ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలీవుడ్ సినిమాలలో 'అనకొండ' ఒకటిగా కనిపిస్తుంది. అప్పటివరకూ అమెజాన్ ఫారెస్టులో ఉండే 'అనకొండ' అనే పాముల గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువనే చెప్పాలి. అందువలన అందరూ ఈ సినిమాను చూస్తూ థ్రిల్ ను ఫీలయ్యారు. దట్టమైన దండకారణ్యంలో అనకొండలు చేసే దాడులను తెరపై చూసిన ప్రేక్షకులు, చాలా కాలం పాటు మరిచిపోలేకపోయారు. ఆ తరువాత 'అనకొండ' నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా క్రితం ఏడాది డిసెంబర్ లో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా, 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

డగ్ (జాక్ బ్లాక్) వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటాడు. భార్య మాలీ .. కొడుకు ఛార్లీతో అతని లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలోనే చిన్ననాటి స్నేహితులైన గ్రిఫ్ (పాల్ రడ్) కెన్నీ (స్టీవ్ జాన్) క్లైర్ (తాండివే న్యూటన్) కలుస్తారు. మాటల  సందర్భంలో 'అనకొండ' సినిమాను గురించిన ప్రస్తావన వస్తుంది. అలాగే చిన్నతనంలోనే నటన .. డైరెక్షన్ పట్ల తాము చూపిన ఉత్సాహాన్ని వాళ్లు గుర్తుచేసుకుంటారు.

'అనకొండ' సినిమాను తాము రీ బూట్ చేస్తే బాగుంటుందని భావిస్తారు. అమెజాన్ ఫారెస్టుకి వెళ్లి షూటింగు చేసుకుని వద్దామని 'గ్రిఫ్'తన మనసులోని మాటను చెబుతాడు. అమెజాన్ ఫారెస్టు నేపథ్యంలో కథను తయారు చేసే బాధ్యతను ఒకరు .. నిర్మాణానికి అవసరమైన ఖర్చును భరించేది ఒకరు .. దర్శకత్వం చేసేది ఒకరు అంటూ, ఎవరెవరు ఏ పని చేయాలనే విషయంలో పూర్తి క్లారిటీకి వస్తారు. 

సినిమాకి అవసరమైన అనకొండ పాము కోసం, కార్లోస్ ను సంప్రదిస్తారు. అదే వృత్తిగా జీవిస్తున్న కార్లోస్ ఒక చిన్నపాటి అనకొండతో బయల్దేరడానికి తాను సిద్ధమని చెబుతాడు. మూడు వారాలలో షూటింగును పూర్తిచేసుకుని రావాలనే ఉద్దేశంతో అంతా కలిసి అమెజాన్ ఫారెస్టుకి బయల్దేరతారు. అయితే బోట్ నడిపే యువతిగా వారికి 'అనా' పరిచయమవుతుంది. వాళ్లతో కలిసి ఆమె కూడా ముందుకు సాగుతుంది.

అమెజాన్ ఫారెస్టు ప్రాంతంలో అక్కడ లభించే బంగారం విషయంలో రెండు గ్యాంగ్ ల మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక ముఠాకి చెందిన యువతియే 'అనా'. డగ్ బృందంతో కలిసి ముందుకు వెళుతున్న ఆమె కోసం శత్రువులు గాలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే షూటింగు కోసం తీసుకెళ్లిన 'అనకొండ' పాము ప్రమాదవశాత్తు చనిపోతుంది. దాంతో అడవిలోని అనకొండనే తీసుకొస్తానని కార్లోస్ వెళతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? నిజమైన అనకొండ కారణంగా వాళ్లకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కథ.               

మొదటి సారిగా వచ్చిన 'అనకొండ' ఆడియన్స్ ను ఒక రేంజ్ లో థ్రిల్ చేసింది. ఆ తరువాత అదే తరహా కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చినప్పటికీ, ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ఇది. చిత్రంలోని ప్రధానమైన తారాగణం అమెజాన్ అడవులకు వెళ్లడం .. అక్కడ అనకొండల కారణంగా వాళ్లకి ఎదురయ్యే అనుభవాలతో ఈ కథ నడుస్తుందనే విషయం ప్రేక్షకులకు ముందుగానే అర్థమైపోతుంది. 

అనకొండ సినిమా మొదలైన దగ్గర నుంచి, ఫారెస్టుకి ఈ బృందం ఎప్పుడు చేరుకుంటుందా అనే కుతూహలంతోనే ఆడియన్స్ వెయిట్ చేయడం మొదలుపెడతారు. అనకొండపై సినిమా తీయడానికి మిత్ర బృందం అమెజాన్ అడవులకి బయల్దేరడంతో అసలు కథ మొదలవుతుంది.ఇక ఆ అడవిలో బంగారం కోసం అన్వేషించే ముఠాలు, వారి మధ్య సాగే పోరాటం ఈ కథకి సమాంతరంగా నడుస్తూ ఉంటుంది.

అమెజాన్ అడవులకు షూటింగు కోసం తెచ్చిన చిన్నపాటి అనకొండ స్థానంలోకి, నిజమైన భారీ  అనకొండ వచ్చి చేరడంతో కథ కీలకమైన దశకి చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి ప్రేక్షకులు ఎదురుచూసే దిశగా ఈ కథ కదులుతుంది. కానీ వాళ్లు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయింది. ఏ స్థాయిలోను ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. అనకొండ వెంటాడే దృశ్యాలు కూడా అంతగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. 

అసలు కథను మొదలు పెట్టడానికే అరగంట సమయం తీసుకున్నారు. ఈ అరగంటలో జరిగే కథ కూడా అనవసరమైన సంభాషణలతో .. అర్థం లేని కామెడీతో నడుస్తుంది. అనకొండకంటే ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టేది ఈ కామెడీనే. ఇక అమెజాన్ అడవులకు చేరుకున్న తరువాతనైనా కథ కాస్త గాడిలో పడుతుందేమోనని అనుకుంటే, స్క్రిప్ట్ అనేది లేకుండా అక్కడికక్కడ .. అప్పటికప్పుడు అనుకుని షూట్ చేశారేమో అనిపించకమానదు.

కథ .. కథనం .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. గ్రాఫిక్స్ .. ఇలా వీటిని గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. తెరపై పాత్రలు చేసే హాడావిడీ తప్ప మరేమీ లేదు. కథ లేకపోవడం వల్లనే కాలక్షేపం చేస్తున్నారనే విషయం ప్రేక్షకులకు అర్థమైపోతూనే ఉంటుంది. ఏ మాత్రం కథపై దృష్టి పెట్టని కంటెంట్ గా ఈ సినిమా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఇకపై తెరపై అనకొండను చూస్తే కాదు, ఈ పేరు వింటేనే భయపడేలా చేశారని చెప్పాలి.