Prabhas: ప్రతీ ఏటా జపాన్‌కు వస్తా... అభిమానులకు ప్రభాస్ హామీ

Prabhas in Japan Baahubali The Epic Special Screening
  • బాహుబలి ఎపిక్ స్పెషల్ షో కోసం జపాన్‌కు వెళ్లిన ప్రభాస్
  • జపాన్ అభిమానుల ప్రేమకు ముగ్ధుడైన డార్లింగ్
  • మిమ్మల్ని కలవాలన్న నా కల నెరవేరిందన్న రెబ‌ల్ స్టార్‌
  • ఒకే సినిమాగా బాహుబలి రెండు పార్ట్‌లు.. ఈ నెల‌ 12న జపాన్‌లో విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్‌లో సందడి చేశారు. ఎస్‌ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ నెల‌ 12న ఈ సినిమా జ‌పాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆ దేశానికి వెళ్లిన ప్రభాస్, అక్కడి అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన వినయంతో, ఆప్యాయతతో అందరి మనసులు గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడారు. "మీ ప్రేమకు ధన్యవాదాలు. బాహుబలి తర్వాత రాజమౌళి, శోభు, లక్ష్మి అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు చాలా మంచి అభిమానులని, ఎమోషనల్ పీపుల్ అని అనేవారు. గడిచిన 10 ఏళ్లుగా జపాన్ గురించి వింటూనే ఉన్నాను. ఎట్టకేలకు మిమ్మల్ని చూశాను. థ్యాంక్యూ" అని అన్నారు.

"జపాన్‌కు వచ్చి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలనేది నా కల. అది ఇప్పుడు నెరవేరింది. లక్ష్మి గారిలాగే నేను కూడా ప్రతీ ఏటా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను" అని అభిమానులతో డార్లింగ్ అన్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి ఒకే భాగంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించారు. ప్రభాస్ రాకతో భారతీయ సినిమాకు, జపాన్ ప్రేక్షకులకు మధ్య బంధం మరింత బలపడింది.

ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజి’, ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’, ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘బాహుబలి’ సిరీస్‌లో రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
Prabhas
Baahubali The Epic
SS Rajamouli
Japan
Japanese fans
Indian cinema
Baahubali
Salaar Part 2
Kalki 2898 AD

More Telugu News