ఏఐ డీప్‌ఫేక్‌తో వేధింపులు.. కాంతార హీరోయిన్ కేసులో కీలక పురోగతి
- కాంతార నటి రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ముగ్గురి అరెస్ట్
- బెంగళూరుకు చెందిన ఇద్దరు, బాగల్కోట్కు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఏఐ టెక్నాలజీతో నటి అశ్లీల చిత్రాలు సృష్టించి సర్క్యులేట్ చేసిన వైనం
- తన పరువుకు భంగం కలిగించారని మే నెలలో ఫిర్యాదు చేసిన నటి
- ఐటీ చట్టం కింద నిందితులపై కేసుల నమోదు
నిందితులను బాగల్కోట్ జిల్లాకు చెందిన రవికుమార్ (24), బెంగళూరు కామాక్షిపాళ్యకు చెందిన చంద్రకాంత్ (33), నాగసంద్రకు చెందిన రంజిత్ (25)గా పోలీసులు గుర్తించారు. ఐటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
గత మే నెలలో రుక్మిణి వసంత్ బికినీ ధరించినట్లుగా ఏఐ సాంకేతికతతో సృష్టించిన కొన్ని నకిలీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ముఖాన్ని వేరొకరి శరీరానికి అతికించి, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ ఫోటోలను సృష్టించారని రుక్మిణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటువంటి నకిలీ కంటెంట్‌ను షేర్ చేయవద్దని ఆమె ఈ సందర్భంగా తన అభిమానులను కోరారు.
నటి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ కంటెంట్‌ను సర్క్యులేట్ చేసిన 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసులో పురోగతి సాధించారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి అశ్లీల కంటెంట్ సృష్టించడంపై పౌర సమాజంలో మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.