Tanzania: భారీ వ‌ర్షాల‌కు తూర్పు ఆఫ్రికా అత‌లాకుత‌లం.. టాంజానియాలో 155 మంది మృతి!

  • భారీ వర్షాల కారణంగా టాంజానియాలో వరదలు, కొండచరియలు విరిగిప‌డి భారీ ప్రాణ‌న‌ష్టం 
  • ఎల్‌నినో కారణంగా టాంజానియా, కెన్యా, బురుండీల్లో ఎడ‌తెరిపిలేని వాన‌లు 
  • 51వేల‌ ఇళ్లు, 2ల‌క్ష‌ల‌ మంది ప్రజలపై ప్రభావం  
155 killed in Tanzania as heavy rains cause floods and landslides

తూర్పు ఆఫ్రికా దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు టాంజానియా, కెన్యా, బురుండీల్లో భారీ వరదలు పొటెత్తాయి. దీంతో ఆయా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇక టాంజానియాలో ఎల్‌నినో కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 155 మంది చనిపోయారని ఆ దేశ‌ ప్రధాని కాసిమ్ మజలివా గురువారం తెలిపారు.

దాదాపు 2 ల‌క్ష‌ల‌ మంది ప్రజలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లు, మౌలిక సదుపాయాలు, పంటలు ధ్వంసమయ్యాయని ప్ర‌ధాని పార్లమెంటులో తెలియ‌జేశారు. కాగా, తూర్పు ఆఫ్రికాలో ఎల్‌నినో తరచుగా విరుచుకుప‌డుతోంది. ఈ ప్రాంతం ఇప్పటికే ప‌లుమార్లు ప్ర‌కృతి ప్ర‌కోపానికి గురైంది. అటు కెన్యాలో ఈ వారం రాజధాని నైరోబీని తాకిన ఆకస్మిక వరదలలో 13 మంది చనిపోయారు. అలాగే బురుండీలో ఒక ల‌క్ష‌ మంది ప్రజలు నెలల తరబడి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నిరాశ్రయులయ్యారు.
 
"ఎల్‌నినో కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బలమైన గాలులు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇవి ప్రాణనష్టం, పంటలు, గృహాలు, పౌరుల ఆస్తుల విధ్వంసంతో పాటు రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలను కూడా దెబ్బ తీశాయి. ఫలితంగా 51వేల‌ కంటే ఎక్కువ ఇళ్లు, 2ల‌క్ష‌ల‌ మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 155 మంది మృతిచెందారు. అలాగే సుమారు 236 మంది గాయపడ్డారు" అని టాంజానియా రాజధాని డోడోమాలోని పార్లమెంట్‌లో ప్రధాని కాసిమ్ మజలివా చెప్పారు.

గతేడాది చివర్లో కెన్యా, సోమాలియా, ఇథియోపియాలో కుండపోత వర్షాలు మరియు వరదల కారణంగా 300 మందికి పైగా చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇక అక్టోబర్ 1997 నుండి జనవరి 1998 వరకు భారీ వరదలు ఈ ప్రాంతంలోని ఐదు దేశాలలో 6వేల‌ కంటే ఎక్కువ మందిని పొట్ట‌న బెట్టుకున్నాయి.

More Telugu News