రెండు కోట్ల మార్కును దాటిన టీవీకే సభ్యత్వం.. సీఎం విజయ్ పార్టీలో కొత్త జోష్
- ఇటీవల ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీవీకే
- 'మై టీవీకే' యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు
- ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించిన విజయ్
- ఎన్నికల తర్వాత కూడా పార్టీకి పెరుగుతున్న ఆదరణ
'మై టీవీకే' మొబైల్ యాప్ ద్వారా చేపట్టిన డిజిటల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించడంతో సభ్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు పార్టీ వెల్లడించింది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పక్షంగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి మిత్రపక్షాల మద్దతుతో మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయంతో రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరపడినట్లయింది.
2024 ఫిబ్రవరిలో నటుడు విజయ్ ఈ పార్టీని స్థాపించారు. ఎన్నికలకు ముందే పార్టీ సభ్యుల సంఖ్య సుమారు 1.5 కోట్ల నుంచి 1.8 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా వేయగా, పార్టీ ఆవిర్భావ సమయంలోనే నిర్దేశించుకున్న రెండు కోట్ల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ఇప్పుడు చేరుకుంది. కేవలం తమిళనాడు నివాసితులకు మాత్రమే ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి సభ్యత్వం కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మైలురాయిని చేరుకోవడంతో పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.