ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి.. వెనుక పాకిస్థాన్ ఐఎస్‌ఐ హస్తం!

RSS office petrol bomb attack involves Pakistan ISI hands
  • రాంచీలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై జూన్ 16న అర్ధరాత్రి పెట్రోల్ బాంబులతో దాడి 
  • ముగ్గురు స్థానిక నిందితులను అరెస్ట్ చేసిన ఝార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్  
  • పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్‌తో దుబాయ్ యాప్స్ ద్వారా నిందితుల సంప్రదింపులు 
  • దాడి విజయవంతమైతే రూ. 1.5 లక్షలు ఇస్తామని ఒప్పందం
  • అడ్వాన్స్‌గా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 10,000 బదిలీ 
  • లక్నోలో మరో పెద్ద ఆపరేషన్ కోసం రైలులో వెళ్తుండగా అరెస్ట్
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంతీయ కార్యాలయంపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. జూన్ 16-17 మధ్య రాత్రి నివారణ్‌పూర్ ప్రాంతంలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్‌పై వచ్చి పెట్రోల్ బాంబులు విసిరారు. ఒక బాంబు భవనంపై పడి స్వల్ప మంటలు చెలరేగగా, మరొకటి ప్రవేశ ద్వారం వద్ద పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై తక్షణమే స్పందించిన ఝార్ఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడైన సైఫ్ అన్సారీ పోలీసుల కస్టడీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా జరిపిన కాల్పుల్లో అతడి కాలికి గాయమైంది. కేసు తీవ్రత దృష్ట్యా దీనిని ఝార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు బదిలీ చేసి, నిందితులపై ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఏటీఎస్ జరిపిన ప్రాథమిక విచారణలో ఈ దాడి వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్ దాగి ఉన్నవిషయం వెలుగులోకి వచ్చింది. నిందితులైన సైఫ్ అన్సారీ, అమన్ అన్సారీ, సాయం సుజాన్‌లు పాకిస్థాన్ ఐఎస్‌ఐ నిధులతో నడుస్తున్న ‘తెహ్రీక్-ఎ-తాలిబాన్ హిందుస్థాన్’ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. గతంలో దుబాయ్ వెళ్లిన సమయంలో వీరికి పాకిస్థాన్‌కు చెందిన కీలక హ్యాండ్లర్ షాబాజ్ రాణా అలియాస్ భట్టితో పరిచయం ఏర్పడింది. భారతదేశంలో అలజడి సృష్టించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై దాడి చేయాలని, అందుకు రుజువుగా వీడియో తీసి పంపాలని భట్టి వీరికి రూ. 1.5 లక్షల సుపారీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే బోటిమ్, వాట్సాప్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ, అడ్వాన్స్‌గా క్యూఆర్ కోడ్ సాయంతో రూ. 10,000 బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు డిజిటల్ ఆధారాలను ఏటీఎస్ సేకరించింది.

అయితే ఈ నెట్‌వర్క్ కేవలం ఝార్ఖండ్‌కే పరిమితం కాలేదని, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఒక పెద్ద స్లీపర్ సెల్‌తో వీరికి సంబంధాలు ఉన్నట్లు తాజా విచారణలో స్పష్టమైంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై దాడి ముగిసిన వెంటనే, అంతకంటే పెద్ద వినాశకరమైన ఆపరేషన్ కోసం లక్నో చేరుకోవాలని పాక్ హ్యాండ్లర్ నుంచి వీరికి ఆదేశాలు అందాయి. లక్నోలో ఉన్న మరొక ఉగ్రవాద ఏజెంట్‌ను కలిసి తదుపరి వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది. దాడి ముగించుకుని కాన్పూర్ మీదుగా లక్నో వెళ్లే రైలు ఎక్కిన నిందితులను ఝార్ఖండ్‌లోని కోడెర్మా సమీపంలో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. నిందితుల ఫోన్ల నుంచి లభించిన ఆడియో రికార్డింగుల ఆధారంగా లక్నోలోని వారి నెట్‌వర్క్‌ను పట్టుకోవడానికి కేంద్ర నిఘా సంస్థలు, ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ సంయుక్తంగా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నాయి. 
Go Back to Shorts
RSS
Ranchi Petrol Bomb Attack
Pakistan ISI Terror Link
Jharkhand ATS Investigation
Tehreek e Taliban Hindustan
Lucknow Sleeper Cell

More Telugu News