సంగీతం నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో తెలుగు సిరీస్ లు వచ్చింది చాలా తక్కువనే చెప్పాలి. అలా వచ్చిన సిరీస్ గా 'జగమే సంగీతం' కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఆడియన్స్ ను ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం.
'రాజమండ్రి'లో శంకరశాస్త్రి (ప్రకాశ్ రాజ్)కి సంగీత విద్వాంసుడిగా మంచి పేరు ఉంటుంది. కొడుకు సుధాకర్ (షిజూ మీనన్) కోడలు సరస్వతి (మధుబాల) మనవడు బాలమురళి (అక్షయ్ లగుసాని) ఇదే ఆయన ఫ్యామిలీ. శాస్త్రి వారసుడిగా పేరు తెచ్చుకోవాలని బాలమురళికి ఉంటుంది. అయితే అది అంత తేలిక కాదనే విషయం అతనికి తెలుసు. శాస్త్రి సంగీతం ఆ ఊరుకు మాత్రమే పరిమితమవుతుంది. సినిమాలలో పాటలు పాడటం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఇక క్రమశిక్షణ పేరుతో ఆయన తిప్పిపంపించే విద్యార్థుల సంఖ్య ఎక్కువే.
ఈ కారణాల వలన శాస్త్రి పెద్దగా సంపాదించింది ఏమీ ఉండదు. ఆయన కొడుకు సుధాకర్, మ్యూజిక్ స్కూల్ పెట్టడం కోసం బ్యాంక్ నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకుంటాడు. ఆ పని పూర్తికాకపోగా .. అప్పు మాత్రం అలాగే ఉండిపోతుంది. బ్యాంకు వాళ్లు సుధాకర్ పై ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పాప్ సింగర్ పల్లవి (సుస్మిత శెట్టి)తో బాలమురళికి పరిచయమవుతుంది. ఇద్దరూ కలిసి ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ప్రేమలో పడతారు.
విదేశాల నుంచి తిరిగొచ్చిన ఒక బిజినెస్ మెన్, తన కూతురు 'సంధ్య'ను కోడలిగా చేసుకోమని శంకరశాస్త్రి ఫ్యామిలీని ఆశ్రయిస్తాడు. శ్రీమంతుల ఫ్యామిలీ కోరి ముందుకు రావడంతో, సుధాకర్ వాళ్లు అందుకు అంగీకరిస్తారు. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని చెప్పడానికి బాలమురళి ప్రయత్నించేలోపు, ఈ విషయం 'పల్లవి'కి తెలిసిపోతుంది. 'సంగీత భారతి' పోటీలు దగ్గర పడుతున్న సమయంలో, శాస్త్రి ముందుకు 'త్యాగరాజు' (శ్రీకాంత్) వస్తాడు. ఈ సారి పోటీలో తాను నిలబడాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెబుతాడు.
త్యాగరాజు ఎవరు? ఆయనతో శాస్త్రికి గల సంబంధం ఏమిటి? బాలమురళి విషయంలో పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వాళ్ల ప్రేమ పెళ్లి వరకూ వెళుతుందా? 'సంగీత భారతి' బిరుదు ఎవరిని వరిస్తుంది? అనేది మిగతా కథ.
సంగీతాన్ని దైవ ప్రసాదంగా భావించిన ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబం .. ఆ సంగీతంతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడటం .. మారుతున్న కాలానికీ, మారని అభిప్రాయాలకు మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ నడిచే కథ ఇది. 'సంగీతం వారసత్వం కాదు .. వరం' అనే ఒక డైలాగ్ ఈ సిరీస్ లో తగులుతుంది. ఆ లైన్ ను ఆవిష్కరిస్తూనే ఈ కథ నడుస్తుంది.
సంగీత ప్రధానమైన ఒక కుటుంబం చుట్టూ అల్లుకున్న ఈ కథలో, దర్శకుడు ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇచ్చుకుంటూ వెళ్లాడు. బాలమురళి ప్రేమ సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో,పెళ్లి పేరుతో సంధ్య అనే యువతి అతనికి టచ్ లోకి వస్తుంది. అందులో నుంచి బయపడటానికి అతను ప్రయత్నిస్తూ ఉండగా, శాస్త్రిగారి సంగీతానికి తాను వారసుడిని అంటూ త్యాగరాజు వస్తాడు. ఆ త్యాగరాజు ఫ్లాష్ బ్యాక్ లో బాలమురళి తల్లి సరస్వతి పాత్ర కూడా ఉంటుంది.
ఇలా ఒక వైపున పాప్ సాంగ్స్ కీ .. మరో వైపున సంప్రదాయ సంగీతానికి మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలువుతూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. అయితే ఏ ట్విస్ట్ కూడా 'అవునా' అనే ఎక్స్ ప్రెషన్ ను ఆడియన్స్ ఫేస్ లపై ప్రత్యక్షం అయ్యేలా చేయలేకపోయింది. ముఖ్యంగా బాలమురళికి .. సంధ్యకి సంబంధించిన పెళ్లి తాలూకు ఎపిసోడ్ చాలా కృతకంగా సాగింది. ప్రతి చోటా ఒక మలుపు .. ఒక మెలిక ఉండటానికి దర్శకుడు ప్రయత్నించడం కనిపిస్తుంది.
కథలో బలమైన సన్నివేశాలు .. బరువైన ఎమోషన్స్ లేకపోవడం తెలుస్తూనే ఉంటుంది. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ పాత్రలు కాస్త ఫరవాలేదు. కానీ సుమన్ .. షిజూ మీనన్ వంటి ఆర్టిస్టులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని అనిపిస్తుంది. మధుబాల పాత్ర కూడా అందుకు మినహాయింపేమీ కాదు.
ఇది సంగీత ప్రాధాన్యత కలిగిన కథ. కచేరీ సీన్స్ ను ఆవిష్కరించడం అంత తేలికైన విషయమేం కాదు. అయినా ఎవరికి వారు తమవంతు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సీన్స్ కృతకంగా అనిపిస్తాయి. శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన వాయిస్ ఇటు ప్రకాశ్ రాజ్ కీ గానీ, అటు శ్రీకాంత్ కి గాని సెట్ కాలేదు. సాధారణంగా ఇలా సంగీత ప్రధానమైన కథలకు కామెడీ జోడిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే పనిచేశారు. కాకపోతే సరైన సీన్స్ రాసుకోకపోవడం వలన కామెడీ చాలా చప్పగా అనిపిస్తుంది.
రాజ్ తోట ఫొటోగ్రఫీ .. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. విప్లవ్ నైషధం ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ .. సుమన్ .. మధుబాల వంటి సీనియర్ స్టార్స్ ఈ సిరీస్ కి ఉన్నారు. అయితే వాళ్లకి తగిన పాత్రలను డిజైన్ చేయలేకపోయారనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కాకపోతే తేలికపాటి సన్నివేశాలతో .. తేలిపోయే ఎమోషన్స్ తో అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రయత్నం మంచిదే .. కాకపోతే మరింత కసరత్తు జరిగితే బాగుండేదేమో అనిపిస్తుంది.
'జగమే సంగీతం'(అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
Jagame Sangeetham Review
Movie Details
Movie Name: Jagame Sangeetham
Genre: Drama, Family
Release Date: 2026-09-04
Cast: Prakashraj, Srikanth, Suman, Siju Menon, Akshay Lagusani,Susmitha Shety
Director: Palnati Surya Prathap
PRO: -
Music: Vishal Chandrashekhar
Banner: Gold Box Entertainments
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer