Komatireddy Venkat Reddy: అధికారం పోగానే కేసీఆర్‌కు పిచ్చిపట్టింది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • తొలి ముఖ్యమంత్రి దళితుడేనన్న కేసీఆర్.. రెండోసారి కూడా చెయ్యలేదన్న వెంకట్‌రెడ్డి
  • పార్టీ మూతబడే స్థితిలో ఉండడంతో వారికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని ఎద్దేవా
  • అధికారం పోగానే కర్రపట్టుకుని బయటకు వస్తున్నారని వ్యాఖ్య 
  • హరీశ్‌కు రాజీనామా పత్రం ఎన్ని లైన్లు రాయాలో కూడా తెలియదన్న మంత్రి
Minister Komati Reddy Venkat Reddy Once Again Fires On KCR And Harish Rao

అధికారం పోగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే సీఎం అయ్యేది దళితుడేనని కేసీఆర్ చెప్పారని, దళితుడిని సీఎం చెయ్యకుంటే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. తొలిసారి పరిపాలన అనుభవం ఉండాలనే తాను సీఎం అయ్యానన్న కేసీఆర్, రెండోసారి కూడా దళితుడిని సీఎం చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కొద్దిసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల పేరుతో కేసీఆర్ మోసం చేశారని, ఉపాధిహామీ కూలీలకు వంద రోజుల పని కూడా కల్పించలేదని మండిపడ్డారు. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీశ్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీశ్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీశ్‌రావు ఒకటిన్నర పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటివరకు 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారని, మార్చి 1న ఉచిత విద్యుత్ బిల్లు వచ్చిందో, లేదో తెలుసుకోవాలని కోమటిరెడ్డి సూచించారు.

లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరానంటూ హరీశ్‌రావు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఫాం హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్, ఇప్పుడు కర్రపట్టుకుని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి మూడు నెలల్లో 60సార్లు సచివాలయానికి వచ్చారని గుర్తుచేశారు. పార్టీ మూతపడే స్థితికి చేరుకోవడంతో ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావడం లేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

More Telugu News