‘నాన్నా... నన్ను కాపాడండి’.. లక్నో అగ్నిప్రమాదం వెనుక గుండెల్ని పిండేస్తున్న కథలు!
- లక్నో అగ్నిప్రమాదంలో 18 మంది మృతి
- తండ్రికి చివరి ఫోన్‌కాల్ చేసిన ఓ యువకుడు
- సాయం కోసం కుటుంబాలకు కాల్ చేసిన విద్యార్థులు
- బాత్రూమ్‌ల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం
- దట్టమైన పొగతో ఊపిరాడక పలువురి మృతి
లక్నో అగ్నిప్రమాదం వెనుక వెలుగులోకి వస్తున్న కథలు ప్రతిఒక్కరినీ కలచివేస్తున్నాయి.
చివరి క్షణాల్లో
లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఘటన తర్వాత బయటకు వస్తున్న వివరాలు హృదయ విదారకంగా ఉన్నాయి. మృతుల్లో 23 ఏళ్ల సుఖ్‌మనీ సింగ్ కూడా ఉన్నాడు. మంటలు భవనాన్ని చుట్టుముట్టిన సమయంలో అతడు తన తండ్రికి ఫోన్ చేసి ‘‘నాన్నా.. ఇక్కడ మంటలు అంటుకున్నాయి.. నన్ను కాపాడండి’’ అని వేడుకున్నాడు. అది వారి మధ్య చివరి సంభాషణగా మిగిలిపోయింది. మరోవైపు పలువురు విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌లు చేసి పరిస్థితి వివరించినట్లు తెలుస్తోంది. సాయం అందుతుందన్న ఆశతో కొందరు చివరి వరకు ఎదురుచూశారు.
బాత్రూమ్‌ల్లో దాక్కున్నా
భయంకరమైన మంటలతో భవనమంతా దట్టమైన పొగ అలముకొంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో కొందరు విద్యార్థులు బాత్రూమ్‌లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఉంటే పొగ నుంచి తప్పించుకోవచ్చని భావించినా పరిస్థితి మరింత విషమించింది. కొందరు కిటికీల వద్దకు వెళ్లి సాయం కోసం అరవగా, మరికొందరు మొదటి అంతస్తు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. రెండు గంటలకుపైగా భవనంలో దట్టమైన పొగ నిండిపోవడంతో పలువురు ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అనుమతుల ఉల్లంఘన
ఈ ప్రమాదం తర్వాత భవన నిర్మాణంపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2016లోనే అక్రమ నిర్మాణాల కారణంగా ఈ భవనానికి కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ ఉత్తర్వులు తర్వాత రద్దయ్యాయి. నివాస అవసరాల కోసం అనుమతి పొందిన భవనంలో వాణిజ్య కార్యకలాపాలు నడిచినట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న దుకాణాల నుంచే మంటలు మొదలై క్రమంగా పై అంతస్తులకు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ఎస్‌ఐటీ దర్యాప్తు ప్రారంభమైంది. ఇప్పటికే భవన యజమానులు సహా నలుగురిని అరెస్ట్ చేయగా, పలువురు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు.