అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. టోలెడో పండుగలో విషాదం

Toledo shooting 12 injured at annual festival in Ohio
  • టోలెడో ఉత్సవంలో శనివారం సాయంత్రం కాల్పులు
  • ఇద్దరు దుండగుల పరస్పర కాల్పుల్లో 12 మందికి గాయాలు
  • గాయపడిన వారిలో పిల్లలు,  వృద్ధులు
  • కాల్పుల నేపథ్యంలో మిగిలిన ఫెస్టివల్ కార్యక్రమాల రద్దు
  • పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు
అమెరికాలో తుపాకి సంస్కృతి మరోసారి పడగ విప్పింది. ఒహియో రాష్ట్రంలోని టోలెడో నగరంలో శనివారం సాయంత్రం జరిగిన 'ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్' (Old West End Festival)లో దుండగులు జరిపిన కాల్పుల్లో కనీసం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, పండుగ వాతావరణంలో ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో జనం ప్రాణాలు చేతబట్టుకుని పరుగులు తీశారు.

చారిత్రాత్మక నగరమైన టోలెడోలో 53వ వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లైవ్ మ్యూజిక్, ఫ్యామిలీ ఈవెంట్లతో కుటుంబాలన్నీ పండుగను ఆస్వాదిస్తున్న తరుణంలో.. సాయంత్రం 5:37 గంటల ప్రాంతంలో డెలావేర్, గ్లెన్‌వుడ్ అవెన్యూల సమీపంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకరిపై ఒకరు పరస్పరం కాల్పులు జరుపుకోగా, అక్కడ గుమిగూడిన సామాన్య ప్రజలు ఈ క్రాస్‌ఫైరింగ్‌ (Crossfire) లో చిక్కుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

 షూటర్ల కోసం వేట
సమాచారం అందుకున్న వెంటనే టోలెడో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు. గాయపడిన వారిలో 14 ఏళ్ల మైనర్ల నుంచి 61 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారని డిప్యూటీ పోలీస్ చీఫ్ జో హెఫెర్నన్ తెలిపారు. ఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందించి, బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ హింసాత్మక ఘటన తర్వాత ఉత్సవానికి సంబంధించిన మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు స్థానిక యంత్రాంగం ప్రకటించింది.

కాల్పులకు తెగబడిన నిందితులెవరూ ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. వారు ఘటనా స్థలం నుంచి పరారైనట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను, ప్రత్యక్ష సాక్షుల ప్రకటనలను పరిశీలిస్తున్నారు. పండుగకు వచ్చిన వారు తమ మొబైల్స్‌లో తీసిన ఫోటోలు లేదా వీడియోలను దర్యాప్తు కోసం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘోర కాల్పుల ఘటనను ఒహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్రంగా ఖండించారు.   
Go Back to Shorts
Toledo Shooting
Old West End Festival
Ohio Gun Violence
Toledo Police
Mike DeWine
Ohio Shooting News
Toledo Ohio Violence
US Mass Shooting
Festival Shooting Victims

More Telugu News