ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న సమాజ్‌వాదీ పార్టీ నేత
- సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక ఖాయమన్న యూపీ మంత్రి రాజ్‌భర్
- అమిత్ షాకు ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ లేఖ ఇచ్చారని ఆరోపణ
- అవినీతి కేసుల ఒత్తిడి వల్లే నేతలు పార్టీ వీడుతున్నారని వ్యాఖ్య
- రాజ్‌భర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్
- రాజ్‌భర్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని చురక
రాజ్‌భర్ సామాజిక మాధ్యమ వేదికగా ఈ ఆరోపణలు గుప్పించారు. "సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక అనివార్యం. ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ ఇప్పటికే బీజేపీలో చేరనున్న నేతల జాబితాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందజేశారు" అని రాజ్‌భర్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. మైనింగ్ కుంభకోణం, గోమతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు వంటి అవినీతి కేసుల ఒత్తిడి కారణంగానే ఎస్పీ నేతలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. "మహారాష్ట్ర, బెంగాల్ పరిణామాలను పక్కన పెట్టండి.. ఇప్పుడు యూపీ వంతు వచ్చింది" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అయితే రాజ్‌భర్ ఆరోపణలను ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. "నేను ఏదైనా లేఖ ఇచ్చానో లేదో అమిత్ షా జీనే అడిగితే తెలుస్తుంది. దేశంలో ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఆయన నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తుంటారు. మా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు" అని ఆయన స్పష్టం చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీతో పొత్తు పెట్టుకున్న రాజ్ భర్, ఆ తదనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో తిరిగి ఎన్డీయే కూటమిలో చేరారు.