వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు!
- ఐపీఎల్ లో పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
- ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపిక
- వయసు చిన్నది కావడంతో విదేశీ టూర్‌కు తల్లిదండ్రులను అనుమతించిన బీసీసీఐ
- ప్రయాణ, వసతి ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించిన బోర్డు కార్యదర్శి
- జూన్ చివర్లో ఐర్లాండ్‌తో, జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత్
ఈ నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. వైభవ్ ఇప్పుడే పాఠశాల చదువు పూర్తి చేసుకుని వచ్చాడని, అంతర్జాతీయ క్రికెట్ వాతావరణానికి అలవాటు పడటానికి అతడికి కుటుంబ సభ్యుల మానసిక మద్దతు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. అందువల్ల అతడి తల్లిదండ్రుల ప్రయాణ, వసతి, ఇతర అన్ని రకాల ఖర్చులను బోర్డే పూర్తిగా భరిస్తుందని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని తట్టుకుని, కొత్త వాతావరణంలో వైభవ్ సులభంగా సెట్ అవ్వడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని బోర్డు భావిస్తోంది. కొడుకు ఎదుగుదలకు తల్లిదండ్రులు అందిస్తున్న మద్దతును సైకియా అభినందించారు.
భారత జట్టు ఈ జూన్ చివరి వారంలో ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జులైలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. గతంలో అండర్-19 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ, దశాబ్దాల కాలంలో సీనియర్ భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ వైట్ బాల్ సిరీస్‌లలో వైభవ్‌కు మంచి అవకాశం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.