భారత ప్రభుత్వంపై టెలిగ్రామ్ సీఈవో ఫైర్.. 15 కోట్ల మందిని శిక్షిస్తారా? అంటూ ఆగ్రహం!
- భారత్‌లో టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం
- నీట్ పేపర్ లీక్‌లను అరికట్టేందుకే ఈ చర్య అని ప్రభుత్వం వెల్లడి
- మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పైనా తాత్కాలికంగా ఆంక్షలు
జూన్ 21న జరగబోయే 'నీట్-యుజి 2026' (NEET-UG) పునఃపరీక్ష నేపథ్యంలో.. క్వశ్చన్ పేపర్ల లీకేజీని, మోసాలను అరికట్టేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌ను జూన్ 22 వరకు తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీనిపై దురోవ్ స్పందిస్తూ.. గత కొన్ని వారాలుగా లీక్డ్ మెటీరియల్స్, స్కామ్స్ షేర్ చేస్తున్న వందలాది ఛానెళ్లను తాము ఇప్పటికే తొలగించామని స్పష్టం చేశారు. మూలం టెలిగ్రామ్ కాకపోయినప్పటికీ సమస్యను పరిష్కరించడానికి తాము ఎంతో కృషి చేశామని, ఇలాంటి సమయంలో యాప్‌ను పూర్తిగా బ్యాన్ చేయడం పెద్ద పొరపాటని ఆయన తన వ్యక్తిగత టెలిగ్రామ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.
మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై వివాదం
కేంద్ర ప్రభుత్వం కేవలం యాప్‌ను బ్లాక్ చేయడమే కాకుండా, జూన్ 30 వరకు భారతీయ వినియోగదారుల కోసం 'మెసేజ్ ఎడిటింగ్' (Message-editing) ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. పరీక్ష ముగిసిన తర్వాత పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు (Fabricated Proofs) సృష్టించడానికి ఈ ఫీచర్‌ను కేటుగాళ్లు వాడుతున్నారని ఎన్టీఏ ఆరోపించింది. అయితే, ఇటువంటి 'బ్యాక్‌డేటింగ్ స్కామ్‌లను' అరికట్టడానికి తాము ఇప్పటికే "Edited" లేబుల్‌ను మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులు చేస్తున్నామని దురోవ్ వెల్లడించారు.
ఒక మెసేజింగ్ యాప్‌పై ఈ స్థాయిలో నిషేధం విధించడం భారత్‌లో ఇదే తొలిసారి. టెలిగ్రామ్ బ్లాక్ అవ్వడంతో స్టడీ మెటీరియల్స్, విద్యా సంబంధిత గ్రూపులపై ఆధారపడే లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తాత్కాలిక అసౌకర్యానికి ఎన్టీఏ విచారం వ్యక్తం చేసినప్పటికీ.. కోట్ల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత దృష్ట్యా ఈ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.