పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది: నూకసాని బాలాజీ

Nukasani Balaji highlights Andhra Pradesh tourism growth under CM Chandrababu Naidu
  • రుషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారంటూ జగన్‌పై బాలాజీ తీవ్ర విమర్శలు
  • గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చారని తీవ్ర ఆరోపణలు
  • పర్యాటక అభివృద్ధికి కొత్త పాలసీ, ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని స్పష్టీకరణ
  • 24 నెలల్లోనే రూ.19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఛైర్మన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నూకసాని బాలాజీ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో పర్యాటక రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, ఓర్వలేక గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు. గత గొడ్డలి పార్టీ పాలనలో పర్యాటక రంగం సర్వనాశనమైందని బాలాజీ ధ్వజమెత్తారు. 

"ప్రజావేదిక కూల్చివేతతోనే తన విధ్వంసకర పాలన ఎలా ఉంటుందో జగన్ చెప్పకనే చెప్పారు. రోజుకు రూ.2 లక్షల ఆదాయం తెచ్చే రుషికొండ పర్యాటక కేంద్రాన్ని ధ్వంసం చేసి, తన విలాసాల కోసం రూ.500 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. రెండేళ్లయినా ఆ భవనాలను వినియోగించుకోలేని దుస్థితి. రూ.28 వేల కోట్ల పెట్టుబడులు తెస్తానని చెప్పి, ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేదు. టూరిజం కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి, ఆస్తులను సొంత అనుచరులకు కట్టబెట్టారు. రాష్ట్రాన్ని గంజాయికి హబ్‌గా మార్చి, యువతను నేరాల వైపు మళ్లించారు" అని బాలాజీ తీవ్ర ఆరోపణలు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లోనే పర్యాటక రంగంలో రూ.19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు. విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా వచ్చిన ఈ పెట్టుబడులతో 91,960 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పటికే 18 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,376 కోట్ల పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. పర్యాటకుల ఆకాంక్షలకు అనుగుణంగా గోవా తరహాలో విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్‌ పాలసీ తీసుకొస్తే, దానిపైనా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నామని, 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని బాలాజీ వివరించారు. కేంద్రం సహకారంతో రూ.441 కోట్లతో టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతిలో 'అవకాయ ఫెస్టివల్' వంటివి నిర్వహిస్తూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తున్నామని తెలిపారు. అరకు కాఫీ స్టాళ్లు, 14 చోట్ల ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు, టెంట్ సిటీస్, కొత్తగా 10 రోప్‌వేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, 20 బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు సాధించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన తీర్పునకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని బాలాజీ పేర్కొన్నారు.
Go Back to Shorts
Nukasani Balaji
AP Tourism Development Corporation
Andhra Pradesh Tourism Policy
Chandrababu Naidu Tourism Vision
Vizag Tourism Investment
Rushikonda Palace Controversy

More Telugu News