తమిళంలో కామెడీ డ్రామా జోనర్ నుంచి ఒక సినిమా ఓటీటీకి వచ్చింది.  రిషికాంత్ - అనిష్మా అనిల్ కుమార్  ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా పేరే 'మొద రాత్రి'. మైత్రీ మూవీ మేకర్స్ వారు తమిళంలో నిర్మించిన సినిమా ఇది. ఆగస్టు 21వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. 

మారుతి ( రిషికాంత్) దుబాయ్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. అతనికి తన ఊరుకు రావడంగానీ .. పెళ్లి చేసుకోవడం గాని ఎంతమాత్రం ఇష్టం ఉండదు. దుబాయ్ నుంచి అతను పంపిస్తున్న డబ్బులతో ఇక్కడి కుటుంబ సభ్యుల అవసరాలు తీరుతుంటాయి. అతనికి ఒక చెల్లి .. బావ ఉంటారు. మారుతి కుటుంబ సభ్యులంతా కలిసి అతనికి ఒక సంబంధం చూస్తారు. బుజ్జి లక్ష్మి ( అనిష్మా)తో పెళ్లి ఖాయం చేస్తారు. మారుతికి ఒక్క మాటకూడా చెప్పకుండా పెళ్లిరోజు నాటికి అతను దుబాయ్ నుంచి వచ్చేలా చేస్తారు. 

బుజ్జి లక్ష్మి తండ్రిలేని పిల్ల. ఆమె ఒక యువకుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసే తల్లి ఆమెకి మారుతి సంబంధం చూస్తుంది. పెళ్లి సమయానికి తాను ప్రేమించిన యువకుడితో లేచిపోవడానికి బుజ్జి లక్ష్మి ప్లాన్ చేస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన మారుతికి తన పెళ్లి విషయం అప్పుడే తెలుస్తుంది. తల్లి మాట కాదనలేక ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి తరువాత శోభనానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకు అవసరమైన మంచాన్ని ప్రత్యేకంగా చేయించి తెప్పిస్తూ ఉంటారు. 

ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. బుజ్జి లక్ష్మిని ప్రేమించిన యువకుడు సమయానికి ఆ ఊరు చేరుకోలేకపోతాడు. దాంతో మారుతితో ఆమె పెళ్లి జరిగిపోతుంది. ఫస్టు నైట్ కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అయినా తాను ప్రేమించిన యువకుడు రాగానే, అతనితో కలిసి అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచనలో బుజ్జి లక్ష్మి ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఆమె మారుతికి దొరికిపోతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ సంఘటనతో ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? తాను ఇష్టపడిన యువకుడితో ఆమె ప్రయాణం సాగుతుందా? పెళ్లంటే మారుతికి ఎందుకు ఇష్టం లేదు? అనేది మిగతా కథ.

పెళ్లి అంటే ఇష్టం లేని మారుతి తల్లిమాట కాదనలేక పెళ్లి పీటలపైకి వస్తాడు. తాను ప్రేమించిన యువకుడికి దూరం చేసి, మారుతితో తల్లి చేస్తున్న పెళ్లికి అయిష్టంగా తల వంచుతుంది బుజ్జి లక్ష్మి. ఇద్దరికీ ఇది ఎంతమాత్రం ఇష్టం లేని పెళ్లి. అయినా పెద్దల మాట కాదనలేక .. వాళ్ల సంతోషం కోసం ఈ పెళ్లికి అంగీకరిస్తారు. అలాంటి ఈ జంటకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనే అంశం చుట్టూ ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. 
    
