కన్నడలో విజయ్ రాఘవేంద్రకి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్'. గతంలో వచ్చిన 'సీతారామ్ బెనోయ్ కేసు నెంబర్ 18' సినిమాకి ఇది సీక్వెల్. దేవీప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఆ తరువాత 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అయితే కన్నడతో పాటు తమిళ .. హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. జులై 31వ తేదీ నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
అది కర్ణాటక ప్రాంతంలోని ఒక విలేజ్. అక్కడి పోలీస్ స్టేషన్ లో సీతారామ్ (విజయ్ రాఘవేంద్ర) పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. ఆ ప్రాంతంలో దారుణంగా హత్యలు జరుగుతుంటాయి. కాళ్లు - చేతులు ఇనుప ముళ్లతీగలతో కట్టేసి, కిరాతకంగా హత్య చేస్తుంటాడు. హంతకుడు ఒక సైకో కిల్లర్ అనే నిర్ధారణకు సీతారామ్ వస్తాడు. అదే సమయంలో తన కూతురును ఒక యువకుడు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేయడానికి స్కూల్ మాస్టర్ 'సెబాస్టియన్' పోలీస్ స్టేషన్ కి వస్తాడు.
ఆ ప్రాంతంలో టిప్పర్ కుర్రాళ్లు అల్లర్లు సృష్టిస్తూ ఉంటారని తెలుసుకున్న సీతారామ్ ఆ వైపు దృష్టి పెడతాడు. అలాగే వరుస హత్యలకు కారకులు ఎవరా అనే దిశగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. మరో వైపున సెబాస్టియన్ ఫిర్యాదు పై కూడా ఫోకస్ చేస్తాడు. అలాంటి పరిస్థితులలోనే సీతారామ్ 'గన్' మాయమవుతుంది. ఎవరు తీసి ఉంటారా అనే ఒక ఆలోచనలో అతను పడతాడు. తన గన్ తో ఎవరు ఏం చేయనున్నారా అనే ఒక ఆందోళన అతనిని వెంటాడుతూ ఉంటుంది.
సెబాస్టియన్ కూతురు మూడు నెలల క్రితమే చనిపోయిందనీ, ఏ యువకుడిపైనైతే అతను ఫిర్యాదు చేశాడో, అతను మూడు నెలలుగా కనిపించడం లేదని సీతారామ్ తెలుసుకుంటాడు. హత్యకి గురికావడానికి ముందు, ఆ కుటుంబ సభ్యులకు ఒక 'వీణ' బొమ్మ దొరకడం అతణ్ణి ఆశ్చర్యపరుస్తుంది. అలాగే చనిపోయిన వాళ్లంతా టీనేజ్ అమ్మాయిల తండ్రులు కావడం అయోమయానికి గురిచేస్తుంది.
హంతకుడు ఆడపిల్లల తండ్రులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అతని ఉద్దేశం ఏమిటి? ఎలా ఏ హత్యలను కట్టడి చేయాలి? అనే విషయం గురించి సీతారామ్ ఆలోచన చేస్తుండగానే, తన అక్కయ్య కూతురుకు 'వీణ బొమ్మ' దొరుకుతుంది. అప్పుడు సీతారామ్ ఏం చేస్తాడు? ఆడపిల్లల తండ్రుల హత్యలకు .. వీణ బొమ్మలకు గల సంబంధం ఏమిటి? హత్యలకు కారణం ఏమిటి? కారకులు ఎవరు? అనేది మిగతా కథ.
హత్యలు .. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన కథలు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. హంతకుడు ఎవరనేది ఆడియన్స్ కి చూపించేసి, అతనిని పోలీస్ లు ఎలా పట్టుకుంటారనే ఆసక్తిని రేకెత్తించడం ఒక రకం. ఇక హంతకుడు ఎవరనేది తెరపై ఉన్న పోలీస్ ఆఫీసర్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా తెలియదు. ఆడియన్స్ ఈ కూడా పోలీస్ ఆఫీసర్ తో పాటు తెలుసుకోవడం కోసం, అతనితో పాటు పరుగులు పెడుతుంటారు. సినిమాలోని కంటెంట్ ఈ రెండో కోవకి చెందినదిగా చెప్పుకోవాలి.
సాధారణంగా ఈ తరహా కథలలో హంతకుడు ఎవరనే అనుమానం ఆయా పాత్రలపైకి వెళ్లేలా ప్రేక్షకులను డైవర్ట్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. అదే ప్రయత్నం ఈ కథలోను కనిపిస్తుంది. ప్రేమజంటకు సంబంధించిన ఒక పిట్టకథతో, సంగీతం - వీణ బొమ్మ నేపథ్యంతో కథకు కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. కొసరంత ప్రేమకథనే అయినా కొంతవరకూ బాగానే ఉందిగానీ, సంగీతం నేపథ్యంతో కూడిన ట్రాక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది .. అనవసరంగా లాగదీశారని అనిపిస్తుంది.
ఇక సస్పెన్స్ థ్రిల్లర్ కథలు ఆడియన్స్ గెస్ కి అందకుండా పరిగెత్తవలసి ఉంటుంది. ఈ కథ కూడా అలాగే ఆడియన్స్ ఊహాగానాలకు అందకుండా మలుపులు తీసుకుంటుంది. ఆడియన్స్ ఎంత మాత్రమే గెస్ చేయని విషయాన్నే రివీల్ చేస్తుంది. అయితే హంతకుడిని పట్టించే ఆధారం .. అందుకు సంబంధించిన సీన్ థ్రిల్లింగ్ గా ఏమీ అనిపించదు. ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చాయని అనిపించడమే అందుకు కారణం. హంతకుడిని సైకోగా మార్చిన సంఘటన కూడా కొత్తగాగానీ .. బలంగా గాని అనిపించదు.
పోలీస్ ఆఫీసర్ గా విజయ్ రాఘవేంద్ర నటన ఆకట్టుకుంటుంది. హేమంత్ ఆచార్య ఫొటోగ్రఫీ .. నవనీత్ శ్యామ్ నేపథ్య సంగీతం .. శశాంక్ నారాయణ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. రొటీన్ గా అనిపించే కథ .. ఉత్కంఠభరితంగా సాగని కథనం .. సంగీతం నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలలో సాగతీత కంటెంట్ ను కాస్త బలహీనపరుస్తాయి.
'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్' ( అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!
Second Case of Seetharam Review
Movie Details
Movie Name: Second Case of Seetharam
Release Date: 2026-07-31
Cast: Vijay Raghavendra,Gopalkrishna Deshpande, Usha Bhandary, Sagar Puranik,
Director: Devi Prasad Shetty
Music: Navaneeth Sham
Banner: Flying Elephant Story Tellers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer