సంప్రదాయ బద్ధమైన ఫ్యామిలీ .. పద్ధతిగల ఫ్యామిలీ కావడంతో స్వర్ణను తమతో కలుపుకోవడానికి వాళ్లంతా సంశయిస్తూ ఉంటారు. వాళ్లకి ఇష్టమైన పనులను చకచకా చేసి మెప్పించాలని స్వర్ణ భావిస్తుంది. తన కోసం ఫ్యామిలీకి దూరమైన అనిరుధ్ ని, తానే ఆ కుటుంబానికి చేరువ చేయాలని భావిస్తుంది. అందుకోసం తన స్నేహితురాలు కిరణ్మయి సలహా తీసుకుంటుంది. స్వర్ణ వ్యవహార శైలిపట్ల అనసూయ అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంది.
ఇది ఇలా ఉండగా, 'రాజమండ్రి' సెంట్రల్ జైల్లో కరుణ (గుల్షన్ దేవయ్య) శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. అతను జైల్లో ఉండే బయట ఉన్న తన అనుచరులతో చక్రం తిప్పుతుంటాడు. 'ఝాన్సీ' ఎక్కడ ఉందనేది వాళ్లతో వెతికిస్తుంటాడు. ఝాన్సీ ఇప్పుడు 'స్వర్ణ' అనే పేరుతో 'బల్లవరం' విలేజ్ లో ఉందని తెలుసుకుంటాడు. ఆమె అంతు తేల్చాలనే పట్టుదలతో జైలు నుంచి తప్పించుకుంటాడు. కరుణ ఎవరు? అతనితో స్వర్ణకి గల గొడవేంటి? అంతకు ముందు ఝాన్సీపేరుతో ఆమె చేసినదేంటి? అనేది మిగతా కథ.
'మా ఇంటి బంగారం' .. చూడటానికి ఇది టీవీ ఛానల్స్ వారు పెట్టే కాంటెస్ట్ టైటిల్ మాదిరిగా, టీవీ సీరియల్ టైటిల్ మాదిరిగా అనిపిస్తుంది. కానీ ట్రైలర్ లో సమంత ఫైట్స్ ఒక రేంజ్ లో ఉండటం చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఆ టైటిల్ ఏంటి? ఈ ఫైట్స్ ఏంటి? అనే సందేహానికి సమాధానం కోసం థియేటర్స్ కి వెళ్లారు. అలా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు.
కొన్ని సినిమాల కథలను పరిశీలన చేస్తే, మాస్ హీరోలకు ఓ భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ ప్రస్తుతం వాళ్లు చాలా సాఫ్ట్ గా .. కూల్ గా .. తమ ఉనికి బయటపడటం కూడా ఇష్టం లేకుండా చాలా సాదాసీదాగా బ్రతికేస్తుంటారు. దాంతో ఆ హీరో గతంలో ఏం జరిగింది? ఎందుకు అతను తనకి తాను తగ్గిపోయి ఒక యోగిలా బ్రతికేస్తున్నాడనే ఆసక్తి ఆడియన్స్ లో పెరుగుతూ పోతుంది. అలాంటి ఒక ఉత్కంఠను పెంచే కథనే ఇది. కాకపోతే హీరోల స్థానంలో మనకి సమంత కనిపిస్తుందంతే.
భర్తతో కలిసి అత్తగారింటికి వచ్చిన అమాయకురాలైన స్వర్ణ, ఆ ఇంట్లో వాళ్లతో కలిసిపోవడానికి .. శభాష్ అనిపించుకోవడానికిపడే ఆరాటం తాలూకు సన్నివేశాలతో ఈ కథ సరదాగా మొదలవుతుంది. ఎప్పుడైతే జైల్లో ఉన్న విలన్, స్వర్ణ పేరుతో ఉన్న ఝాన్సీని తన అనుచరులతో వెతికించడం మొదలుపెడతాడో అక్కడి నుంచి కథ మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది. స్వర్ణలో బయటికి కనిపించని ఝాన్సీ కోణం, కథపై ప్రేక్షకులు మరింత శ్రద్ధ పెట్టేలా చేస్తుంది.
అత్తగారింట్లో అమాయకురాలైన స్వర్ణగా గుట్టుగా రోజులు నెట్టుకొస్తున్న ఝాన్సీ అంతు చూడటం కోసం విలన్ ఆ ఊళ్లోకి అడుగుపెట్టడంతో కథ మరింత ఉత్కంఠను అందుకుంటుంది. ఇక ఆ తరువాత జరిగే అనూహ్యమైన పరిణామాల మధ్య సెకండాఫ్ వేడెక్కుతుంది. ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణాన్ని దాటుకుని, ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దిశగా ఈ కథ పరిగెడుతుంది. స్వర్ణలో దాగిన ఝాన్సీని ఈ ఎపిసోడ్స్ పూర్తిగా చూపిస్తాయి.
గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కార్ ఛేజింగ్ .. రన్నింగ్ లో ఉన్న బస్సులో ఫైట్ .. క్లైమాక్స్ లో సమంత యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలి. క్లైమాక్స్ జరుగుతున్నప్పుడు మనకి 'జైలర్' సినిమా గుర్తుకు రాకుండా ఉండదు. సమంత .. గుల్షన్ దేవయ్య పోటీపడి చేశారనే చెప్పాలి. ఆరంభంలో సమంత మరీ సన్నబడిపోయి కనిపించినప్పటికీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి ఫరవాలేదు అనిపిస్తుంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీ .. యాక్షన్ పాళ్లను కలిపి ఈ సినిమాను అందించడంలో నందినీ రెడ్డి చాలావరకూ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఓం ప్రకాశ్ ఫొటోగ్రఫీ .. సంతోష్ నారాయణ్ సంగీతం .. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ కథకి మరింత బలాన్ని చేకూర్చుతూ కలిసి సాగుతాయి. కొరియోగ్రఫీ .. ఫైట్స్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. 'ముత్యాల ముగ్గు' సినిమాలోని 'ముత్యమంతా పసుపు' సాంగ్ ఆడియో, థియేటర్లోని వాతావరణాన్ని మార్చేసినట్టుగా అనిపిస్తుంది. 'మహాలక్ష్మి మాత్రమే కాదు .. కాళికాదేవి కూడా దేవతనే' వంటి కొన్ని డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి.
చిన్న కోడలిగా శ్రీముఖి అందంగా మెరిసింది. స్వర్ణ ఫ్రెండ్ పాత్రలో మంజూష నటన మెప్పిస్తుంది. చివర్లో వచ్చిన వెన్నెల కిశోర్ ను చూసిన ప్రేక్షకులు, కాస్త ముందుగా వస్తే బాగుండేదని అనుకుంటారు. కథాకథనాల పరంగా చూసుకుంటే ఆడియన్స్ గెస్ కు అందుతూనే సాగుతున్నప్పటికీ, ట్రీట్మెంట్ పరంగా ఆకట్టుకునే సినిమాగా చెప్పుకోవచ్చు.