మహిమలకు సంబంధించిన సన్నివేశాలను గ్రాఫిక్స్ .. సౌండ్ ఎఫెక్ట్స్ తో నెక్ట్స్ లెవెల్ కి తీసుకుని వెళుతుంటారు .. పూనకాలు తెప్పిస్తుంటారు. కానీ దర్శకుడు అలాంటి విషయాల వైపు వెళ్లకుండా చాలా సహజంగా ఈ కథను నడిపిస్తూ వెళ్లాడు. బాబా మహిమలను ఒకదాని తరువాత ఒకటిగా చూపించినట్టుగా కాకుండా, కథలో భాగంగా అవి ఆవిష్కృతమయ్యేలా తీసుకున్న జాగ్రత్తలు ఆకట్టుకుంటాయి.
అయితే కాస్తంత అసంతృప్తిని కలిగించే అంశాలు కూడా లేకపోలేదు. చిన్న చిన్న మహిమలను ఎంత సహజంగా చూపించారో, మరింత విస్మయానికి గురిచేసేలా అనిపించే మహిమలను కూడా అంతే సింపుల్ గా తేల్చేశారేమో అనిపిస్తుంది. గుహలో .. సర్పాల మధ్యలో బాబా ధ్యానం చేసుకునే సీన్ .. ట్రైన్ ను కదలకుండా చేసే సీన్ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఇవేమీ అసంతృప్తిని కలిగించవు. సహజత్వానికి దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడనుకుంటే సరిపెట్టేసుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడా సన్నివేశాలను సాగదీసినట్టు మాత్రం అనిపిస్తుంది.
లక్ష్మీనారాయణ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది. ఏయే ప్రాంతాల మీదుగా ఆయన ప్రయాణం సాగింది .. ఆయన మజిలీ చేసిన ప్రదేశాలు .. అక్కడ చూపిన మహిమలను దర్శకుడు పూర్తి అవగాహనతో .. చాలా స్పష్టంగా ఆవిష్కరిస్తూ వచ్చాడు. ఆయన 'నీమ్ కరోలీ బాబా'గా మారిన వైనాన్ని ఆవిష్కరించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. బాబా చూపిన మహిమలు ఇంకా అనేక ఉన్నాయి.అవన్నీ కూడా సెకండ్ పార్ట్ లో వస్తాయనే అనుకోవలసి ఉంటుంది.
చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించినప్పటికీ క్వాలిటీ విషయంలో .. ఆ కాలం నాటి వాతావరణాన్ని ఆవిష్కరించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారనే అనాలి. విశాల్ ఫొటోగ్రఫీ .. సాధు సుశీల్ తివారి నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. శంఖ్ రాజాధ్యక్ష ఎడిటింగ్ ఫరవాలేదు. శోభినవ్ సత్య తో పాటు మిగతా పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు.
శ్రీరాముడు .. హనుమంతుడు .. ప్రస్తావనలతో నీమ్ కరోలి బాబాకి సంబంధించిన ఈ సినిమా నడుస్తుంది. 'నీమ్ కరోలి బాబా' గురించి తెలిసినవారికీ .. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతుందని చెప్పచ్చు.
'హనుమాన్ అంశ్' - మూవీ రివ్యూ!
Hanuman Ansh Review
Movie Details
Movie Name: Hanuman Ansh
Genre: Biography
Release Date: 2026-10-09
Cast: Shobhinaw Satyaa, Chandan Anand, Purnima Tiwari, Vihaan Shedge, Anil Rastogi
Director: Vishal Chaturvedi
PRO: -
Music: Sadhu Sushil Tiwari
Banner: Swambhu Media Network
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.