‘ఏఐని ఓ వ్యక్తిలా చూడాలి’.. సర్వప్రియానంద ఆసక్తికర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఏఐని ఓ వ్యక్తిలా చూడాలి’.. సర్వప్రియానంద ఆసక్తికర వ్యాఖ్యలు

Swami Sarvapriyananda says AI should be treated like a person
  • మానవుల ప్రత్యేకతపై ఏఐ కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోందని స్వామి సర్వప్రియానంద వ్యాఖ్య
  • ఏఐకి మానవ తరహా చైతన్యం ఉందని దీనర్థం కాదని స్పష్టీకరణ
  • మానవాళి అహంపై నాలుగో అస్త్రంగా ఏఐని అభివర్ణించిన సర్వప్రియానంద
  • మానవుల ప్రత్యేకతపై పునరాలోచన అవసరమని సూచన
  • ఏఐ భవిష్యత్తుపై పరిశోధకుల్లో ఆందోళనలున్నాయని వెల్లడి
కృత్రిమ మేధ (ఏఐ) మానవాళి తన గురించి తాను కలిగి ఉన్న అభిప్రాయాలను మార్చుకునేలా చేస్తోందని న్యూయార్క్‌ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియానంద అన్నారు. మానవుల ప్రత్యేకత ఏంటి? యంత్రాలకు, మనుషులకు మధ్య అసలు తేడా ఏంటి? అనే ప్రశ్నలను ఏఐ తెరపైకి తెస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ వ్యవస్థలను ఒక వ్యక్తిలా పరిగణించాలని, అయితే దానర్థం వాటికి మనుషుల తరహా చైతన్యం లేదా ఆధ్యాత్మిక అవగాహన ఉందని కాదని స్పష్టం చేశారు.

ఢిల్లీలో గురువారం జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమిట్‌ 2026లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌ పరిశోధకులతో చైతన్యం వంటి అంశాలపై చర్చించిన విషయాలను కూడా ప్రస్తావించారు.

మానవులు తమను తాము విశ్వంలో ప్రత్యేకమైనవారిగా భావించే దృక్పథాన్ని శాస్త్రవిజ్ఞానం గతంలో పలుమార్లు సవాలు చేసిందని స్వామి సర్వప్రియానంద వివరించారు. మానసిక విశ్లేషకుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆలోచనలను ప్రస్తావిస్తూ.. మానవాళి అహంపై ఏఐ నాలుగో ప్రధాన అస్త్రంగా మారవచ్చని అన్నారు.

“సృజనాత్మక మేధస్సు మనకే సొంతమని భావించాం. కానీ ఇప్పుడు అత్యంత గొప్ప మానవ మేధావులు చేయగలిగిన పనులను ఏఐ మరింత మెరుగ్గా చేయగలదని చూస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మనుషులను ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలపై సమాజం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మానవుల ప్రత్యేకత ఏంటి? మన సామర్థ్యాలను, సమయాన్ని ఏ రంగాల్లో వినియోగించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలని సూచించారు.

ఏఐ వ్యవస్థలు మరింత అభివృద్ధి చెంది, మనుషులతో సహజంగా సంభాషించే స్థాయికి చేరుతున్న కొద్దీ ప్రజలు వాటితో వ్యక్తిగత సంబంధాల తరహాలో వ్యవహరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఏఐకి నిజంగా చైతన్యం ఉందా? లేదా? అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదని పేర్కొన్నారు.

ఆంథ్రోపిక్‌లోని పరిశోధకులతో జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న వారిలో చాలామంది దాని భవిష్యత్‌ ప్రభావాలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

అధునాతన ఏఐ నమూనాల్లో అనూహ్య ప్రవర్తనపై పరిశోధకులు దృష్టి సారిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ‘పర్సోనా డ్రిఫ్ట్‌’ అనే పరిణామాన్ని పరిశీలిస్తున్నారని వివరించారు. ఒక నిర్దిష్ట పాత్ర, గుర్తింపు లేదా ప్రవర్తనా విధానాన్ని అనుసరించే సమయంలో ఏఐ సమాధానాలు, తర్కించే తీరు మారడాన్ని ఈ పదంతో సూచిస్తారు.
Advertisement
Swami Sarvapriyananda
Artificial Intelligence
NDTV World Summit 2026
Vedanta Society New York
AI Persona Drift
Human Consciousness

More Telugu News