నీట్ రీ-టెస్ట్‌లో మున్నాభాయ్' తరహా భారీ స్కామ్.. బట్టబయలు!

Huge scam in NEET re-test exposed like Munna Bhai style
  • బీహార్‌లో నీట్ రీ-టెస్ట్ సందర్భంగా ప్రాక్సీ రాకెట్ బట్టబయలు
  • లఖిసరాయ్‌లో 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • అరెస్టయిన వారిలో మెడికల్ విద్యార్థులు, బయోమెట్రిక్ సిబ్బంది
నీట్-యూజీ 2026 రీ-టెస్ట్ సందర్భంగా బీహార్‌లో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' తరహాలో చోటుచేసుకున్న భారీ ప్రాక్సీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. లఖిసరాయ్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా 24 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది ప్రాక్సీ అభ్యర్థులు, పలువురు మెడికల్ విద్యార్థులతో పాటు బయోమెట్రిక్ ఏజెన్సీకి చెందిన 14 మంది సిబ్బంది ఉండటం గమనార్హం. అసలు విద్యార్థులకు బదులుగా ఇతరులు పరీక్ష రాసే ప్రయత్నం బట్టబయలైంది.

ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ రీ-టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. లఖిసరాయ్‌లోని కేంద్రీయ విద్యాలయ, కేఆర్‌కే హైస్కూల్, హసన్‌పూర్ హైస్కూల్ తదితర పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో ఫొటోలు, వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పాట్నా మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే విద్యార్థి, బయోమెట్రిక్ ఏజెన్సీ ఉద్యోగిగా నటిస్తూ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

గతంలో నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న అర్పిత్ రాజ్‌తో పాటు, బీహెచ్‌యూ, ఎయిమ్స్ రాయ్‌బరేలీ, నలందా మెడికల్ కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. అసలు అభ్యర్థుల తరఫున పరీక్ష రాసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఒప్పందాలు కుదిరినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

లఖిసరాయ్ జిల్లా కలెక్టర్ (డీఎం), ఎస్పీ సహా ఉన్నతాధికారులు స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి విచారణను ముమ్మరం చేశారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు, దేశవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, అక్కడక్కడా వెలుగుచూసిన కొన్ని ఘటనలు మినహా ఎలాంటి పేపర్ లీక్‌లు జరగలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది.
Go Back to Shorts
NEET
Bihar NEET Scam
Proxy Candidates
Lakhisarai Police
NEET Re-test
NTA

More Telugu News