అమెరికాలో తెలుగు యువకుడి హఠాన్మరణం... నెల రోజుల్లో పెళ్లి!

Telugu Youth Nithin Reddy Dies of Heart Attack in US Before Wedding
  • మృతుడిని ఏలూరుకు చెందిన నితిన్ రెడ్డి గోపిరెడ్డిగా గుర్తింపు
  • వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా విషాద ఘటన
  • ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం
అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన మరో తెలుగు యువకుడు ఆకస్మికంగా మరణించాడు. వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు గుండెపోటుతో కన్నుమూయడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదానికి కారణమైంది. ఈ ఘటన అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రం, బర్లింగ్టన్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన నితిన్ రెడ్డి గోపిరెడ్డి (27) ఉపాధి నిమిత్తం అమెరికాలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. నితిన్ రెడ్డికి జూన్ నెలలో వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో పెళ్లికొడుకు కాబోతున్న తరుణంలో అతడు గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

నితిన్ రెడ్డి ఇటీవలే ఉద్యోగం కోల్పోవడంతో, పెళ్లి సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మానసిక ఆందోళనే గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని సన్నిహితులు భావిస్తున్నారు. కాబోయే భర్త మరణవార్త తెలియడంతో వధువు కుటుంబం, పెళ్లి ఏర్పాట్లలో ఉన్న నితిన్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నితిన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
Go Back to Shorts
Nithin Reddy
Nithin Reddy death
Telugu youth death USA
Heart attack USA
Eluru
Andhra Pradesh
Vermont
Burlington
Sudden death
Job loss stress

More Telugu News