ఇష్టం లేని పెళ్లికి జరుగుతున్న ఏర్పాట్లు .. దగ్గర పడుతున్న ముహూర్తం సమయం .. లవర్ తో లేచిపోవాలనుకున్న బుజ్జి లక్ష్మీ .. అక్కడికి చేరుకోలేకపోతున్న లవర్ .. తప్పనిసరి పరిస్థితులలో తాళి కట్టించుకున్న బుజ్జి లక్ష్మికి సంబంధించిన సన్నివేశాలు ఫస్టాఫ్ లో ఆడియన్స్ ముందుకు వస్తాయి. తనని పెళ్లి చేసుకోవడం బుజ్జి లక్ష్మికి ఇష్టం లేదని మారుతికి, అతనికి తెలియకుండానే పెళ్లి ఏర్పాట్లు జరిగాయని బుజ్జి లక్ష్మికి తెలియడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ పుంజుకుంటుంది.

పెళ్లి పీటలపై నుంచి పెళ్లి కూతురు తన లవర్ తో పారిపోవడం వంటి కథలతో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అలా పారిపోవడానికి ముందుగా వేసుకున్న ప్లాన్ ఫెయిల్ కావడంతో పెళ్లి జరిగిపోవడం .. ఆ తరువాత ఫస్టు నైట్ రోజున పారిపోవడానికి ప్రయత్నించి భర్తకి దొరికిపోయినప్పుడు ఎలా ఉంటుంది? అనేది ఈ కథలోని కొత్త పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తీసుకోనుందా అనే ఒక ఆసక్తి ఆడియన్స్ లో పెరుగుతుంది. 

పెళ్లికి వచ్చిన బంధువులు అంతా బాగుంటే అక్షతలు వేసి వెళతారు. ఏ మాత్రం తేడా కొట్టినా గుసగుసలతో మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇక కొంతమంది మగాళ్లు తాగేసి నానా గందరగోళాన్ని సృష్టిస్తారు. ఈ తరహా సన్నివేశాలను దర్శకుడు సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించాడు. ఈ తరహా కంటెంట్ కి కామెడీ ప్రధానమైన బలమై నిలుస్తుంది. ఆ స్థాయి కామెడీని మాత్రం ఈ కథలో కలపలేకపోయారు.

ఇక ఈ కథలో పాత్రలు చాలా ఎక్కువైపోయాయి. అందువలన కొన్ని పాత్రలకి సంబంధించిన వరసలు, ఒక్కసారి చూడటం వలన రిజిస్టర్ కావు. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిగానీ, అది అంతగా ప్రభావితం చేయలేదు. ఇక ఫస్టు నైట్ కి సంబంధించిన కొత్త మంచం చుట్టూ కూడా కామెడీని వర్కౌ చేయడానికి ప్రయత్నించినట్టుగా కనిపించదు. లవ్ .. ఎమోషన్ .. కామెడీలో ఆశించిన స్థాయి గాఢత కనిపించదు.

అంతగా అవసరం లేని ఒకటి రెండు సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. దర్శకుడికి ఇది ఫస్టు మూవీ కావడం కూడా అందుకు ఒక కారణమై ఉండొచ్చు. ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. సురేంద్రన్ ఫొటోగ్రఫీ .. భరత్ శంకర్ నేపథ్య సంగీతం .. అశోక్ అర్జునన్ ఎడిటింగ్ ఫరవాలేదు.

యువత ప్రేమకి .. ఆకర్షణకి మధ్య గల తేడాను అర్థం చేసుకోవాలి. ప్రేమించిన యువకుడితో వెళ్లిపోవడం కాదు, తనని పోషించే సమర్ధత .. బాధ్యత అతనికి ఉన్నాయా లేదా అనేది అమ్మాయిలు ఆలోచన చేయాలి. అమ్మాయిలు ప్రేమించినవారితో కాదు .. ప్రేమ పట్ల నమ్మకం .. ప్రేమపై సరైన అభిప్రాయం ఉన్నవారితో కలిసి అడుగుముందుకు వేయాలి అనే ఒక సందేశం ఈ సినిమాలో కనిపిస్తుంది.టైటిల్ 'మొద రాత్రి' అయినప్పటికీ, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.