హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లో ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
- డబ్బు లేదనే కారణంతో ఏ రోగికి చికిత్స ఆగకూడదన్నదే లక్ష్యమన్న బాలకృష్ణ
- అమరావతిలోనూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడి
- ఇప్పటివరకు 3.75 లక్షల మందికి ఓపీ సేవలు అందించినట్లు వివరణ
ఈ సభలో తాను నటుడిగానో, ఎమ్మెల్యేగానో కాకుండా ఒక కొడుకుగా మాట్లాడుతున్నానని బాలకృష్ణ భావోద్వేగంగా ప్రసంగించారు. తన తల్లి బసవతారకం గారు క్యాన్సర్‌తో బాధపడ్డారని, డబ్బు ఉన్నందున తాము పోరాడగలిగామని గుర్తు చేసుకున్నారు. "డబ్బు లేని పేదలు ఈ మహమ్మారి బారిన పడితే వారి పరిస్థితి ఏంటి?" అని తన తల్లి అడిగిన మాటే ఈ ఆసుపత్రి ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిందని వివరించారు.
డబ్బు లేదనే కారణంతో ఏ ఒక్క క్యాన్సర్ రోగికి చికిత్స అందకుండా పోకూడదన్నదే తమ ధ్యేయమని బాలకృష్ణ పునరుద్ఘాటించారు. 25 ఏళ్ల క్రితం చేసిన ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోజుకు 35 నుంచి 40 సర్జరీలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 3.75 లక్షల మందికి ఓపీ సేవలు అందించామని తెలిపారు. దేశంలోనే తొలి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాల్లో తమది ఒకటని గర్వంగా చెప్పారు.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రి సేవలను కూడా మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ, ఏపీ మంత్రి సత్యకుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.