విష్ణు విశాల్ - ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించిన 'గట్టా కుస్తీ' 2022లో థియేటర్లకు వచ్చింది. తమిళంలో రూపొందిన ఈ సినిమా, 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చెల్లా అయ్యవు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ గా 'గట్టా కుస్తీ 2' నిర్మితమైంది. తమిళంలో జులై 3వ తేదీన విడుదలైన ఈ సినిమా, 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో జులై 31 నుంచి అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

వీర (విష్ణు విశాల్) తన భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ)ని రెజ్లింగ్ ఛాంపియన్ ను చేస్తానంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. ఒక వైపున జాబ్ చేస్తూనే మరో వైపున ఆమె కుస్తీ పోటీలలో చురుకుగా పాల్గొంటూ విజయాలను అందుకుంటూ ఉంటుంది. వీర తమ కూతురు 'మది' (జరా)ను జాగ్రత్తగా చూసుకుంటూ, ఇంటి వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటాడు. అపార్టుమెంటులోని లేడీస్ తో కలుపుగోలుగా మాట్లాడుతూ, వాళ్ల భర్తలకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాడు.  

'వీర' చేసిన గారం కారణంగా 'మది' చదువులో వెనకబడుతుంది. అంతే కాకుండా తన క్లాస్ పిల్లలతో గొడవపడుతూ ఉంటుంది. ఈ విషయంలో ప్రిన్సిపల్ చీవాట్లు పెడుతున్న విషయం కీర్తికి తెలియకుండా అతను జాగ్రత్తపడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో కీర్తి మంత్రిగారి చేతుల మీదుగా అవార్డును అందుకుంటుంది. తన ఎదుగుదలకు కారణం తన భర్త అంటూ ఆ సందర్భంలో ఆమె మాట్లాడుతుంది. కీర్తి కోచ్ (తారక్ పొన్నప్ప)కి అది ఎంతమాత్రం నచ్చదు. దాంతో కీర్తిని దెబ్బతీయాలని అతను నిర్ణయించుకుంటాడు.

'మది'ని కూడా రెజ్లర్ ను చేయాలనే కీర్తి ఆలోచనకు 'వీర' అడ్డు చెబుతాడు. దాంతో వాళ్లిద్దరి మధ్య మాటామాట పెరుగుతుంది. కీర్తి కోపాన్ని నియంత్రిచడం అవసరమనీ, ఆమెకి తెలియకుండా ఆమెతో వాడించమని 'వీర'కి ఒక మెడిసిన్ ను ఇప్పిస్తాడు కోచ్. అతను చెప్పినట్టే 'వీర' చేయడం వలన, ఆ తరువాత జరిగిన గేమ్ లో కీర్తి ఓడిపోతుంది. అంతేకాదు ఆమె మాదక ద్రవ్యాలు వాడినట్టుగా రిపోర్టు వస్తుంది. జరిగిన దానికి తన భర్తనే కారణమని భావించిన కీర్తి ఏం చేస్తుంది? ఆమె నిర్ణయం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? కోచ్ కుట్ర బయటపడుతుందా? అనేది కథ.

భార్యాభర్తలకు ఒకరిపట్ల ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి ప్రేమ పిల్లలపైకి వెళుతుంది. వాళ్ల భవిష్యత్తును గురించే ఇద్దరూ ఆలోచన చేయడం మొదలుపెడతారు. అయితే అందుకు అవసరమైన మార్గాన్ని ఎంచుకునే విషయంలో  గొడవపడితే ఎలా ఉంటుంది? ప్రేమతో చేసిన పని ద్వేషానికి కారణమైతే ఏం జరుగుతుంది? అలాంటి భార్యాభర్తల వలన పిల్లలు మానసికంగా ఎంత సంఘర్షణను అనుభవిస్తారనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

భార్యాభర్తలు తమ జీవన ప్రయాణంలో ఒకరి కోసం ఒకరు ఎన్నో తాగ్యాలు చేయవలసి ఉంటుంది. అయితే ఒక్కోసారి అతి ప్రేమ కూడా మనస్పర్థలకు కారణమవుతుంది. అతి ప్రేమ అపార్థాలకు కూడా దారితీస్తుంది. ఈ పాయింట్ ను టచ్ చేస్తూనే ఈ కథ ముందుకు వెళుతుంది. నిజమైన ప్రేమ ముందు ఎలాంటి సమస్యలైనా మబ్బు తెరల మాదిరిగా తొలగిపోతాయనే విషయాన్ని నిరూపిస్తుంది. విడాకుల  కోసం భార్యాభర్తల మధ్య కుస్తీపోటీని ఏర్పాటు చేయడం కొత్తగా .. వినోదభరితంగా అనిపిస్తుంది. 

అనుమానాలు .. అపార్థాలు .. కీచులాటలు .. ఇరువైపులా గల కుటుంబ పెద్దల స్వభావాలను దర్శకుడు చాలా సహజంగా మలుస్తూ వెళ్లాడు. ఎవరు ఎన్ని అనుకున్నా భార్య లక్ష్యం నెరవేరడం కోసం అవమానాలు భరిస్తూ వెళ్లే భర్త పాత్ర .. ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. కుస్తీ అనేది కేవలం పేరు కోసమో .. మెడల్స్ కోసమో కాదు, ఆడపిల్లల ఆత్మరక్షణకు అవసరమనే ఒక సందేశం కూడా ఈ కథలో మనకి కనిపిస్తుంది. 

విష్ణు విశాల్ నటన .. ఐశ్వర్య లక్ష్మీ అభినయం ఆకట్టుకుంటాయి. ఈ ఇద్దరి కూతురుగా నటించిన బేబీ జరా జయనా మంచి మార్కులు కొట్టేస్తుంది. విశాలమైన కళ్లతో ఆ పాప పలికించిన హావభావాలు అలా గుర్తుండిపోతాయి. ఆ పాపకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పచ్చు. భాస్కరన్ ఫొటోగ్రఫీ .. సీన్ రోల్డన్ నేపథ్య సంగీతం .. భరత్ విక్రమన్ ఎడిటింగ్ కథను సపోర్టు చేస్తూ సాగుతాయి.

లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తుందని చెప్పచ్చు.