విప్‌ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్‌కు షాక్‌ ఇచ్చిన ఎంపీలు!

Uddhav Thackeray shocked as MPs ignore party whip for key meeting
  • 9 మంది ఎంపీల్లో ముగ్గురే సమావేశానికి హాజరు
  • ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి ఆరుగురు ఎంపీల గైర్హాజరు
  • గైర్హాజరైన వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంజయ్‌ రౌత్‌
  • సమావేశానికి వచ్చిన వారే తమవాళ్లుని వ్యాఖ్య
  • మిగతావాళ్లు ద్రోహులంటూ విమర్శలు
  • వారు ఏక్‌నాథ్‌ షిండే శివసేనలో చేరనున్నారని జోరుగా ప్రచారం
ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పార్టీ విప్‌ జారీ చేసినప్పటికీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన కీలక సమావేశానికి 9 మంది లోక్‌సభ ఎంపీల్లో కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. దీంతో పార్టీ మరోసారి చీలిక దిశగా వెళుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

పార్టీ ఎంపీల కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అరవింద్‌ సావంత్‌, అనిల్‌ దేశాయ్‌, రాజాభౌ వాజే మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు దూరంగా ఉండటం కలకలం రేపింది. ఈ పరిణామం ఏక్‌నాథ్‌ షిండే శివసేనలో చేరికపై వస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. సమావేశానికి ముందు హాజరైన ఎంపీల పేర్లను ప్రత్యేకంగా నమోదు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన సంజయ్‌ రౌత్‌ గైర్హాజరైన ఎంపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి వచ్చిన వారే తమవాళ్లని, రాని వాళ్లు ద్రోహులని మండిపడ్డారు.

పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నవారిపై కూడా రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులతో తమను భయపెట్టలేరని వ్యాఖ్యానించారు. అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకూ సిద్ధమేనని చెప్పారు. ఆరుగురు ఎంపీల మద్దతుతో ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు కోరుతూ తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను సంప్రదించినట్లు బుధవారం వార్తలు వెలువడ్డాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు పొందాలంటే మూడొంతుల మద్దతు అవసరం. ప్రస్తుతం గైర్హాజరైన ఎంపీల సంఖ్య కూడా ఆ స్థాయిలో ఉండటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఇప్పటివరకు ఆయా ఎంపీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏక్‌నాథ్‌ షిండే కూడా మౌనం పాటిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
Advertisement
Uddhav Thackeray
Shiv Sena UBT
Maharashtra politics
Sanjay Raut
Eknath Shinde
Lok Sabha MPs rebellion

More Telugu News