ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు!
- ఫ్రిజ్ నీళ్లు ఆలస్యమయ్యాయని తల్లిపై కొడుకు దాడి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి
- కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రడలో ఘటన
- పూజ గదిలోని చెక్క బల్లకేసి తల్లి తలను కొట్టిన నిందితుడు
పోలీసుల కథనం ప్రకారం.. చిత్రడ గ్రామంలోని ఈబీసీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు రాజబాబుకు అతని తల్లి నాగమణి భోజనం వడ్డించారు. ఆ సమయంలో అతను ఫ్రిజ్లో నుంచి చల్లటి నీళ్లు కావాలని అడగ్గా, ఆమె తీసుకురావడం కాస్త ఆలస్యమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజబాబు, తానే వేగంగా ఫ్రిజ్ వైపు వెళ్లగా, ఆ తలుపు తగిలి స్వల్ప గాయమైంది. దీంతో మరింత ఆవేశానికి గురైన అతను, తల్లి నాగమణిని పట్టుకుని ఇంట్లోని పూజ గదిలో ఉన్న చెక్క బల్లకు ఆమె తలను బలంగా కొట్టాడు.
ఈ దాడిలో నాగమణి తలకు తీవ్ర గాయమై, అధిక రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన ఆమె భర్త త్రిమూర్తులు, రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను గమనించి బంధువుల సాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జూన్ 9 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు.
ఈ ఘటనపై పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లోకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి చిన్న విషయానికే కన్నతల్లి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.