Rahul Gandhi: నరేంద్ర మోదీ ప్రసంగాల్లో ఆందోళన కనిపిస్తోంది... స్టేజ్‌పై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చు: రాహుల్ గాంధీ

  • మోదీ ఇరవై నాలుగు గంటలూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
  • పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపణ
  • మోదీ కొద్దిమంది వ్యక్తులను బిలియనీర్లుగా చేస్తే కాంగ్రెస్ కోట్లాదిమందిని లక్షాధికారులుగా తయారు చేస్తుందని వ్యాఖ్య
Modi might cry on stage any day says Rahul Gandhi calls PM nervous

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల్లో ఆందోళన కనిపిస్తోందని... మున్ముందు ఆయన స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలూ లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... 24 గంటలూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన ప్రయత్నిస్తుంటారన్నారు. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలను ఆయన విస్మరిస్తున్నారని ఆరోపించారు. వివిధ అంశాల ద్వారా ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు.

ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రధాని మోదీ కొన్నిసార్లు చైనా, పాకిస్తాన్ దేశాల గురించి మాట్లాడుతారని, మరికొన్నిసార్లు మీ మొబైల్ ఫోన్ టార్చ్ లైట్లను ఆన్ చేయమని కోరుతారని, ఇంకొన్నిసార్లు ప్లేట్లపై కొట్టాలని చెబుతారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో పేద ప్రజల సొమ్మును లాక్కున్నారని... దేశంలోని 70 కోట్ల మంది జనాభా వద్ద ఉన్న ఆస్తికి సమానమైన సంపదను మోదీ కేవలం 22 మంది బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు. దేశంలో కేవలం ఒక శాతం మంది 40 శాతం సంపదను నియంత్రిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేస్తుందని హామీ ఇచ్చారు. బిలియనీర్లకు మోదీ నిధులు కట్టబెడితే తాము దేశంలోని పేదలకు నగదు అందిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు. మోదీ కొద్దిమంది వ్యక్తులనే బిలియనీర్లు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది ప్రజలను లక్షాధికారులుగా తయారు చేస్తుందన్నారు.

More Telugu News