'సేవ్ ద టైగర్' సిరీస్ నుంచి గతంలో రెండు భాగాలు వచ్చాయి. ప్రియదర్శి .. కృష్ణ చైతన్య .. అభినవ్ గౌతమ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ నుంచి మూడో భాగాన్ని వదిలారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఫాంటసీ టచ్ ఇచ్చిన మూడో సీజన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
గంటా రవి ( ప్రియదర్శి) తన భార్య హైమా (సుజాత) పోరు పడలేక గేటెడ్ కమ్యూనిటీకి మారిపోతాడు.అయితే అక్కడి వాతావరణంలో ఇమడలేక నానా ఇబ్బందులు పడుతూనే రాజకీయాలలో ఎదుగుతూ ఎమ్మెల్యే అవుతాడు. ఇక రాహుల్ (అభినవ్ గౌతమ్) రైటర్ గా బిజీ అవుతాడు. అవార్డులతో పాటు విమర్శలు వచ్చి పడుతుంటాయి. విక్రమ్ ( చైతన్య కృష్ణ) హారిక అనే అమ్మాయితో చనువుగా ఉండటం చూసిన అతని భార్య రేఖ విడాకుల నోటీసు పంపిస్తుంది. ఒక వైపున కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పటికీ, విక్రమ్ తన పద్దతి మాత్రం మార్చుకోడు.
గంటా రవి తన పదవిని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతూ ఉంటాడు. రాహుల్ కొత్త కథల కోసం ప్రయత్నించకుండా వేరొకరి కథలను కాపీ చేస్తుంటాడు. భార్యకి దూరమైన విక్రమ్ వేరే అమ్మాయిలను వేధించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిపై పోలీస్ లకు ఫిర్యాదులు అందుతాయి. పోలీస్ కేసు ముగ్గురినీ భయపెడుతుంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అనే విషయంపై ఒక క్లబ్ లో సమావేశమవుతారు.
తమ పట్ల భార్యలు ప్రవర్తిస్తున్న తీరును గురించి ప్రస్తావిస్తారు. తమని ఈ స్థితికి తీసికొచ్చింది 'పెళ్లి' అనే రెండు అక్షరాలేనని భావిస్తారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని చెప్పినదెవరంటూ దేవతలను తిట్టడం మొదలు పెడతారు. తమని శాపనార్థాలు పెట్టే ఆ దృశ్యాన్ని ఇంద్రుడు నేరుగా చూస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? పర్యవసానంగా ఈ ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
గంట రవి .. రాహుల్ .. విక్రమ్ అనే ముగ్గురు స్నేహితులచుట్టూ తిరిగే కథ ఇది. ఈ ముగ్గురి కుటుంబాలు .. భార్యాభర్తల సంబంధాలు .. బంధాలు .. అలకలు .. ఆవేశాల చుట్టూ ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. మద్యానికి అలవాటు పడటం వలన ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అందుకు సంబంధించిన సన్నివేశాలతో మొదటి రెండు భాగాలు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి.
ఇక ఈ సారి ఈ ముగ్గురు మిత్రులు పెళ్లి అనే కాన్సెప్ట్ తో తమని ఒక ఆట ఆడిస్తున్న దేవుడిని నిందిస్తారు. ఇక్కడి నుంచి ఈ కథ ఫాంటసీని టచ్ చేస్తుంది. దేవేంద్రుడు .. చిత్రగుప్తుడు వంటి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. మనుషులను పోలిన మనుషులు అంటూ మరో అంశం కూడా ఇక్కడి నుంచి ఈ కథకి తోడవుతుంది. ఇక ఇక్కడి నుంచి కథ కొత్త మలుపు తీసుకుని ముందుకు వెళుతుంది. అయితే ఈ డ్రామా కాస్త కన్ఫ్యుజింగ్ గానే ఉంటుంది. కన్ఫ్యుజింగ్ డ్రామా అంటూ వాళ్లు ముందుగానే చెప్పేశారు కూడా.
ముగ్గురు స్నేహితులు దేవుళ్లను తిట్టడం .. చిత్రగుప్తుడు వంటి పాత్రలు దిగిరావడం వరకూ బాగానే ఉందిగానీ,మనుషులను పోలిన మనుషులు అంటూ అవే మూడు పాత్రలను ప్రవేశపెట్టడం అయోమయాన్ని కలిగిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ అర్థం చేసుకోవడానికీ .. అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందికి ఆ అయోమయం అలా ఉండిపోవచ్చు కూడా.
పెళ్లి అనేది ఒక బరువు కాదు .. బాధ్యత.పెళ్లి అనేది ఒక పంజరం కాదు .. అందమైన అనుబంధం. స్వేచ్ఛ పేరుతో బాధ్యతల నుంచి దూరంగా పారిపోవడం కరెక్టు కాదని చెప్పే ఒక సందేశం బాగుంది. అయితే ఆ విషయాన్ని చెప్పడానికి మనుషులను పోలిన మనుషులు అంటూ రెండేసి ప్రధానమైన పాత్రలను చూపించడం కాస్త గందరగోళంగానే అనిపిస్తుంది. లాజిక్ కి అందకుండా .. క్లారిటీ లోపించి కనిపిస్తుంది.
దేవేంద్రుడిగా వెన్నెల కిశోర్ కనిపించడం .. హుక్ స్టెప్ ప్రాక్టీస్ అంటూ సందడి చేయడం బాగుంది. 'గొడవపడితే మాట్లాడదేమోనని భయపడేవాడు ప్రేమికుడు. మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు మొగుడు' వంటి డైలాగ్స్ అక్కడక్కడా మెరుస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు తమవంతు సపోర్టును అందించాయి.
'సేవ్ ద టైగర్స్' సిరీస్ కామెడీ ప్రధానంగా రూపొందుతూ వస్తున్న సిరీస్ అనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సారి కూడా కామెడీ దిశగా కంటెంట్ ను పరిగెత్తించే ప్రయత్నమే చేశారు. కాకపోతే ఫాంటసీ టచ్ కారణంగా కాస్త క్లారిటీ లోపించినట్టుగా అనిపిస్తుంది.
'సేవ్ ద టైగర్స్ 3' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Save The Tigers 3 Review
Movie Details
Movie Name: Save The Tigers 3
Release Date: 2026-06-19
Cast: Priyadarshi,Abhinav Goutham, Chaitanya Krishna, Jordar Sujatha, Pavani Gangireddy, Deviyani Sharma
Director: Sriraam Eragam
Music: Ajay Arasada
Banner: Three Gutumn Leaves
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer