ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్ వ్యాఖ్యల దుమారం
- దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయన్న గెహ్లోట్
- 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న కాంగ్రెస్ నేత
- మత విద్వేషాలను అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని ఆరోపణ
- హిందుత్వ మద్దతుదారులను రెచ్చగెట్టే గెలుస్తారా? అని ప్రశ్న
- కాంగ్రెస్‌కు హిందుత్వ అంటే ద్వేషమంటూ బీజేపీ మండిపాటు
బీజేపీ హిందుత్వ పేరుతోనే రాజకీయాలు చేస్తోందని గెహ్లాట్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికీ టికెట్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ కనీసం కొన్ని స్థానాలైనా కేటాయించి ఉంటే దేశానికి వేరే సందేశం వెళ్లేదని అన్నారు. హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి అధికారంలో కొనసాగాలనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఇందిరా గాంధీ వంటి బలమైన నాయకురాలు ఇప్పుడుంటే బీజేపీపై నిషేధం విధించేవారు. కేవలం హిందుత్వ అజెండాతోనే పార్టీని నడపాలనుకుంటున్నారా? హిందువుల పేరుతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు.
అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌కు హిందువులు, హిందుత్వం అంటే ద్వేషమని ఆరోపించారు. హిందుత్వం ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు ఇప్పటికే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
గెహ్లాట్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి నాటి మనస్తత్వాన్ని గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. హిందుత్వ గురించి మాట్లాడితే తప్పుగా చూస్తూ, ముస్లింల ఓటు బ్యాంకు రాజకీయాలనే కాంగ్రెస్ చేస్తోందని అన్నారు.